త్యాగాలను ఏకరువు పెడితే ఏం లాభం?
రాహుల్‌పై మోడీ పరోక్ష విమర్శలు
న్యూఢిల్లీ: కుటుంబ త్యాగాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆదివారం పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ప్రస్తుత రోజుల్లో కుటుంబ త్యాగాలను ఏకరువు పెట్టడం వల్ల ప్రయోజనం లేదని, దేశ ప్రయోజనాల కోసం అంకితం కావడమే అత్యవసరమని మోడీ అన్నారు. ‘నేను త్యాగం చేస్తాను. నేను ప్రాణాలు సైతం ఇస్తాను వంటి మాటలతో పెద్దగా ప్రయోజనం ఉండదు.
దేశంలోని 125 కోట్ల మంది ప్రజల ప్రయోజనాల కోసం మనంతట మనం అంకితం కావడమే ఇప్పుడు ముఖ్యం’ అని వ్యాఖ్యానించారు. ఆదివారమిక్కడి రామ్‌లీలా మైదాన్‌లో యోగా గురువు బాబా రాందేవ్ నిర్వహించిన యోగా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ ఈ మేరకు మాట్లాడారు. ‘స్వాతంత్య్రానికి పూర్వం దేశం కోసం పోరాడుతూ ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం ఉండేది. కానీ మనం ఇప్పుడు దేశం కోసం జీవించాలి’ అని అన్నారు.
రాందేవ్ గురించి మాట్లాడుతూ.. ఆయనలో సత్యం అనే జ్వాల లేకపోతే ఎప్పుడో పారిపోయేవారని, ఆ ఫైర్ ఉంది కాబట్టే ఆయన ప్రభుత్వంతో పోరాడారని మోడీ ప్రశంసించారు. కార్యక్రమంలో అమరవీరులు భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు, చంద్రశేఖర్ ఆజాద్‌ల బంధువులను మోడీ సత్కరించారు. కాగా ఇటీవల పలు ర్యాలీల్లో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ.. మాజీ ప్రధానులు ఇందిరా, రాజీవ్ గాంధీల హత్యలను ప్రస్తావించారు. ఏదోరోజు తానూ హత్యకు గురవుతానేమోనని, అయినా లెక్కచేయనని అన్నారు.
ఆదివారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో రాందేవ్ బాబా, మోడీల ఆలింగనం