వీర విధేయులకు...దక్కలేదు | No ticket for Dokka Manikya Vara Prasad, gade venkata reddy | Sakshi
Sakshi News home page

వీర విధేయులకు...దక్కలేదు

Published Wed, Apr 16 2014 10:55 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

వీర విధేయులకు...దక్కలేదు - Sakshi

వీర విధేయులకు...దక్కలేదు

నిన్న మొన్నటి వరకు వాళ్లిద్దరూ కాంగ్రెస్‌లో సీనియర్ నేతలు. తమ సహచరులు చాలామంది ఇతర పార్టీల్లోకి జంప్‌ అయినా.. వారు మాత్రం కాంగ్రెస్‌నే నమ్ముకున్నారు. అయినా అలాంటి వీర విధేయులకు కూడా ఆ పార్టీ మొండిచేయి చూపింది. సిట్టింగులైనా సరే.. టిక్కెట్ ఇవ్వకుండా దాదాపు నెట్టేసినంత పని చేసింది. దీంతో ఇద్దరూ తీవ్ర అవమాన భారంతో ఆవేదన చెందుతున్నారు.

ఇంతకీ ఆ ఇద్దరు నేతలెవరు ? ఎక్కడి వారు ? ఏమా కథ....

ఒకరు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గాదె వెంకటరెడ్డి కాగా.. మరొకరు తాజా మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్. ఇద్దరూ ఇప్పటి వరకు కాంగ్రెస్‌నే నమ్ముకున్నారు. పార్టీ కోసమే పని చేస్తూ వచ్చారు. కానీ.. ఏరు దాటాక బోడ మల్లన్న.. అయిన్నట్టు మారింది వీరిద్దరి పరిస్థితి. పార్టీనే నమ్ముకుని.. ఎంతో కాలంగా పని చేస్తూ వస్తున్న ఈ ఇద్దరు నేతలకు రిక్త హస్తం చూపించింది. సీమాంధ్రలో పార్టీ పరిస్థితి అస్సలు బాగా లేకపోయినా.. ఎలాగైనా గెలుస్తామని ధీమా వ్యక్తం చేసినా ఆ మాట పార్టీ అధిష్టానానికి చెప్పినా టికెట్లు మాత్రం దక్కలేదు.

కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న గాదె వెంకటరెడ్డి.. ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి మూడు సార్లు, గుంటూరు జిల్లా బాపట్ల నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి ఆయనకు టికెట్ నిరాకరించింది పార్టీ. రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన పాపానికి ఆ పార్టీ గాదెపై అలా వేటు వేసింది. ఇదే కాకుండా మరో కారణం కూడా వినిపిస్తోంది.

తన వియ్యంకుడైన కడప జిల్లా నేత డీఎల్ రవీంద్రారెడ్డితో కలిసి టీడీపీలోకి వెళ్లాలని గాదె కొద్ది కాలంగా ప్రయత్నిస్తున్నారు. అటు వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావటంతో ఇక సైకిల్ ఎక్కటం లాంఛనమని అంతా భావించారు. దీంతో ఎటూ పార్టీ వీడే మనిషే కదా..? అని కాంగ్రెస్ అధిష్టానం గాదె గురించి పట్టించుకోవటం మానేసింది. అయితే పచ్చ పార్టీతో డీల్ కుదరక పోవటంతో గాదె సైలెంట్ అయ్యారు. బాపట్ల నుంచి మళ్లీ పోటీకి సిద్ధమయ్యారు. అయితే హైకమాండ్ మాత్రం ఈ పెద్దాయనను పట్టించుకోలేదు. టికెట్ కాస్తా చేజారింది.
                                
ఇక తాడికొండ నుంచి గెలవటమే కాదు.. మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించిన డొక్కా మాణిక్యవరప్రసాద్ కు కూడా ఆశాభంగమే కలిగింది. ఈ తాజా మాజీ మంత్రికి కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. డొక్కాకు రాజకీయ గురువైన రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్ను వదిలి సైకిల్ ఎక్కారు. ఇప్పుడాయన నరసరావుపేట నుంచి పార్లమెంట్ కు పోటీ చేస్తున్నారు. అయితే రాయపాటి తనతోపాటు తన శిష్యుడు డొక్కా కూడా పచ్చపార్టీలో చేరుతాడంటూ మొదట్లో చెప్పుకొచ్చారు.

కానీ డొక్కా మాత్రం తాను కాంగ్రెస్ ను వీడేదిలేదంటూ భీష్మించుక్కూర్చున్నారు. ఆయన గారి విధేయత చూసిన కాంగ్రెస్ సీమాంధ్ర ప్రచార కమిటీ సహ కన్వీనర్ బాధ్యతలు అప్పగించింది. అలాంటి పెద్ద పదవి పొందిన డొక్కాకు ఎమ్మెల్యే టికెట్ చాలా ఈజీ అనుకున్నారంతా. అదే సమయంలో సొంత నియోజకవర్గమైన తాడికొండ నుంచి కాకుండా వేమూరు నుంచి పోటీ చేయాలని డొక్కా ఆశించారు.

అయితే చాప కింద నీరులా కేంద్ర మంత్రి పనబాక ప్రవేశించారు. డొక్కా మాణిక్య వరప్రసాద్కు వేమూరు టికెట్ దక్కకుండా ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు. జిల్లాలో ఇద్దరు సీనియర్ నేతలకు కాంగ్రెస్ టికెట్లు ఇవ్వకపోవడం ఇప్పుడు గుంటూరులో హాట్ టాపిక్‌గా మారింది. అయితే కాంగ్రెస్ గురించి బాగా తెలిసిన వాళ్ళు మాత్రం.. ఇది కామన్ అంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement