‘పచ్చ’పాములు
సాక్షి, ఏలూరు : ఓటర్లను డబ్బు, మద్యంతో కాటేసేందుకు పచ్చ పార్టీ పాములు వస్తున్నాయి. కులాల చిచ్చుతో, మతాల ఉచ్చుతో ఓట్లు కొల్లగొట్టి గద్దెనెక్కాలని చూస్తున్నాయి. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు తెర తీసింది. విచ్చలవిడిగా ప్రాంతాల వారీగా కొన్నిచోట్ల ఇప్పటికే డబ్బు, మద్యం పంపకాలు ప్రారంభించింది. కుల, మత పెద్దలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తోంది. రసీదు పుస్తకాలతో ముందస్తు హామీలు గుప్పిస్తోంది. లారీలు, ఆటోలు కొనిస్తామంటూ మాయమాటలతో ఓటర్లకు వల వేస్తోంది.
ఏలూరులో డ్వాక్రా గ్రూపునకు రూ.3వేలు చొప్పున ఇస్తున్నారు. ఓటర్లకు రూ.300 ఇచ్చారు. కొవ్వూరు, గోపాలపురంలలో ఓటుకు రూ.500 ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. పోలవరంలో ఓటుకు రూ.300 చొప్పున పంపిణీ చేస్తున్నారు. కుల, మత సంఘాల పెద్దలకు రూ.10,000 వేలు చొప్పున పంచుతున్నారు. ఆ వర్గంలోని వారందరితో ఓట్లు వేయించాల్సిందిగా ఒప్పందం చేసుకుంటున్నారు. నిడదవోలులో డ్వాక్రా సంఘాలకు రూ.3వేలు, పాస్టర్లకు రూ.2వేలు, ఆటో డ్రైవర్లకు రూ.500, ఆర్‌ఎంపీ డాక్టర్లకు రూ.1000 ఇస్తున్నారు. లారీలు, ఆటోలు కొనిచ్చేస్తామంటూ డ్రైవర్లకు వల వేస్తున్నారు. తాడేపల్లిగూడెంలో ఓటుకు రూ.1000 ఇవ్వడానికైనా వెనుకాడడం లేదు. ఇక్కడ ఇప్పటికే ఓటర్లకు రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం, విందు అందిస్తున్నారు.
తణుకులో ఏకంగా రసీదు పుస్తకాలు పంచిపెడుతున్నారు. దానిలో ఓటర్ల బ్యాంక్ అకౌంట్ నంబర్, ఫోన్ నంబర్ రాయించుకుంటున్నారు. బ్యాంకు రుణాలు రద్దు చేస్తామంటూ ప్రలోభపెడతున్నారు. ఓటరు అవసరమేంటో రాయాలని, గెలిచాక దానిని తీరుస్తామని నమ్మబలుకుతున్నారు. ఓటుకు రూ.500 నుంచి రూ.1500 వరకు ఇచ్చేందుకైనా సిద్ధపడుతున్నారు. ఉంగుటూరులో ఓటుకు రూ.300, ఆచంటలో రూ.1000 చొప్పున పంపిణీకి ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే మరికొంత ఇచ్చేందుకు వెనకాడకూడదని టీడీపీ భావిస్తోంది. ఇక్కడ మద్యం పంపిణీకి టీడీపీ ఏర్పాట్లు చేసింది. ఎక్కడిక్కడ మద్యం నిల్వలు చేస్తోంది. పెనుగొండ మండలం మునపర్రు గ్రామంలో రూ.35వేలు విలువైన మద్యం, పెనుమంట్ర మండలం మార్టేరులోనూ టీడీపీకి చెందిన మద్యంను ఆదివారం ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకోవడమే దీనికి ఉదాహరణ. దెందులూరు నియోజకవర్గం ఏలూరు రూరల్‌లో ఓటుకు రూ.300 ఇచ్చారు. నరసాపురంలోనూ ఓటుకు రూ.1000 నుంచి రూ.1500 వరకూ ఇవ్వడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది.