
పంచ్: ఆయన ఉన్నప్పుడే బావుండేది..
ఆయన మళ్లీ వస్తే బాగుంటుంది..
అవును ఆయనే రావాలి
ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరించాలన్నా..
ప్రభుత్వ ఆసుపత్రుల్లో యూజర్ చార్జీలు
మళ్లీ రావాలన్నా
కరెంటు బిల్లు కట్టలేని రైతులపై
కేసులు పెట్టాలన్నా
కరెంటు చార్జీలు తగ్గించమని అడిగిన
ప్రజలను కాల్చి చంపాలన్నా
అంగన్‌వాడీలను గుర్రాలతో తొక్కించాలన్నా
హైటెక్ పేరిట సొంత స్థలాల ధరలు పెంచుకోవాలన్నా
ఆయన మళ్లీ వస్తే బావుంటుంది...
ఆయన వస్తేనే ఇవన్నీ సాధ్యం.
కానీ.. ఆయన రాడు.
ఒక అభిప్రాయం
పవనిజం కన్నా సంపూర్ణిజమే బెటరేమో!
టీడీపీ బీజేపీ పొత్తు - ఎల్లయ్యకు ఎద్దులు లేవు, మల్లయ్యకు బండి లేదు ఇద్దరూ కలిసి సవారి కట్టినట్టు ఉంది.
జనసేన - చేలో పడ్డ గుడ్దెద్దు
- సేకరణ: జీవన్
ఎందుకు వచ్చినట్టో...
కర్ణాటకలోని శివమొగ్గ నియోజక వర్గం నుంచి పోటీ చేయడానికి జేడీయూ అభ్యర్థి బి.ధర్మప్ప సకల సన్నాహాలు చేసుకున్నారు. నామినేషన్ వేయడానికి మందీ మార్బలంతో కలెక్టర్ కార్యాలయం దాకా వెళ్లారు. మరో ఇద్దరితో కలసి లోనికి వెళ్లి ఎన్నికల అధికారి బన్సల్ ఎదుట ఠీవీగా కూర్చున్నారు. నామినేషన్ పత్రాలు అడిగినప్పుడు మాత్రం చుట్టూ చూసి తెల్ల మొహం వేశారు. ఇంట్లోనే నామినేషన్ పత్రాలను మరిచిపోయి వచ్చానని, వెంటనే తెప్పిస్తానని ఎన్నికల అధికారికి విన్నవించారు. దీంతో ‘అవి వచ్చేంత వరకు వేచి ఉండండి. వేరే వారు నామినేషన్లను దాఖలు చేయడానికి అవకాశం కల్పించండి’ అంటూ అధికారి ఆయనను బయటకు సాగనంపారు.
‘ఏనుగు’ అభ్యర్థికి నోటీసు
కర్ణాటకలోని హాసన్ నియోజకవర్గంలో ఏపీ అహ్మద్ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేయడానికి పార్టీ చిహ్నమైన ఏనుగుపై వెళ్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. వెరీ గుడ్ ఐడియా అని స్నేహితులు సలహా ఇచ్చారు. వెంటనే కేరళ నుంచి ఓ పెంపుడు ఏనుగును రూ.28 వేలకు బాడుగకు తెచ్చుకున్నారు. ఆ ఏనుగుపైనే ఊరేగింపుగా వెళ్లి నామినేషన్‌ను దాఖలు చేశారు. అయితే ఇందుకు ఎన్నికల అధికారుల ముందస్తు అనుమతి లేదు. అహ్మద్ ఏనుగుపై వచ్చాడని తెలుసుకున్న జిల్లా ఎన్నికల అధికారి, అటవీ శాఖాధికారులను పిలిపించుకుని సమాచారాన్ని రాబట్టారు. అనంతరం ఆయనకు నోటీసు జారీ చేశారు.
- వి.సురేంద్రన్, బెంగళూరు