చిక్కుల్లో నగ్మా
సినిమాల్లో డైరెక్టర్ చెప్పినట్టు నటించి, డైలాగ్ రైటర్ రాసిన డైలాగులు చెప్పడం అలవాటైన నటి నగ్మాకి సభల్లో ఎలాంటి ప్రాంప్టింగూ లేకుండా మాట్లాడటం మహా ఇబ్బందికరంగా మారింది. ఆమె అవగాహన లేని మాటలు మాట్లాడుతూ రాజకీయాల్లో అనుభవ రాహిత్యాన్ని చాటుకుంటున్నారు.
ఇటీవల మోడీకి ఓటేయనివారు పాకిస్తాన్ వెళ్ళిపోవాల్సిందేనంటూ బిజెపి నాయకుడు గిరిరాజ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించాలనుకున్నారు నగ్మా. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించే క్రమంలో..''భారతరత్న''ను కాశ్మీర్ వేర్పాటు వాద ఉద్యమనాయకుడు సయ్యద్ ఆలీషా గిలానీకి ఇచ్చేశారు నగ్మా. మోడీకి ఓటేయకుంటే..భారతరత్న గిలానీజీ కూడా పాకిస్తాన్ వెళ్ళిపోవాల్సిందేనా అంటూ తప్పులో కాలేశారు.
భారతీయులంతా గౌరవించే విఖ్యాత షెహనాయ్ విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పేరు చెప్పబోయి నగ్మా గిలానీ పేరుచెప్పివుంటారని ఆమె ఎంపీగా పోటీ చేస్తున్న మీరట్ కాంగ్రెస్ నేతలు ఆమెను సమర్ధించే ప్రయత్నం చేశారు.
ఏది ఏమైనా నగ్మా సభలకు మాత్రం జనం పెద్ద సంఖ్యలో జనం వస్తున్నారు. అయితే నగ్మా ప్రచారానికి వెళ్ళిన ప్రతిచోటా ఏదో ఒకటి జరుగుతోంది. ముఖ్యంగా కార్యకర్తలు ఆమెచుట్టూ మూగేస్తున్నారు. అభిమానులు ఆమెను దగ్గరనుంచి చూసే ప్రయత్నంలో తోపులాటలు సర్వసాధారణమైపోతున్నాయి. పనిలోపనిగా ఆకతాయిలు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.
నామినేషన్ వేసిన మర్నాడే.. ఓ ఎమ్మెల్యే ఆమెను పబ్లిగ్గా ముద్దుపెట్టుకున్నాడు. మరోచోట అతిచొరవ చూపిన ఓ కాంగ్రెస్ కార్యకర్త చెంప పగులగొట్టారు నగ్మా. ఇలా.. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి సొంతపార్టీ నాయకులు, కార్యకర్తల నుంచే వేధింపులు ఎదుర్కొంటున్నారు. అయితే.. వీటిని లైట్ తీసుకుంటున్న నగ్మా ఎవరిపైనా కంప్లయింట్ ఇవ్వలేదు. మామూలు సమయంలో అయితే ఏం చేసేవారో గానీ, ఎన్నికల వేళ..సొంతపార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చి రిస్కు తీసుకోవడం ఎందుకన్నదే ఆమె ఆలోచన కావచ్చు.
ఈ ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన నగ్మా.. ఆఖరికి సినిమాలో లాగా అంతా సుఖాంతం చేసుకుంటారా లేక ఎన్నికల తరువాత షూటింగ్ అయిపోయింది, ఇక రంగు తుడిచేసుకుందాం అనుకుంటుందా అన్నది త్వరలో తేలిపోతుంది.