
స్థాయిని మరిచి సోనియా అబద్దాలు : కేకే
హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన స్థాయిని మరిచిపోయి అబద్దాలు మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు విమర్శించారు. సోమవారం ఆయన తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ పార్లమెంటులో బిల్లు పెట్టే సమయంలో కేసీఆర్ సభలోనే లేడని సోనియాగాంధీ చెప్పడం వాస్తవం కాదన్నారు. లోక్‌సభ టీవీ చానల్ ఫుటేజ్‌ను చూస్తే అసలు విషయం తెలుస్తుందన్నారు.
తెలంగాణ కావాలని డిమాండ్ పెట్టి, తెలంగాణ ప్రజలతో ఉద్యమించిన పార్టీ టీఆర్‌ఎస్ అని చెప్పారు. ఉద్యమంలో భుజంభుజం కలిపినట్టుగా కాంగ్రెస్ చెప్పుకోవడం సరికాదన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన తాను, మరో ఇద్దరు ఎంపీలు కాకుండా ఉద్యమంలో కలసివచ్చిన కాంగ్రెస్ ఎంపీలు ఎవరని కేకే ప్రశ్నించారు.
ఆరువందల మంది తెలంగాణ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే, పార్లమెంటులో సంతాపతీర్మానం చేయాలని అడిగితే ప్రధానమంత్రి అంగీకరించలేదని ఆయన గుర్తుచేశారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని చెప్పిన సీఎం కూడా కాంగ్రెస్ వారేనని ఎద్దేవా చేశారు. తెలంగాణ బిల్లును అడ్డుకున్న 18 మంది ఎంపీలు కూడా కాంగ్రెస్‌వారేనని అన్నారు. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఈ ఎంపీలు ధిక్కరిస్తే వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు.
టీఆర్‌ఎస్ ఉద్యమం లేకుంటే తెలంగాణ ఇచ్చేవారా అని కేకే ప్రశ్నించారు. తెలంగాణలోని 10 జిల్లాల్లో 8 జిల్లాలు వెనుకబడి ఉన్నాయని ప్రణాళికాసంఘం చెప్పినా ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వలేదని అన్నారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన 92 వేల ఉద్యోగాలను ఆక్రమించిన ఆంధ్రా ఉద్యోగులను వెనక్కు పంపించేయకపోతే ఉద్యమానికి అర్థమే లేదన్నారు.