
టెన్షన్...టెన్షన్!
విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్ : జిల్లావ్యాప్తంగా 34 జెడ్పీటీసీ, 542 ఎంపీటీసీ స్థానాలకు గత నెల 6,11 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించి మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కౌంటింగ్‌కు సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏ ర్పాట్లు పూర్తి చేశారు. లెక్కింపులో ఎలాంటి అక్రమాలు జరగకుండా అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 34 జెడ్పీటీసీ స్థానాలకు 135 మంది బరిలో ఉన్నారు. 542 ఎంపీటీసీ స్థానాలకు 1,489 మంది పోటీ చేశారు. పార్వతీపురం డివిజన్‌లో 15 జెడ్పీటీసీ స్థానాలకు 54 మంది, 225 ఎంసీటీసీ స్థానాలకు 605 మంది పోటీ పడ్డారు. విజయనగరం డివిజన్‌లో 19 జెడ్పీటీసీ స్థానాలకు 81 మంది, 317 ఎంపీటీసీ స్థానాలకు 884 మంది పోటీ చేశారు. గత నెల 6వ తేదీన పార్వతీపురం డివిజన్‌లో, 11వ తేదీన విజయన గరం డివిజన్‌లో ఎన్నికలు జరిగాయి. పార్వతీపురం డివిజన్ కు పార్వతీపురంలోను, విజయనగరం డివిజన్‌కు విజయనగరంలోను ఓట్లు లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. పార్వతీపురం డివిజన్‌కు సంబంధించి పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఐదు మండలాలు, ఆర్‌సీఎం గర్ల్స్ హైస్కూల్లో ఐదు మండలాలు, ఎస్‌వీ డిగ్రీ కళాశాలలో ఐదు మండలాలకు చెందిన ఓట్లు లెక్కించనున్నారు. విజయనగరం డివిజన్‌కు సంబంధించి ఎంఆర్ కళాశాలలో 9 మండలాలకు, ఎంఆర్ మహిళా కళాశాలలో 10 మండలాల కు చెందిన ఓట్లు లెక్కించనున్నారు.
ఓట్ల లెక్కింపు ఇలా
పార్టీల వారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు పోలై న ఓట్లను ముందు కట్టలుగా కడతారు. ఆ తరువాత వాటిని లెక్కిస్తారు. అందులో ముందుగా ఎంపీటీసీ ఓట్లను, ఆ తరువాత జెడ్పీటీసీ ఓట్లను లెక్కిస్తారు. తొలి ఫలితం మధ్యాహ్నం రెండుగంటల లోగా, తుది ఫలి తం రాత్రి ఎనిమిది గంటలకు వెలువడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మండలానికి 50 మంది చొప్పున కౌంటింగ్ సిబ్బందిని నియమించినట్టు జిల్లా పరిషత్ ఏఓ శ్రీధర్ రాజా తెలిపారు. గొడవలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు
ఓట్ల లెక్కింపులో భాగంగా తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం బ్యాలెట్ బ్యాక్సుల్లో ఓట్లను లెక్కించనున్నారు. ఓట్లు లెక్కించే గదిలోకి సెల్‌ఫోన్‌లను అనుమతించరు. కౌంటింగ్‌కు హాజరయ్యే ఏజెంట్లు సెల్‌ఫోన్లను బయట వదిలివెళ్లాలి. కౌంటింగ్ కేంద్రాల వద్ద మీడియా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఫలితాలను మైక్ ద్వారా వెల్లడిస్తారు.