పోలింగ్ బూత్‌ల్లో ఉండేది మన పోలీసులే కదా! మేనేజ్ చేయెచ్చులే...’ అనుకునే రాజకీయ నాయకుల పప్పులు ఈసారి ఉడకవు.
సాక్షి, హైదరాబాద్: ‘పోలింగ్ బూత్‌ల్లో ఉండేది మన పోలీసులే కదా! మేనేజ్ చేయెచ్చులే...’ అనుకునే రాజకీయ నాయకుల పప్పులు ఈసారి ఉడకవు. సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ సరళిలో ఏ కోణంలోనూ స్థానిక అధికారుల ప్రభావం లేకుండా ఉండేలా ఎన్నికల సంఘం (ఈసీ) పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గతానికి భిన్నంగా ఈసారి పోలింగ్ బూత్‌ల బాధ్యతల్ని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కేంద్ర సాయుధ బలగాలకు అప్పగించాలని నిర్ణయించింది. ఆ స్థాయిలోనే అదనంగా బలగాలను రప్పిస్తోంది.
పరోక్ష సహకారానికి అడ్డుకట్ట: ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉండటంతో రాజకీయ నాయకుల ప్రాబల్యం దాదాపు లేనట్లే. స్థానికంగా పనిచేసే పోలీసు అధికారులు ఫలానా వ్యక్తి గెలుస్తాడనో, ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో పరోక్షంగా వారికి సహకరించే అవకాశాలు ఉన్నాయని ఈసీ అనుమానిస్తోంది. దీనికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయడం కోసం సిక్కింలో అమలు చేసిన విధానాన్నే రాష్ట్రంలోనూ పరిచయం చేస్తోంది. అక్కడ నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న ఈసీ.. స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా వ్యవహరించే స్థానిక పోలీసుస్టేషన్ ఇన్‌చార్జ్ (జిల్లాల్లో ఎస్సై, కమిషనరేట్లలో ఇన్‌స్పెక్టర్)లతో పాటు పోలీసు సిబ్బందికి బూత్‌ల బాధ్యతలు అప్పగించలేదు.
అక్కడి భద్రత, బందోబస్తుల్ని కేంద్ర బలగాలైన బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్ తదితర విభాగాలకు అప్పగించింది. ఇదే విధానాన్ని రాష్ట్రంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనూ అమలు చేయాలని నిర్ణయించింది. స్థానిక, రాష్ట్ర పోలీసులు కేవలం ఓటర్లు ఉండే క్యూలను పర్యవేక్షించే వరకు మాత్రమే అనుమతిస్తారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారుల నుంచి ఫిర్యాదు రావడమో, శాంతిభద్రతలకు సంబంధించిన సమస్య తలెత్తడమో జరిగితేనే స్థానిక పోలీసులు పోలింగ్ బూత్ పరిసరాల్లోకి చేరుకుంటారు. గతంలో స్థానిక పోలీసు అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు మాత్రమే ఉండేవి. తాజా మార్పుల నేపథ్యంలో వీరికి గస్తీ బాధ్యతలు అప్పగిస్తున్నారు.
ఫ్లయింగ్ స్క్వాడ్‌లు: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి నియోజకవర్గానికి ఒక స్థానిక కంట్రోల్ రూమ్, మూడు స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ స్థానిక కంట్రోల్ రూమ్‌తో పాటు జిల్లా కంప్లైంట్స్ మానిటరింగ్ సెల్ నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకుంటుంది. సర్వైలెన్స్ బృందాలు నిత్యం గస్తీ నిర్వహిస్తూ అనుమానిత ప్రాంతాల్లో సోదాలు చేస్తుంటాయి.