సైకిల్ ఓటు కోసం.. హవాలా రూటు
- రూ.కోట్లతో గట్టెక్కాలనుకుంటున్న టీడీపీ
- సరికొత్త మార్గంలో అభ్యర్థులకు అందుతున్న సొమ్ము
- హైదరాబాద్‌లోని బడా వ్యాపారులతో ఒప్పందం
- నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున తరలింపు
- నిద్రాణ స్థితిలో నిఘా యంత్రాంగం
జనం అభిమానాన్ని.. వారి కష్టాలకు చలించి, వాటిని తీర్చడానికి శ్రమించడం ద్వారా సొంతం చేసుకోవడం తెలియని వారు ధనంతో దాన్ని ‘కొనుగోలు’ చేయగలమనుకోవడంలో ఆశ్చర్యం లేదు. స్థానిక సంస్థలు, ప్రాదేశిక ఎన్నికల్లోనే డబ్బు సంచులు కుమ్మరించిన తెలుగుదేశం.. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో ధన ప్రవాహాన్నే సృష్టించి గట్టెక్కాలనుకుంటోంది. నీతి తప్పాలనుకునే వారికి నిఘాలు ఓ లెక్క కాదంటూ.. ఎన్నికల కమిషన్ ఎన్ని ఏర్పాట్లు చేసినా, ఎంతటి నిఘా ఉంచినా.. టీడీపీ అంచనాలకు అందని స్థాయిలో ఖర్చు చేస్తోంది. పోలింగ్ నాటికి మరిన్ని రెట్లు వెచ్చించడానికి దారులూ సిద్ధం చేసుకుంది.
సాక్షి, రాజమండ్రి : జిల్లాలో ఇప్పటికే నియోజకవర్గానికి రూ.మూడు కోట్ల నుంచి రూ.నాలుగు కోట్లు ఖర్చు చేసేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు.. పోలింగ్ నాటికి మరింత విచ్చల విడిగా వెదజల్లేందుకు అవసరమైన నోట్ల కట్టలను ‘హవాలా’ రూట్లో రప్పించునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లాలో ఒక పార్లమెంటు నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా ప్రాతినిధ్యం వహిస్తున్న సినీ ప్రముఖుడు ఉభయ గోదావరి జిల్లాల్లో తన పరిధిలోని అసెంబ్లీ నియోజక వర్గాల్లో పంపిణీ చేసేందుకు ప్రధానంగా హవాలాను ఆశ్రయించినట్టు తెలుస్తోంది.
ఏమిటీ హవాలా..
రాజధానిలో ఉండి వ్యాపారం చేసే వివిధ వస్తువుల రాష్ట్రస్థాయి పంపిణీదారులకు, జిల్లాలోని రీజనల్ పంపిణీదారులు, హోల్‌సేలర్లకు మధ్య రోజూ వ్యాపార లావాదేవీల్లో భాగంగా రూ.కోట్లు చలామణీ అవుతాయి. ఇందులో కొంత బ్యాంకు డిపాజిట్ల ద్వారా, మరి కొంత నగదు రూపంలో చేతులు మారుతుంది. రోజూ హైదరాబాద్ నుంచి వచ్చే పంపిణీదారుల ప్రతినిధులు ఈ డబ్బును నగదు, చెక్కులు, డీడీల రూపంలో వసూలు చేసుకుని వెళుతుంటారు. ఈ డబ్బును స్థానికంగా అవసరమైన అభ్యర్థులకు సర్దుబాటు చేసి ఫలితంగా కమిషన్ పొందడమే హవాలా. ఇక్కడ చెల్లించిన మొత్తాన్ని తక్షణం లేదా కొంత కాలం తర్వాత హైదరాబాద్ వ్యాపారులకు కమీషన్‌తో సహా పార్టీ చెల్లించేస్తుంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో నలుగురు బడా వ్యాపారులు, రాజమండ్రిలో ముగ్గురు స్థానిక వ్యాపారుల సహకారంతో డబ్బు పంపిణీకి టీడీపీ అభ్యర్థులు ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. వీరంతా గతం నుంచీ టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు అత్యంత విశ్వసనీయంగా పనిచేసే వ్యక్తులు. కోట్లలో వ్యాపార లావాదేవీలు జరుపుతున్న వీరు హైదరాబాద్‌లో అక్కడి ముఖ్య నేతలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం జిల్లాలోని వివిధ హోల్‌సేల్ వ్యాపారాలు చేస్తున్న వారు నోటిమాటే హామీగా రూ.కోట్లు పార్టీకి ఇప్పిస్తారు. అందుకుగాను రూ.లక్షకు రూ.200 కమిషన్ లభిస్తుంది. కమిషన్‌లో కొంత హైదరాబాద్ వ్యక్తులు తీసుకోగా కొంత స్థానిక వ్యాపారులు తీసుకుంటారు. అవసరమైతే ఈ పద్ధతిలో ఎన్ని కోట్లయినా సర్దుబాటు చేసేందుకు హవాలాదారులు సిద్ధంగా ఉంటారు. జిల్లాలో రాజమండ్రి, కాకినాడ, అమలాపురం ప్రాంతాల్లో ఉండే తమ రిటైలర్లు, సబ్ డీలర్లను సంప్రదించి ఈ వ్యాపారులు స్థానిక టీడీపీ నేతలకు డబ్బు సర్దుబాటు చేస్తున్నారని తెలుస్తోంది. టీడీపీ వారు ఈ మూడు ప్రాంతాల నుంచి చుట్టుపక్కల అసెంబ్లీ నియోజక వర్గాలకు భారీగా డబ్బు చేరవేస్తున్నట్టు సమాచారం. ఇలా రూ.కోట్లు సర్దుబాటు చేయడానికి.. తక్కువ వ్యవధిలో కమీషన్ వస్తుందన్న ఆశ ఓ కారణం కాగా.. రాజకీయపరమైన ఒత్తిళ్లు, మొహమాటాలే ప్రధాన కారణమని తెలుస్తోంది.