వడోదర నా కర్మభూమి: మోడీ
నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ ప్రధాని అభ్యర్థి
అంతకుముందు భారీ రోడ్ షో
గైక్వాడ్‌ల పాలనపై మోడీ ప్రశంసల జల్లు
వడోదర(గుజరాత్): బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బుధవారం లాంఛనంగా లోక్‌సభ ఎన్నికల బరిలోకి దూకారు. అట్టహాసంగా వడోదర స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. భారీసంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు వెంటరాగా కలెక్టరేట్‌కు చేరుకుని తంతు ముగించారు. కిరణ్ మహిదా అనే టీ వ్యాపారి, ఒకప్పటి బరోడా(వడోదర) సంస్థానాన్ని పాలించిన గైక్వాడ్ వంశానికి చెందిన శుభాంగినీదేవీ రాజే గైక్వాడ్ తదితరులు మోడీ అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. రాజకీయాల్లోకి రాకముందు టీ అమ్మానని మోడీ చెబుతుండడం తెలిసిందే. నామినేషన్ దాఖలుకు ముందు మోడీ వడోదర వీధుల్లో భారీ రోడ్ షో నిర్వహించారు. బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు, ప్రజలతో రోడ్లు కిక్కిరిశాయి. రోడ్‌షో ముస్లింలు నివసించే ప్రాంతాల గుండా సాగినప్పుడు ఆ వర్గం ప్రజలు పెద్ద సంఖ్యలో మోడీని పలకరించడం కనిపించింది. నామినేషన్ అనంతరం మోడీ విలేకర్లతో మాట్లాడారు.
గైక్వాడ్‌ల పాలనపై ప్రశంసలు కురిపించారు. ‘సుపరిపాలన, ప్రజాసంక్షేమానికి కృషి చేసిన గైక్వాడ్‌ల పేర్లు సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి. వడోదర నా కర్మభూమి. నాకు ఘనస్వాగతం పలికినందుకు నగర ప్రజలకు కృతజ్ఞతలు’ అని అన్నారు. వడోదరలో గైక్వాడ్‌లు ఏర్పాటు చేసిన సంస్థల నుంచి లబ్ధి పొందానని, వారు స్థాపించిన బడిలోనే ప్రాథమిక విద్య పూర్తి చేశానని గుర్తు చేసుకున్నారు. తాను జన్మించిన వాద్‌నగర్ గైక్వాడ్‌ల రాజ్యంలో భాగంగా ఉండేదని, నామినేషన్ వేసిన చోటుకి 200 అడుగుల దూరంలోనే నివసించానని చెప్పారు. మోడీ అభ్యర్థిత్వాన్ని బలపరచే అవకాశం రావడంపై టీ వ్యాపారి కిరణ్ సంతోషం వ్యక్తం చేశారు. ‘ప్రధాని అభ్యర్థులు నామినేషన్ వేసేటప్పుడు నాలాంటి సామాన్యుడినిగుర్తు చేసుకోరు. ఒక్క మోడీ మాత్రమే గుర్తు చేసుకున్నారు’ అని అన్నారు. వడోదర బీజేపీ సిట్టింగ్ ఎంపీ బాలకృష్ణ శుక్లా డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ నెల 30న వడోదరలో ఎన్నికలు జరగనున్నాయి. మోడీపై మధుసూదన్ మిస్త్రీ కాంగ్రెస్ అభ్యర్థిగా, మెకానికల్ ఇంజనీర్ సునీల్ కులకర్ణి ఆమ్ ఆద్మీ పార్టీఅభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మోడీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచీ లోక్‌సభకు పోటీ చేస్తుండడం తెలిసిందే.
‘దేశం కాంగ్రెస్‌ను నమ్మదు’
షోలాపూర్/లాతూర్(మహారాష్ట్ర): కాంగ్రెస్‌పై, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శల వాడిని పెంచారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో విఫలమైన కాంగ్రెస్‌ను దేశం నమ్మదని దుయ్యబట్టారు. మోడీ బుధవారం షోలాపూర్, లాతూర్‌లలో ఎన్నికలసభల్లో మాట్లాడారు. మహారాష్ట్రకు చెందిన కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, శరద్ పవార్‌లపై నిప్పులు చెరిగారు. ‘ఢిల్లీలోని యూపీఏ ప్రభుత్వాన్ని మళ్లీ ఎందుకు ఎన్నుకోవాలో ఒక్క కారణం చెప్పగలరా? సుశీల్, పవార్‌లు మీకి చ్చిన హామీలు తుంగలో తొక్కలేదా?’ అని ప్రజలతో అన్నారు. ‘షిండేజీ! మీరు హోం మంత్రి. షోలాపూర్ చేనేత కార్మికులు ఉత్పత్తి చేసే యూనిఫారాలను పోలీసులకు అందించి, వారికి జీవనోపాధి కల్పించాలన్న ఆలోచన మీకెందుకు రాలేదు? ఆయన (షిండే) మేడంను(సోనియా గాంధీ) ఎలా సంతోషంగా ఉంచాలో రేయింబవళ్లు ఆలోచిస్తుంటారు. వీరంతా ఒకే కుటుంబ (గాంధీ కుటుంబ) భక్తులు’ అని విమర్శించారు. కాంగ్రెస్ పేదరికాన్ని పర్యాటకంలా చూస్తోందని, ఆగర్భశ్రీమంతుడైన రాహుల్‌కు పేదరికమంటే ఏంటో తెలియదని మోడీ విమర్శించారు.