1094 జడ్పీటీసీలకు బరిలో 5276 మంది
సాక్షి, హైదరాబాద్: పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. 1096 జడ్పీటీసీలకు 12,590 నామినేషన్లు, 16,589 ఎంపీటీసీ స్థానాలకు 1,17,629 నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే. వీటిలో కొన్ని నామినేషన్ల పరిశీలన దశలోనే తిరస్కారానికి గురయ్యాయి. ఇక సోమవారం మధ్యాహ్నం మూడు గంటల వరకే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసినప్పటికీ.. రంగంలో ఉన్న అభ్యర్థుల జాబితాను రూపొందించడంలో అధికారులు తీవ్ర జాప్యంచేశారు.
రాత్రి పొద్దుపోయాక వారికి గుర్తులు కేటాయిం చారు. అర్ధరాత్రి వరకు అందిన సమాచారం మేరకు 1094 జడ్పీటీసీలకు మొత్తం 5276 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో చేర్చడాన్ని నిరసిస్తూ రెండు మండలాల్లో ఎన్నికలను బహిష్కరించారు. ఈ జిల్లాలోని కుక్కునూరు(ఎవరూ నామినేషన్ వేయలేదు), వేలేర్పాడు(వేసిన వారంతా ఉపసంహరించుకున్నారు) మండలాల్లో ఎవరూ బరిలో లేకపోవడంతో ఎన్నికలను నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. జిల్లాల్లో ఇదివరకే ఎంపిక చేసిన ఆఫ్‌సెట్ ప్రింటర్ల యజమానులకు ఆ పని అప్పగించారు. నాలుగైదు రోజుల్లో అభ్యర్థుల పేర్లు, గుర్తులతో కూడిన బ్యాలెట్ పత్రాలు అందుబాటులోకి రానున్నాయి. కాగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కేసు మంగళవారం విచారణకు రానున్న నేపథ్యంలో.. రెండుదశల్లో ఎన్నికలకు సుప్రీంకోర్టు అనుమతినిస్తే జిల్లాల్లో డివిజన్ల సంఖ్య ఆధారంగా రెండుగా విభజించి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. వచ్చే నెల 6, 8 తేదీల్లో ఎన్నికలు నిర్వహించి, 11న ఓట్ల లెక్కింపు చేపట్టాలని భావిస్తోంది.
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
Published Tue, Mar 25 2014 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 5:07 AM
Advertisement