అనంతపురం, న్యూస్‌లైన్ : సార్వత్రిక సంగ్రామం తుది దశకు చేరుకుంటున్న తరుణంలో తమ పార్టీకి ప్రజాదరణ లేదని తెలుసుకున్న కొంతమంది టీడీపీ అభ్యర్థులు గెలవడం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. నేరుగా ఓటర్లను కలసి అభ్యర్థించినా ఫలితం ఉండదని గ్రహించి.. ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు తెరవెనక రాజకీయం చేస్తున్నారు. ఉదోగ్యుల్లో కూడా సామాజికపరంగా ఉన్న వారిని కలుస్తూ..వారికి ఆర్థిక మంత్రాంగం చేస్తూ ప్రలోభపెట్టాలని చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంటు నియజకవర్గ స్థానాలకు జరిగే ఎన్నికల నిర్వహణకు 35,103 మంది సిబ్బందిని నియమించారు.
వీరిలో 4005 మంది పోలింగ్ అధికారులు, 4006 మంది అసిస్టెంట్ పోలింగ్ అధికారులు కాగా 11 వేల మంది పోలీసులు, ఇక మిగిలిన వారు ఇతర పోలింగ్ సిబ్బందిగా విధులు నిర్వర్తిస్తారు. దీంతో పోలింగ్ విధులకు వెళ్లిన ఉద్యోగులు ఓటు వేయడానికి ఉపయోగించే పోస్టల్ బ్యాలెట్ల వ్యాపారానికి టీడీపీ నాయకులు తెరలేపినట్లు తెలిసింది. పోస్టల్‌బ్యాలెట్ తమ పార్టీకి వేయడంతో పాటు విధులు నిర్వహించే పోలింగ్ కేంద్రంలో తమ పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని ఉద్యోగస్తులతో ఒప్పందాలకు దిగినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
ససేమిరా అంటున్న ఉద్యోగులు
తెలుగుదేశం పార్టీ ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవడానికి డబ్బు లేదా బలగంతో ఓట్లు కొల్లగొట్టాలని చూస్తోంది. అయితే ఉద్యోగులు మాత్రం టీడీపీకి సహకరించడనికి ససేమిరా అంటున్నట్లు తెలిసింది. తొమ్మిదేళ్ల చంద్రబాబు నాయుడి పాలనలో జన్మభూమి, పనికి ఆహార పథకం, ప్రజల వద్దకే పాలన అంటూ పలు రకాల పథకాలతో ఉద్యోగస్తులను ముప్పుతిప్పలు పెట్టారు. అందరి ఎదుట అవమానించడంతో పాటు ఉద్యోగ భద్రతను కూడా ప్రశ్నార్థకం చేసిన చీకటి రోజులను ఉద్యోగులు ఇంకా మరువలేకపోతున్నారు. ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే..పాత కష్టాలు తప్పవన్న ఆందోళన మెజార్టీ ఉద్యోగుల్లో నెలకొంది.
ఉద్యోగ సంఘాల నేతలతో బేరాలు
ఉద్యోగుల వద్దకు వెళ్లి కలిసినా వారు సహకరించే అవకాశం లేకపోవడంతో.. నేరుగా ఉద్యోగ సంఘాల నేతలతోనే చీకటిరాజకీయాలకు తెరలేపినట్లు తెలిసింది. పోస్టల్‌బ్యాలెట్ ఓట్లన్నీ తమ పార్టీ అభ్యర్థులకే వేసేలా చూడడంతో పాటు..‘పోలింగ్ కేంద్రాల్లో మీ ఉద్యోగులు మాకు సహకరిస్తే..భవిషత్తులో బాగా చూసుకుంటాం.. మీకు ఎటువంటి వత్తిళ్లు లేకుండా ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకునేలా చూస్తాం’ అని నమ్మబలుకుతున్నట్లు తెలింది. ఇదంతా ఊరికే చేయాల్సిన పనిలేదని, అందుకు తగిన ప్రతిఫలం కూడా ముట్టజెబుతామని బేరాలకు దిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులే ఎక్కువగా ఉండడంతో కొన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలతో ఆయా పట్టణాల్లోని హోటళ్లలో డిన్నర్లు ఇచ్చి లాబీయింగ్‌కు తెరలేపారు. ఇటీవల కళ్యాణదుర్గంలో టీడీపీ నేతలు పోలింగ్ విధులకు హాజరయ్యే ఉద్యోగులకు ఫాం హౌస్‌లో డిన్నర్ ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. కదిరికి చెందిన టీడీపీ నాయకులు కూడా కుల, ఉద్యోగ సంఘాల నాయకులను హార్సిలీహిల్స్‌కు తీసుకెళ్లి ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు తెలిసింది. ఇదే తంతు జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో సాగుతోంది. ముఖ్యంగా ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ వర్కర్లు, పోలీసు సిబ్బందిని తమవైపు తిప్పుకోవడానికి టీడీపీ నేతలు నానా పాట్లు పడుతున్నారు.
