పలువురి నామినేషన్లపై అభ్యంతరాలు!
హైదరాబాద్: సీమాంధ్రలో లోక్సభ, శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు ఈరోజు పరిశీలించారు. అయితే వివిధ రాజీకీయ పార్టీలకు చెందిన పలువురినామినేషన్లకు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది అభ్యర్థుల నామినేషన్లపై అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేయగా, మరికొంతమంది నామినేషన్లపై ప్రత్యర్థులు ఫిర్యాదు చేశారు.
విశాఖ జిల్లా భీమిలి టిడిపి అభ్యర్థి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై రిటర్నింగ్ అధికారికి సీపీఎం ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ కాంట్రాక్ట్‌లున్న గంటా శ్రీనివాసరావు పోటీకి అనర్హుడంటూ ఆర్వో సుబ్బరాజుకు సీపీఎం నేతలు ఫిర్యాదు చేశారు. ఇదే నియోజకవర్గంలో జైసమైక్యాంధ్ర అభ్యర్థి వినోద్‌కుమార్ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. అతని వయసు కనీసం ఉండవలసిన దానికంటే రెండు రోజులు తక్కువగా ఉండడంతో ఆర్వో సుబ్బరాజు అతనిని పోటీకి అనర్హుడుగా ప్రకటించారు. ఇదే జిల్లా పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనిత కుల ద్రువీకరణ పత్రంపై ఇండిపెండెంట్ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆర్వో చెప్పారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లోక్సభ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా మురళీమోహన్ దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్‌పై వైఎస్‌ఆర్ సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తన భార్య ఆస్తుల వివరాలు మురళీమోహన్ తప్పుగా చూపించారని ఆ పార్టీ ఆరోపించింది. ఈ విషయమై రిటర్నింగ్ అధికారి మురళీమోహన్‌ను వివరణ కోరుతున్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస రెడ్డి నామినేషన్‌పై టీడీపీ నేత రాంబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ ఆధారంతో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని నిలదీయడంతో రాంబాబు పలాయనం చిత్తగించారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వర్ రెడ్డి నామినేషన్‌పై మాజీ కౌన్సిలర్ ఒకరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్వోకు ఫిర్యాదు చేశారు. జయనాగేశ్వర్ రెడ్డి అఫిడవిట్‌లో అవకతవకలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు.
అనంతపురం జిల్లా శింగనమల టీడీపీ అభ్యర్థి యామిని బాల నామినేషన్‌పై ఇండిపెండెంట్ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే నామినేషన్ వేశారని ఆరోపించారు. అయినప్పటికీ ఆమె నామినేషన్‌ను ఆర్వో రామ్మోహన్ ఆమోదించారు. దాంతో ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే జిల్లా గుంతకల్లు టీడీపీ అభ్యర్థి జితేందర్‌గౌడ్ నామినేషన్‌పై వైఎస్‌ఆర్ సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐటీ రిటర్న్ వివరాలు పొందుపరచలేదని ఫిర్యాదు చేశారు. దాంతో జితేందర్‌గౌడ్ నామినేషన్ నామినేషన్‌ను ఆర్వో పెండింగ్‌లో పెట్టారు.
అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ అభ్యర్థి ఈరన్న నామినేషన్‌పై వైఎస్ఆర్ సిపి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈరన్నపై కర్ణాటకలో పలు కేసులు ఉన్నాయని తెలిపింది. నామినేషన్ పత్రంలో ఆ విషయాలు ప్రస్తావించలేదని పేర్కొంది. ఎన్నికల అధికారులు ఈ ఫిర్యాదునుఎ పరిశీలిస్తున్నారు.