లార్డ్ గణేశ్.. యానిమేషన్‌కు ఓ క్యారెక్టర్ అయ్యాడు.రావణుడు.. యాడ్స్‌కి మోడల్ అయ్యాడు. తలనొప్పి మాత్రల నుంచి భావోద్వేగాల వరకు ప్రకటనలకు ఆయన పదితలలు పనికొచ్చినట్టుగా ఇంకే పౌరాణిక పాత్రా మేకప్ వేసుకోలేదు. ఇటీవలే నిమజ్జనం కాబట్టి గణేశ్ ఇంకా వార్తల్లో ఉన్నాడు అనుకోవచ్చు. మరి హఠాత్తుగా రావణుడి ప్రస్తావన ఎందుకు? ఎందుకంటే ఆయన బొమ్మల తయారీకి టైమ్ వచ్చింది కనుక. ఢిల్లీ ఆ పనిలో అప్పుడే బిజీ అయిపోయింది కూడా. దసరాకి ఉత్తర భారతంలో రావణ దగ్ధం ఓ ఘట్టం. అందుకు రావణుడి దిష్టిబొమ్మలు కావాలి కదా. తితార్‌పూర్ ఇప్పుడు ఆ పనిలో ఉంది.
ఢిల్లీలోని సుభాష్‌నగర్‌కి టాగోర్ గార్డెన్స్‌కీ మధ్యలో ఉంటుంది తితార్‌పూర్. మెట్రోలో వెళ్లాలంటే బ్లూలైన్ పట్టుకోవాలి. ఇదొక అర్బన్ విలేజ్. దీన్ని రావణ సూపర్‌మార్కెట్ అని పిలిచుకుంటారు అర్బన్ ఫోక్స్ (పురజనులు). ఎందుకంటే ఆసియాఖండంలోనే అతిపెద్ద దిష్టిబొమ్మల మార్కెట్ ఇది. దసరా సమయంలో రావణ, మేఘనా«థుడు (రావణుడి కొడుకు), కుంభకర్ణుడి బొమ్మలు చేస్తారు. మిగిలిన రోజుల్లో ఎవరు ఏ బొమ్మలు (రాజకీయ నాయకులు ఎట్‌సెట్రా) చేయమని ఆర్డర్ ఇస్తే అవి చేసిపెడ్తారు. తితార్‌పూర్ ఫుట్‌పాత్‌లన్నీ రావణుడి తలలు, చేతులు, కాళ్లు, అవయవాలతో నిండి ఉంటాయి. ఇంకోవైపు.. తయారైన రంగురంగుల దిష్టిబొమ్మలు. వీటిని కొనుక్కునేవాళ్లతోనే కాదు.. ఫొటోలు తీసుకునే విదేశీయులు, దేశీ టూరిస్ట్‌లతోనూ తితాపూర్ కిటకిటలాడుతూ ఉంటుంది దసరా వరకు.
2 నుంచి 80 అడుగుల వరకు
వెదురు బద్దలతో ముందు రావణుడి దేహాకృతిని తయారు చేస్తారు. తర్వాత దాంట్లో అన్నీ గుడ్డముక్కలు కుక్కుతారు. పటాసులూ పెడ్తారు (పటాసులు కూడా కావాలని కోరుకున్న వాళ్లకు మాత్రమే పటాసులు పెట్టి తయారు చేసిస్తారు). పైనుంచి మళ్లీ ఓ గుడ్డను చుట్టి.. తర్వాత రంగురంగుల కాగితాలతో తల నుంచి కాళ్ల వరకు అతికించేస్తారు. ఇప్పుడు పెయింట్‌తో కళ్లు, ముక్కు, చెవులు, నోరు గీస్తారు. దాంతో రావణుడి దిష్టిబొమ్మ రెడీ. ఈ బొమ్మలు రెండు అడుగుల నుంచి దాదాపు 80 అడుగుల ఎత్తు వరకు రకరకాల సైజుల్లో దొరుకుతాయి. అయిదు వందల నుంచి లక్షరూపాయల వరకు ధరలుంటాయి.