తెరపైకి సామాజిక మంత్రం
ఇన్నాళ్లూ ఎదురుపడినా పట్టించుకోని టీడీపీ నాయకులు ప్రస్తుతం కుల సంఘాల నాయకులు కనపడితే చాలు..అన్నా బాగున్నావా..మనోళ్ల ఓట్లన్నీ మన పార్టీకి వేయించాల.. ఈసారి గెలిస్తే..మీకు అదిచేస్తాం..ఇది చేస్తాం అంటూ ప్రలోభపెడుతున్నారు. సామాజికవర్గాల వారీగా ఓట్ల ప్రాధాన్యతను బట్టి పదవులు ఎర కూడా వేస్తున్నారు.
ఇటీవల పుట్టపర్తి నియోజకవర్గం నుంచి ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ నాయకుడు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయగా, అతన్ని బరి నుంచి తప్పించడానికి టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి విశ్వప్రయత్నాలు సాగించినట్లు తెలిసింది. భారీ మొత్తంలో నగదు ముట్టజెప్పడంతో పాటు అధికారం లోకి వ స్తే.. నామినేటెడ్ పదవి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నా అభ్యర్థి నిరాకరించడంతో స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి ప్యాకేజీపై హామీ ఇప్పించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఆ నియోజక వర్గంలో బీసీ ఓటర్లంతా భగ్గుమంటున్నారు. పల్లెరఘునాథరెడ్డి తప్ప ఇంకెవరూ ఎమ్మెల్యేగా ఉండకూడదా అని ప్రశ్నిస్తున్నారు. మిగతా నియోజకవర్గాల్లో స్వతంత్రంగా లేదా చిన్నా..చితక పార్టీల అభ్యర్థులను ఇలాగే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం అందుతోంది.
కీలకంగా మారిన పోస్టల్ బ్యాలెట్లు
జిల్లాలో వైఎస్సార్‌సీపీ, టీడీపీల మధ్యే పోరు ప్రధానంగా ఉంది. వైఎస్సార్‌సీపీకి ప్రజాదరణ మెండుగా ఉండడంతో టీడీపీ నేలచూపులు చూస్తోంది. ఎలాగైనా ఓట్లను దక్కించుకునేందుకు అక్రమ మార్గాలను అన్వేషిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో బ్యాలెట్ ఓట్లతో పాటు, పోలింగ్ బూత్‌లో ఉద్యోగస్తుల సహకారం కూడా కీలకంగా ఉంటుంది. 2004, 2009లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ లే ఎన్నికల ఫలితాలను తారుమారు చేశాయి. ఉదాహరణకు ఉరవకొండ, పుట్టపర్తి అసెంబ్లీతో పాటు హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు అరకొర మెజార్టీతో బయటపడటానికి పోస్టల్ బ్యాలెట్లు, ఉద్యోగుల సహకారమే కారణమని తేలింది.
ప్రలోభాలు షురూ
Published Sat, Apr 26 2014 2:16 AM | Last Updated on Sat, Aug 11 2018 3:37 PM
Advertisement
Advertisement