సీమాంధ్ర జిల్లాల పోలింగ్ సరళిని జీర్ణించుకోలేని టీడీపీ ఎంపీ సి.ఎం.రమేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌తో దురుసుగా వ్యవహరించారు.
భన్వర్‌లాల్‌తో ఫోన్‌లోనే టీడీపీ ఎంపీ వాదన
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర జిల్లాల పోలింగ్ సరళిని జీర్ణించుకోలేని టీడీపీ ఎంపీ సి.ఎం.రమేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌తో దురుసుగా వ్యవహరించారు. భన్వర్‌లాల్ బుధవారం ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో రమేష్‌ఆయనకు ఫోన్ చేసి ఫోన్‌లోనే వాదనకు దిగారు. కడప జిల్లాలో పక్క గ్రామాలకు చెందిన వారిని ఎన్నికల ఏజెం ట్లుగా నియమించటంపై హైకోర్టు స్టే ఇవ్వటాన్ని రమేశ్‌తప్పుపడుతూ.. ‘మీరేం చేస్తున్నార’ంటూ భన్వర్‌లాల్‌ను ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు తన పరిధిలోకి రాదని చెప్పిన భన్వర్‌లాల్.. ‘మీరు ఇలా మాట్లాడకూడద’ని పలుమార్లు రమేశ్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆయన వినిపించుకోకుండా వాదన కొనసాగించారు. దీనికి భన్వర్‌లాల్ స్పందిస్తూ.. ‘మీరు ప్రజాప్రతినిధిగా ఉంటూ ఈ విధంగా మాట్లాడం సరికాదు.. వ్యవహార శైలిని సరిచేసుకోవాలి’ అని ఆయనకు సూచించారు. అనంతరం భన్వర్‌లాల్ మీడియాతో మాట్లాడుతూ సి.ఎం.రమేశ్‌తీరుపట్ల ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు సభ్యునిగా ఉండి రమేష్ ఈ విధంగా ప్రవర్తించారని, ఆ పార్టీ నాయకుల తీరు ఈ విధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కడప జిల్లాలో పక్క గ్రామాల్లోని వ్యక్తిని పోలింగ్ ఏజెంటుగా నియమించుకోవడానికి ఈసీ అనుమతించింది. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా ఈసీ ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. అదే అంశంపై రమేశ్ ఫోన్ చేసి భన్వర్‌లాల్‌తో వాదనకు దిగారు. కోర్టు తీర్పుపై తానేం చేయగలనని భన్వర్‌లాల్ నచ్చచెప్పటానికి ప్రయత్నించినా ఆయన దురుసుగా మాట్లాడారు.