సాక్షి ప్రతినిధి, అనంతపురం :మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల(బీసీ) వారికి వైఎస్సార్‌సీపీ పెద్దపీట వేసింది. ఏ వర్గాలకూ రిజర్వు చేయని స్థానాల నుంచి బీసీ నేతలను వైఎస్సార్‌సీపీ బరిలోకి దించింది. బీసీలకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చి ఓట్లు దండుకునే టీడీపీ.. సీట్ల విషయానికి వచ్చే సరికి ఆ వర్గాల ప్రజలకు మొండిచేయి చూపుతోంది.
కేవలం ఓట్ల కోసమే తమను టీడీపీ ఉపయోగించుకుంటోందని ఆ పార్టీకి చెందిన బీసీ నేతలే విమర్శస్తుండటం గమనార్హం. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు పెద్దపీట వేయడంతో ఆ వర్గాల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ వెంట బీసీలు నడుస్తోండటం టీడీపీ నేతలకు కంటి మీద కునుకు మాటలు కాదు..లేకుండా చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో అనంతపురం నగరపాలక సంస్థతోపాటు 11 పురపాలక, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తోన్న విషయం విదితమే.
మున్సిపల్ ఎన్నికలకు సమాంతరంగా ప్రాదేశిక (జెడ్పీటీసీ, ఎంపీటీసీ) ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ పదవిని జనరల్ మహిళకు, తాడిపత్రి, గుంతకల్లు, హిందూపురం పురపాలక సంఘాల చైర్‌పర్సన్ పదవులను జనరల్ మహిళకు కేటాయించారు. ధర్మవరం మున్సిపల్ చైర్మన్ పదవిని జనరల్‌కు కేటాయించారు. ఇందులో ధర్మవరం మున్సిపల్ చైర్మన్ పదవిని చేనేత వర్గాలకు కేటాయిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. హిందూపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పదవిని కూడా మైనార్టీ వర్గాలకు కేటాయిస్తామని వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. ఒక నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్‌లు.. 11 పురపాలక, నగర పంచాయతీల్లోని 323 వార్డుల్లో సింహభాగం సీట్లలో బీసీ వర్గానికి చెందిన వారికే వైఎస్సార్‌సీపీ టికెట్లు కేటాయించి, బరిలోకి దింపింది.
చేతల్లో చూపిన వైఎస్సార్‌సీపీ..
ప్రాదేశిక ఎన్నికల్లో జిల్లా పరిషత్ అధ్యక్ష పదవిని బీసీ(జనరల్)కు రిజర్వు చేశారు. జిల్లాలో 63 జెడ్పీటీసీ స్థానాల్లో ఏ వర్గానికి రిజర్వు చేయని స్థానాల్లోనూ బీసీ వర్గాలకు చెందిన నేతలకు వైఎస్సార్‌సీపీ టికెట్లు ఇచ్చి.. పోటీకి దించింది.
పెనుకొండ జెడ్పీటీసీ స్థానాన్ని జనరల్‌కు కేటాయించారు. ఈ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ బోయ సామాజిక వర్గానికి చెందిన సానిపల్లి మహీధర్‌ను బరిలోకి దించింది. టీడీపీ మాత్రం కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ కేటాయించింది.
కనగానిపల్లి జెడ్పీటీసీ స్థానాన్ని జనరల్‌కు కేటాయించారు. ఆ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ కురుబ సామాజిక వర్గానికి చెందిన నెమలివరం ఈశ్వరయ్యకు వైఎస్సార్‌సీపీ టికెట్ ఇచ్చి, బరిలోకి దించింది. కానీ.. టీడీపీ మాత్రం కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇచ్చింది.
యల్లనూరు జడ్పీటీసీ స్థానాన్ని జనరల్‌కు కేటాయించారు. ఆ స్థానం నుంచి బోయ సామాజిక వర్గానికి చెందిన కొత్తమిద్ది వెంకటరమణను వైఎస్సార్‌సీపీ బరిలోకి దించింది. ఇక్కడ నుంచి కమ్మ వర్గానికి చెందిన నేతను టీడీపీ తన అభ్యర్థిగా బరిలోకి దించింది.
నల్లమాడ జెడ్పీటీసీ స్థానాన్ని జనరల్‌కు కేటాయించారు. ఇక్కడ నుంచి ఈడిగ సామాజిక వర్గానికి చెందిన జక్కల ఆదిశేషును వైఎస్సార్‌సీపీ తన అభ్యర్థిగా బరిలోకి దించింది. కానీ.. టీడీపీ మాత్రం ఆ స్థానం నుంచి రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతను పోటీకి దింపింది.
ఓట్ల కోసం టీడీపీ తాపత్రయం..
బీసీల ఓట్లను దండుకోవడం కోసమే ఆ వర్గాలకు ప్రాధాన్యం ఇస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హామీలు గుప్పిస్తారనే విమర్శలకు జిల్లాలో నెలకొన్న పరిస్థితి బలం చేకూర్చుతోంది. ఏ వర్గాలకూ రిజర్వు చేయని స్థానాల్లో బీసీ వర్గాలకు టికెట్లు ఇవ్వకుండా టీడీపీ మొండిచేయి చూపడమే అందుకు తార్కాణం. ఎన్నికల్లో బీసీల ఓట్లను కొల్లగొట్టి అధికారంలోకి రావడం కోసమే చంద్రబాబు బీసీ డిక్లరేషన్ చేశారనే విమర్శలు అప్పట్లో బలంగా వ్యక్తమయ్యాయి.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చిన దాఖలాలు లేవని ఆ వర్గాలకు చెందిన నేతలే విమర్శిస్తున్నారు. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో జిల్లాలో సీట్ల కేటాయింపును పరిశీలిస్తే టీడీపీ కేవలం ఓట్ల కోసమే బీసీలను వాడుకుంటుందనే విమర్శలకు బలం చేకూర్చుతోందని రాజకీయ పరిశీలకులు స్పష్టీకరిస్తున్నారు.
టీడీపీ వైఖరిని పసిగట్టిన బీసీ వర్గాల ప్రజలు ఆపార్టీపై దుమ్మెత్తిపోస్తున్నారు. సీట్ల కేటాయింపులో బీసీలకు పెద్దపీట వేసిన వైఎస్సార్‌సీపీ వెంట ఆ వర్గాల ప్రజలు నడుస్తున్నారు. ఇది టీడీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే.. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవడం కష్టమవతుందని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.