టీడీపీ అడ్డదారులు.. ఓటర్లకు దొంగనోట్లు
ఎన్నికల్లో గెలవడానికి టీడీపీ నాయకులు అడ్డమైన దారులన్నీ వెతుక్కుంటున్నారు. ప్రజాభిమానం ఏమాత్రం లేకపోవడం, రెండు ప్రాంతాల్లోను ప్రజల విశ్వాసం పొందలేకపోవడంతో విజయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. నిన్న కాక మొన్న జరిగిన పరిషత్తు ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల నుంచి త్వరలో జరగబోతున్న అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల ఎన్నికల్లో కూడా డబ్బులు విచ్చలవిడిగా పారిస్తున్నారు. అయితే.. వీళ్లు పంచేవన్నీ నిజంగానే అసలైన నోట్లని, ఏదో ఒక అవసరానికి ఉపయోగపడకపోతాయా అని తీసుకుంటున్న అమాయక ప్రజలు.. తీరా అవి కాస్తా చెల్లని దొంగనోట్లు కావడంతో టీడీపీ నాయకులకు శాపనార్థాలు పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ తరహా సంఘటనలు బయటపడుతున్నాయి.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లిలో టీడీపీ మహిళా ఎంపీటీసీ అభ్యర్థి బూక్య క్రాంతి గతంలో రాయపర్తి జడ్పీటీసీ సభ్యురాలు. ఈసారి తెలంగాణ ప్రాంతంలో టీడీపీకి ఆదరణ లేదని తెలిసినా, ఎలాగైనా గెలవాలని ఓటర్లకు ఒక్కొక్కరికి వెయ్యి చొప్పున పంచిపెట్టారు. డబ్బులు తీసుకున్న కొంతమంది వాటితో కిరాణా దుకాణాలు, రేషన్ దుకాణాల్లో నిత్యవసరాలు కొనుగోలు చేశారు. వాటిని పరిశీలించిన యజమానులు నోట్లు చెల్లవని చెప్పడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. టీడీపీ అభ్యర్థి భూక్య క్రాంతి తమకు దొంగనోట్లు అంటగట్టి ఓట్లు వేయించుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వచ్చి దొంగనోట్ల వ్యవహారంపై విచారణ చేపట్టారు. దీంతో పాటు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిన టీడీపీ అభ్యర్థిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ గ్రామం తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోనిదే కావడం విశేషం.