‘ఆమంచి’పై సీబీఐ విచారణ కోరుతాం
చీరాల, న్యూస్‌లైన్ : చీరాల నియోజకవర్గం కేంద్రంగా ఆమంచి కృష్ణమోహన్ చేస్తున్న అక్రమాలపై టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీబీఐ ద్వారా విచారణ కోరుతామని ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పోతుల సునీత భర్త సురేష్ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆమంచి అక్రమాలకు పాల్పడి నెగ్గారని.. చీరాల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో పట్టణ బంద్ నిర్వహించారు. పోతుల సురేష్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి బస్టాండ్ వద్ద బైఠాయించి ఆమంచికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ ఆమంచి అక్రమాలకు సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో తన ప్యానల్ ఓటమి చెందితే సార్వత్రిక ఎన్నికల్లో తాను గెలిచినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆమంచి విలేకరుల సమావేశంలో చెప్పి ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆయన ప్యానల్‌కు ఆరు కౌన్సిలర్ సీట్లు మాత్రమే దక్కాయని, ఆమంచి మాట మీద నిలబడే వ్యక్తే అయితే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ నుంచి తీసుకున్న డబ్బుకు లెక్కచెప్పలేకే తాము ఇదంతా చేస్తున్నట్లు ఆమంచి అనడం తన అవివేకానికి నిదర్శనమన్నారు. అడవుల్లో ఉన్నా.. జనజీవనంలో ఉన్నా పేద ప్రజల కోసం పట్టుదలతో పనిచేస్తామని, ఆమంచిలా నీచరాజకీయాలకు పాల్పడమన్నారు.