బీజేపీ, టీడీపీ, జనసేనతో కలిసి పోటీచేస్తాం
హైదరాబాద్: బీజేపీ, టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తామని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ స్పష్టం చేశారు. తమ పార్టీ పెట్టుకోబోయే పొత్తులకు సంబంధించి కొన్ని రోజుల్లో స్ఫష్టత వస్తుందని జేపీ తెలిపారు. ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీని మతతత్వ పార్టీగా చిరంజీవి విమర్శించడాన్ని జేపీ తప్పుబట్టారు. బీజేపీని మతతత్వ పార్టీగా విమర్శించడం చిరంజీవి తగదని సూచించారు. ఈసారి మల్కాజ్ గిరి ఎంపీ స్థానం నుంచి పోటీకి దిగుతున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
రాబోయే ఎన్నికల్లో బీజేపీతో పొత్తునకు లోక్‌సత్తా సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్ర, దేశ ప్రయోజనాల దృష్ట్యా పొత్తులకు సానుకూలమని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ పేర్కొంటూ.. రాబోయే ఎన్నికల్లో కలసి పనిచేయడానికి బీజేపీని మెరుగైన భాగస్వామిగా పేర్కొన్నారు. ఈ మేరకు ఆరుపేజీల లేఖను శుక్రవారం మీడియాకు విడుదలచేశారు. ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీ స్వచ్ఛందంగా కండబలం, ఉచిత తాయిలాల రాజకీయం చేయకుండా వ్యవహరిస్తుందో.. ఎన్నికల విజయాలమార్గం ముళ్లబాటగా మారుతుంది’అని పేర్కొన్నారు.