‘ప్రాదేశిక’ ప్రచారం సమాప్తం
374 ఎంపీటీసీ, 28 జెడ్పీటీసీలకు ఎన్నికలు రేపు
ఎంపీటీసీ బరిలో 969 మంది అభ్యర్థులు
జెడ్పీటీసీ స్థానాల్లో వంద మంది అభ్యర్థుల పోటీ
ఒంగోలు, న్యూస్‌లైన్: మలిదశ ప్రాదేశిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రం 5 గంటలతో తెరపడింది. ఆరు నియోజకవర్గాల్లోని 9,42,722 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
28 మండలాల్లో ఎన్నికలు:
రెండో దశ ప్రాదేశిక ఎన్నికలు ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి, కనిగిరి, కందుకూరు, దర్శి నియోజకవర్గాల్లో 28 మండలాల్లోని 381 ఎంపీటీసీ స్థానాలకు జరగాల్సి ఉంది. వీటిలో దర్శి -2, క్రిస్టియన్‌పాలెం, తాళ్లూరు మండలం మల్కాపురం మండల ప్రాదేశికాలు వైఎస్సార్ సీపీకి ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా కనిగిరి మండలం చాకిరాలు, పీసీపల్లి మండలం గుదేవారిపాలెం స్థానాలు టీడీపీ ఖాతాకు జమయ్యాయి. ఉలవపాడు మండలం పెదపట్టపుపాలెం, లింగసముద్రం మండలం ముత్యాలపాడు, తాళ్లూరు మండలం మన్నేపల్లి ఎంపీటీసీ స్థానాలకు స్వతంత్ర అభ్యర్థులు ఏకగ్రీవమయ్యాయి.
ఏడు ప్రాదేశికాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 374 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 969 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో బీఎస్పీ 5, బీజేపీ 8, సీపీఐ 11, సీపీఎం 16, కాంగ్రెస్ 35, వైఎస్సార్ సీపీ 363, టీడీపీ 363, లోక్‌సత్తా 2, స్వతంత్రులు 166 మంది పోటీలో ఉన్నారు.
రెండో దశలో 28 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీఎస్పీ 5, బీజేపీ 2, సీపీఐ 3, సీపీఎం 2, కాంగ్రెస్ 7, వైఎస్సార్ సీపీ 27, టీడీపీ 28, లోక్‌సత్తా 1, స్వతంత్రులు 25 మంది వెరసి మొత్తం వంద మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ తరఫున వైఎస్సార్ సీఎల్‌పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, చైర్మన్ అభ్యర్థి నూకసాని బాలాజీ జిల్లా అంతటా ప్రచారం నిర్వహించి అభ్యర్థులను, కార్యకర్తలను ఉత్సాహపరుస్తుంటే టీడీపీ నేతలు మాత్రం టికెట్ల వేటలో రాజధానిలో మకాం వేశారు. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర నిరాసక్తత కనిపిస్తోంది.
ఎన్నికల నిర్వహణకు 6,855 మంది సిబ్బంది:
రెండో దశ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 6,855 మంది సిబ్బందిని జిల్లా అధికారులు వినియోగిస్తున్నారు. 1270 పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేశారు. 1,395 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,395 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 4,065 మంది ఇతర పోలింగ్ అధికారులు ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యారు.
ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది మొత్తం గురువారం ఉదయం 7 గంటలకల్లా సంబంధిత మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద రిపోర్టు చేయాలని ఇప్పటికే జిల్లా అదనపు ఎన్నికల అధికారి ఆదేశించారు. బ్యాలెట్ బాక్సుల పంపిణీ, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఇతర మెటీరియల్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒంగోలు డివిజన్‌లో 7 మండలాల్లో, కందుకూరు డివిజన్‌లోని 21 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.