వైఎస్‌ఆర్ సీపీ-సీపీఎం కూటమికే.. అత్యధిక స్థానాలు
వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు, న్యూస్‌లైన్: జిల్లాలో వైఎస్‌ఆర్ సీపీ-సీపీఎం కూటమి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు, పినపాక అసెంబ్లీ అభ్యర్థి పాయం వెంకటేశ్వరు అన్నారు. ఆయన గురువారం ఇక్కడ తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో వైఎస్‌ఆర్ సీపీ ఐదు స్థానాలు, సీపీఎం రెండు స్థానాలు కైవసం చేసుకుంటాయని చెప్పారు. పినపాక నియోజకవర్గంలో తాను కనీసం పదివేల ఓట్ల మెజార్జీతో గెలుస్తానని అన్నారు. జిల్లాలో వైఎస్‌ఆర్ సీపీ-సీపీఎం కూటమి మంచి సమన్వయంతో పనిచేసిందన్నారు. ఎన్నికల్లో నిరంతరం శ్రమించిన ఈ రెండు పార్టీ శ్రేణులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలి పారు. జిల్లాలో వైఎస్‌ఆర్ సీపీ బలమైన శక్తిగా అవతరించబోతోందని అన్నారు. వైఎస్ సంక్షేమ పథకాలను అమలుచేయించడంలో తాము ముందుంటామని, ప్రజాసంక్షేమం కోసం నిర్విరామ కృషి చేస్తామని అన్నారు. పినపాక నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తానని, వారికి అండగా ఉంటానని అన్నారు. నియోజకవర్గంలోని తాగునీరు సాగునీటి సమస్యల పరిష్కారానికి పాటుపడతానన్నారు. నియోజకవర్గంలోని సింగరేణి, బీపీఎల్, భారజల కర్మాగారం ఉద్యోగులకు, కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు.