పల్లెపోరులో జోరుగా ‘ఫ్యాన్’గాలి వీచింది. తిరుగులేని మెజార్టీతో జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుంది. అత్యధిక మండలాధ్యక్ష పీఠాలను దక్కించుకునేందుకు స్పష్టమైన మెజార్టీ సాధించింది.
‘పుర’పోరులో టీడీపీ విజయం సాధించిన ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ చేజిక్కించుకుని తన ఆధిపత్యాన్ని చాటింది. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సింహభాగం స్థానాల్లో విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు మునిసిపాలిటీలను దక్కించుకున్నామనే ఆనందం 24గంటలు కూడా లేకుండా పోవడంతో టీడీపీ శ్రేణులు నిర్వేదానికి లోనయ్యాయి.
సాక్షి, కడప: స్థానికపోరులో తమకు తిరుగులేదని వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ మరోసారి నిరూపించుకుంది. మంగళవారం వెలువడిన ఫలితాలలో వైఎస్సార్‌సీపీ తిరుగులోని ఆధిత్యాన్ని ప్రదర్శించింది. జిల్లాలో 50 జెడ్పీటీసీ, 559 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 24 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
తక్కిన 535 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తొలివిడతలో ఏప్రిల్ 6న 29 మండలాలకు, మలివిడతలో ఏప్రిల్ 11న 21 మండలాలకు పోలింగ్ జరిగింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫలితాలు వెలువరించకూడదని కొందరు కోర్టుకు వెళ్లడంతో ఫలితాలను మే 13న ప్రకటించాలని కోర్టు ఆదేశించింది. దీంతో మంగళవారం కౌంటింగ్ నిర్వహించారు. జమ్మలమడుగు డివిజన్‌కు సంబంధించిన మండలాలకు మదీనా ఇంజనీరింగ్ కాలేజీలో, రాజంపేట డివిజన్‌ను శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో, కడప డివిజన్ కౌంటింగ్‌ను కేశవరెడ్డి స్కూలులో లెక్కించారు. ఉదయం 8గంటల నుంచి అర్ధరాత్రి వరకూ కౌంటింగ్ సాగింది.
జెడ్పీ పీఠం వైఎస్సార్‌సీపీకే
కడప జిల్లా పరిషత్ పీఠం వైఎస్సార్‌సీపీ వశమైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎంపీటీసీ ఓట్లను లెక్కించారు. ఆపై జెడ్పీటీసీ ఓట్లను గణించారు. పులివెందుల జెడ్పీటీసీ ఫలితం మొదటగా వెల్లడైంది. జిల్లాలోని 50 జెడ్పీటీసీ స్థానాల్లో 42 స్థానాలను దక్కించుకుని జిల్లా పరిషత్ అధ్యక్షపీఠాన్ని దక్కించుకునేందుకు స్పష్టమైన మెజార్టీని వైఎస్సార్‌సీపీ సాధించింది.
ఆ నాలుగింటిలో మూడు చోట్ల
వైఎస్సార్‌సీపీ హవా
సోమవారం వెలువడిన మునిసిపల్ ఫలితాల్లో పార్టీ శ్రేణులు కూడా ఊహించని విధంగా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు స్థానాలను టీడీపీ దక్కించుకుంది. దీంతో ఆయా అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలను కూడా టీడీపీ దక్కించుకుంటుందని ‘తెలుగుతమ్ముళ్లు’ సంబరపడ్డారు.
అయితే వారి ఆనందం 24గంటలు కూడా గడవకముందే ఆవిరైంది. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ దక్కించుకుని టీడీపీది బలుపు కాదని వాపే అని తేల్చింది. జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానాన్ని 8,886 ఓట్ల మెజార్టీతో దక్కించుకుంది. అలాగే 9 ఎంపీటీసీ స్థానాల్లో ఏకగ్రీవమైన 4స్థానాలతో పాటు మరో మూడు స్థానాల్లో గెలుపొంది 7 స్థానాలతో ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక్కడ కేవలం రెండు ఎంపీటీపీ స్థానాల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. దీంతో జమ్మలమడుగు మండలంలో తమ ఆధిపత్యానికి తిరుగులేదని దేవగుడి సోదరులు నిరూపించుకున్నారు.
ప్రొద్దుటూరు జెడ్పీటీసీ స్థానాన్ని కూడా వైఎస్సార్ సీపీ దక్కించుకుంది. అలాగే 24 ఎంపీటీసీ స్థానాల్లో 17 చోట్ల విజయం సాధించి భారీ మెజార్టీతో మండలాధ్యక్ష స్థానాన్ని దక్కించుకుంది. టీడీపీ ఆరుచోట్ల విజయం సాధించింది. ఇది వరకే ఆపార్టీకి ఒక స్థానం ఏకగ్రీవమైంది. అలాగే మైదుకూరులో కూడా ‘ఫ్యాన్’గాలి జోరుగా వీచింది. జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంది. 9 ఎంపీటీసీ స్థానాల్లో 6 చోట్ల గెలుపొంది ఎంపీపీ స్థానాన్ని దక్కించుకుంది. ఈ మూడు చోట్ల వైఎస్సార్‌సీపీకి భారీ మెజార్టీ దక్కడంతో ఎమ్మెల్యే ఎన్నికల్లో ఈ స్థానాల్లో తిరుగులేని మెజార్టీ సాధిస్తామని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
రఘురాముని ఇలాఖాలో ‘ఫ్యాన్’ హవా
వైఎస్సార్‌సీపీ మైదుకూరు నియోజకవర్గ అభ్యర్థి శెట్టిపల్లి రఘురామిరెడ్డి సొంత మండలం చాపాడులో ‘ఫ్యాన్’గాలికి సైకిల్ ఎదురు నిలువలేకపోయింది. భారీ మెజార్టీతో జెడ్పీటీసీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 12 ఎంపీటీసీ స్థానాల్లో ఇప్పటికే ఏకగ్రీవమైన రెండిటితో కలిపి 11 స్థానాలలో విజయం సాధించి తిరుగులేని మెజార్టీతో మండలపీఠాన్ని దక్కించుకుంది. ఇక్కడ కేవలం ఒక్క ఎంపీటీసీ స్థానంలో మాత్రమే టీడీపీ గెలిచింది. లేదంటే క్లీన్‌స్వీప్ అయ్యేది. చాపాడు మాజీ మండలాధ్యక్షుడు, డీఎల్ అనుచరుడు ద్వార్శల గురివిరెడ్డి సొంత ఎంపీటీసీ లక్ష్మిపేటను 541 ఓట్లతో వైఎస్సార్‌సీపీ చేజిక్కించుకుంది.
పులివెందులలో క్లీన్‌స్వీప్
పులివెందుల నియోజకవర్గంలోని లింగాల, సింహాద్రిపురం మండలాల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. వీటితో పాటుఇంకా పలు మండలాల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. వేంపల్లిలో ఎమ్మెల్సీ సతీశ్‌రెడ్డి సొంత ఎంపీటీసీని కూడా వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. వేంపల్లి జెడ్పీటీసీతో పాటు ఎంపీపీ పీఠం కూడా వైఎస్సార్‌సీపీ ఖాతాలోకి చేరింది. ఈ ఫలితాలతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నిల్లో ఇంతకంటే మరింత మెరుగైన ఫలితాలు వెల్లడవుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.