వైఎస్ విజయమ్మ పర్యటన సక్సెస్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రచారం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. జిల్లాలో నాలుగు రోజుల పాటు సాగిన పర్యటన విజయవంతమైంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 20న అనంతపురం జిల్లా నుంచి నేరుగా బనగానపల్లెకు చేరుకున్న విజయమ్మ ఆళ్లగడ్డ, నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు, డోన్, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోని మున్సిపాలిటీల్లో పర్యటించారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి వస్తున్నారని తెలుసుకున్న ఆయా గ్రామాల ప్రజలు ప్రధాన రహదారుల వెంట బారులు తీరారు.
అడుగడుగున పూల వర్షం కురిపించి అభిమానం చాటుకున్నారు. బహిరంగ సభలకు జనం పోటెత్తారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలను గెలుపొందించడం ద్వారా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోగలిగితే వైఎస్ సువర్ణయుగం మళ్లీ చూడగలమన్నారు. అదేవిధంగా వైఎస్‌ఆర్ సంక్షేమ పాలనను.. చంద్రబాబు, కిరణ్‌ల ప్రజా వ్యతిరేక పాలనను కళ్లకు కట్టినట్లు వివరించడం ప్రజలను ఆలోచింపజేసింది.
రాష్ట్రాన్ని ముక్కలు చేయడంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు తీసుకున్న నిర్ణయంపై విరుచుకుపడ్డారు. రానున్న ఎన్నికల్లో ఈ మూడు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మొత్తంగా విజయమ్మ పర్యటన ప్రత్యర్థి పార్టీల నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. ఆమె ప్రసంగాలు తాజా మాజీ ఎమ్మెల్యేలకు ముచ్చెమటలు పట్టించగా.. ఆయా ప్రాంతాల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల గెలుపు నల్లేరు మీద నడకేననే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రచారం చేపట్టిన పలు మున్సిపాలిటీల్లో ప్రధానమైన నాయకులు పార్టీలో చేరడం శ్రేణులకు మరింత బలాన్నిస్తోంది.
చివరి రోజు నాలుగు మున్సిపాలిటీల్లో ప్రచారం
వైఎస్ విజయమ్మ చివరి రోజు ఆదివారం డోన్, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోని మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె ప్రచారానికి ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రోడ్‌షోలకు విశేష స్పందన లభించింది. డోన్ పట్టణంలో బహిరంగ సభకు ఇసుకేస్తే రాలనంత జనం పాల్గొన్నారు. గూడూరులో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మణిగాంధీ, ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో సభకు పల్లెల నుంచి ప్రజలు పోటెత్తారు. ఎమ్మిగనూరు, ఆదోనిలోనూ రోడ్‌షోలు, బహిరంగ సభల్లో విజయమ్మ ప్రసంగం ఆకట్టుకుంది.
కార్యక్రమంలో పార్టీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బుట్టా రేణుక, జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, కొత్తకోట ప్రకాష్‌రెడ్డి.. డోన్, కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు బుగ్గన రాజేంధ్రనాథ్‌రెడ్డి, మణిగాంధీ, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, మంత్రాలయం నాయకుడు వై.ప్రదీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం ముగించుకున్న విజయమ్మ హైదరాబాద్‌కు బయలుదేరారు