తీర్పు ఆమెదే..! | the key role of ladies votes in paleru constituency | Sakshi
Sakshi News home page

తీర్పు ఆమెదే..!

Published Mon, Mar 24 2014 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 5:04 AM

the key role of ladies votes in paleru constituency

 ఖమ్మం రూరల్, న్యూస్‌లైన్: పాలేరు నియోజకవర్గం లో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. అన్నింటిల్లో సగభాగమని సత్తా చాటుతున్న మహిళలు స్థానిక ఎన్నికల్లో కూడా అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని నాలుగు జెడ్పీటీసీ స్థానాల్లో మూడింటిని. 76 ఎంపీటీసీ స్థానాల్లో 39 స్థానాల్లో పోటీ చేసే అవకాశాన్ని దక్కించుకున్న మహిళలు ఓట్లపరంగా కూడా కీలకంగా మారారు. అభ్యర్థుల గెలుపోటములు వీరి చేతుల్లోనే ఉన్నాయి.

 స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పాలేరు నియోజకవర్గంలోని అభ్యర్థులు గుండెల్లో గుబులు మొదలైంది. నియోజకవర్గంలో 1,94,037 ఓటర్లు ఉండగా అందులో 95,225 పురుష ఓటర్లు, 98,718 మహిళా ఓటర్లు ఉన్నారు.అభ్యర్థుల తలరాతలు మహిళల చేతిల్లోనే ఉన్నాయి. నియోజకవర్గంలో కీలకమైన మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడరానిపాట్లు పడుతున్నారు. నియోజకవర్గంలోని 5,975 స్వయం సహాయక సంఘాల్లో ఉన్న 61,258 మంది సభ్యులే ఈ ఎన్నికల్లో కీలకంగా మారారు. ఒక్కో సంఘంలో పది నుంచి 15 మంది సభ్యులు ఉన్నారు. వారు ఎవరికి మద్దతిస్తే వారే విజయం సాధిస్తారనే ప్రచారం జరగుతోంది.  ప్రధాన పార్టీలన్నీ మహిళా సంఘాలపైనే దృష్టిసారించాయి. సంఘం సమావేశాల్లో ఓటు విలువ తెలుసుకుని మహిళలు  చైతన్యవంతులయ్యారు. బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకునే వారికే పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు.  

 గ్రామ సమాఖ్య సంఘాలతో చర్చలు..
 ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు నియోజకవర్గంలోని మహిళా స్వయం సహాయక సంఘాలపై దృష్టి సారించారు. అందులోని సభ్యుల ఓట్లను వేయించుకునేందుకు చర్చలు జరుపుతున్నారు. తమకు మద్దతు ప్రకటించాలని వేడుకుంటున్నారు. కొంతమంది అభ్యర్థులు మహిళల నుంచి హామీ తీసుకుంటున్నారు. ఎవరెన్ని పాట్లు పడినా చివరకు మహిళలు మద్దతు ఎవరికి లభిస్తుందో వేచి చూడాల్సిందే.. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement