నరేంద్ర మోడీ అంత పెద్ద వక్త కాదు: ఉమా భారతి
'నరేంద్ర మోడీ అంత గొప్ప వక్త కారు.ఆయన ప్రసంగాలు అంత ఉత్తేజకరంగా ఉండవు.' ఈ మాటలన్నది ఏ కాంగ్రెస్ నాయకుడో లేక ఏ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడో కాదు. నరేంద్రమోడీ మద్దతుదారు, ఆయనకు ఆత్మీయురాలు అయిన ఉమా భారతి ఈ మాటలన్నది.
'మీరెప్పుడైనా నరేంద్ర మోడీ ప్రసంగించడం విన్నారా? ఆయన అంత పెద్ద వక్త కారు. బిజెపిలో నాటికీ, నేటికీ గొప్ప వక్త ఒక్కరే. ఆయనే అటల్ బిహారీ వాజ్ పేయీ. వాజ్ పేయీకి మోడీకీ పోలికెక్కడ" అని కూడా ఆమె అన్నారు. సోమవారం ఝాన్సీలో అన్న మాటలను ఆమె మంగళవారం కూడా రిపీట్ చేశారు.
'అంత గొప్ప వక్త కాకపోయినా మోడీ సభకు జనాలు చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ప్రజలు ఆయన రావాలని కోరుకుంటున్నారు. ఆయన గొప్ప వక్త కాకపోయినా ప్రజలు ఆయన నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు' అన్నారు ఉమాభారతి.
ఉమా భారతి వ్యాఖ్యలతో బిజెపిలో కలకలం రేగుతోంది. కాంగ్రెస్ 'నేనెప్పుడో చెప్పాను' అంటూ ఆనందపడిపోతోంది. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు రీటా బహుగుణ 'మోడీ ప్రసంగాల్లో పెద్దగా సరుకేమీ ఉండదు. ఉట్టి ఊసుపోక మాత్రమే ఉంటుంది.' అంటున్నారు.