బాహుబలి.. డ్రాక్యూలా
దసరా వస్తోందంటే రావణుడి దిష్టిబొమ్మలకు చాలా గిరాకీ ఉంటుంది. రావణుడిని రావణుడి ఆకారంలోనే కాక తమకు ఇష్టమైన వారి ఆకారంలో కూడా తయారు చేసివ్వమని అడుగుతుంటారట కస్టమర్లు. కిందటేడు బాహుబలి, డ్రాక్యూలా షేప్‌లో రావణుడి బొమ్మలు కావాలని మహా డిమాండ్ వచ్చిందట. ఇంకొంత మంది తమకు నచ్చిన దుస్తుల్లో రావణుడిని అలంకరించమంటారట. కాని ఈ తయారీదారులు ఇలాంటి వాటికి ‘నో’ అని సమాధానం చెప్తారు చాలా సింపుల్‌గా. ‘‘ఎంతైనా రావణుడే కదా మాకు అన్నదాత. ఆయన బొమ్మలు అమ్మే కదా మా పొట్టనింపుకుంటున్నాం. మాకు అన్నంబెట్టే ఆ దేవుడిని అతని రూపంలో కాకుండా వేరే వేరే రూపాల్లో తయారు చేయడమంటే ఆ దేవుడిని అవమానించినట్టే కదా! అందుకే కలర్స్, డిజైన్ ఎలిమెంట్స్ తప్ప ఇంక వేటినీ కస్టమైజ్ చేయం’’ అంటాడు రాజు అనే తయారీదారుడు. దహనం చేస్తున్నప్పుడు ఏమైనా ఫీలవుతారా? అని అడిగితే.. ‘‘బాధనిపిస్తుంటుంది.. ఈ చేతులతో తయారు చేస్తాం కదా... కాని ఏంచేస్తాం? పండగలో భాగం. అదొక సంప్రదాయం’’ అని సమాధానమిస్తాడు శంకర్ అనే ఇంకో తయారీదారుడు.
సీజన్ అయ్యాక ఇంట్లో శిక్షణ
ఈ సంచార కమ్మరులు దిష్టిబొమ్మల తయారీని ఓ పరిశ్రమగా కాక కళగానే చూస్తారు. సీజన్ అయిపోయాక ఇంట్లో ఉన్న పిల్లలకు ఈ కళను నేర్పిస్తుంటారు. వెదురుబద్దలను ఎండబెట్టడం.. వాటిని చీల్చడం.. బొమ్మల్లా చేయడం, రంగులు తయారు చేయడం.. రంగుల ఎంపిక.. కనుముక్కు తీరు గీయడం... వంటివాటన్నిటిలో శిక్షణనిస్తారు. చాలా మంది పిల్లలు బడికి వెళ్తూనే తమ పెద్దవాళ్ల దగ్గర ఈ కళనూ అభ్యసిస్తున్నారు. పనిముట్ల తయారీలో వచ్చే లాభం కన్నా సీజన్‌లో దిష్టిబొమ్మల ద్వారా సంపాదించేదే ఎక్కువ అని చెప్తారు.
ఎవరీ రావణబ్రహ్మలు?
కమ్మరుల్లో సంచార కమ్మరులు ఈ దిష్టిబొమ్మలు చేసేవారు. రాజస్థాన్‌కు చెందిన గడియా లోహార్ తెగవాళ్లు మేవాడ్ రాజు మహారాణా ప్రతాప్ సైన్యంలో ఉండేవారట. అక్బర్‌తో జరిగిన యుద్ధంలో మహారాణా ప్రతాప్ ఓడిపోవడంతో ఆ అవమానం తట్టుకోలేక తిరిగి విజయం సాధించే వరకు ఆ రాజ్యంలో అడుగుపెట్టమని ప్రతిజ్ఞచేసి మరీ మేవాడ్‌ను వదిలారట. అలా చెట్టుకొకరు.. పుట్టకొకరుగా చెల్లా చెదురై సంచారం కొనసాగించారట. వాళ్ల వారసులమే అని తమ చరిత్ర చెప్తారు వీళ్లు. కర్ణాటకతోపాటు మన దగ్గర కనిపించే లండాలు కూడా ఈ తెగవారే అంటారు. తితార్‌పూర్‌లో ఉంటున్న గడియా లోహార్స్ సీజన్‌లో దిష్టిబొమ్మలను చేస్తూ మిగిలిన సమయంలో ఇనుప వస్తువులు తయారు చేస్తూ జీవనం సాగిస్తారు.
– శరాది
Comments
Please login to add a commentAdd a comment