పళ్లెంలో ముత్యాలు | Amazing Benefits Of Sabudana Dishes from South India | Sakshi
Sakshi News home page

పళ్లెంలో ముత్యాలు

Published Sat, Jun 8 2019 12:55 AM | Last Updated on Sat, Jun 8 2019 4:44 AM

Amazing Benefits Of Sabudana Dishes from South India - Sakshi

సగ్గుబియ్యం తెల్లగా ఉంటుంది. అందరినీ ఆకర్షిస్తుంది. తేలిగ్గా జీర్ణం అవుతుంది. ప్రొటీన్లను ఇస్తుంది. ముత్యాలను పోలిన రూపం.. రుచికి ప్రతిరూపం. వడియాలు.. పాయసం రొటీన్‌. లడ్డు, దోసె, కిచిడీ, వడ ట్రై చేయండి. మీ మొగ్గు దీనికే అని చాటి చెప్పండి.

సాబుదానా లడ్డు
కావలసినవి: సగ్గుబియ్యం – ఒక కప్పు (సన్న సగ్గు బియ్యం); ఎండుకొబ్బరి తురుము – ముప్పావు కప్పు; పంచదార పొడి – అర కప్పు; నెయ్యి – 7 టేబుల్‌ స్పూన్లు; జీడి పప్పులు  10 (చిన్న ముక్కలు చేయాలి); ఏలకుల పొడి – అర టీ స్పూను; జాజికాయ పొడి – చిటికెడు.

తయారీ:
►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, మంట బాగా తగ్గించి, సగ్గుబియ్యం వేసి దోరగా వేయించి (సన్న మంట మీద కాస్తంత సమయం పడుతుంది) ప్లేట్‌లోకి తీసుకుని చల్లార్చాలి
►అదే బాణలిలో ఎండు కొబ్బరి తురుము వేసి వేయించాలి
►చల్లారిన సగ్గు బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి, వేగుతున్న ఎండు కొబ్బరికి జత చేసి మరోమారు వేయించాలి
►పంచదార పొడి కూడా జత చేసి రెండు నిమిషాలు బాగా కలిపి ఒక పాత్రలోకి తీసుకోవాలి
►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు పలుకులు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, సగ్గుబియ్యం పొడి మిశ్రమానికి జత చేయాలి
►ఏలకుల పొడి, జాజికాయ పొడి కూడా జత చేయాలి
►కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు లడ్డూ మాదిరిగా ఉండ కట్టి, ప్లేట్‌లోకి తీసుకోవాలి
►బాగా చల్లారాక గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

సాబుదానా దోసె
కావలసినవి: సగ్గు బియ్యం – అర కప్పు; మినప్పప్పు – పావు కప్పు; మెంతులు – అర టీ స్పూను; అటుకులు – పావు కప్పు; బియ్యం – ముప్పావు కప్పు; ఉప్పు – తగినంత; నెయ్యి – తగినంత.

తయారీ:
►ఒక పాత్రలో సగ్గు బియ్యం, మినప్పప్పు, మెంతులు, అటుకులు వేసి సుమారు ఆరు గంటల సేపు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి
►ఒక పెద్ద పాత్రలో బియ్యానికి తగినన్ని నీళ్లు జత చేసి ఆరు గంటల సేపు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి
►నానబెట్టిన సగ్గు బియ్యం మిశ్రమాన్ని, నానబెట్టిన బియ్యానికి జత చేసి, మిక్సీలో వేసి మెత్తగా దోసెల పిండిలా అయ్యేవరకు మిక్సీ పట్టి, ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని మూత పెట్టి, పన్నెండు గంటల పాటు వదిలేయాలి
►మరుసటి రోజు ఉప్పు జత చేయాలి
►స్టౌ మీద పెనం వేడయ్యాక, గరిటెడు దోసె పిండి వేసి, సమానంగా పరిచి, రెండు వైపులా నెయ్యి వేసి దోరగా కాల్చి ప్లేటులోకి తీయాలి
►కొబ్బరి చట్నీతో వేడివేడిగా అందించాలి.

సాబు దానా థాల్‌పీ
కావలసినవి: సగ్గుబియ్యం – ముప్పావు కప్పు; బంగాళదుంపలు – 2; జీలకర్ర పొడి – అర టీ స్పూను; వేయించిన పల్లీలు – 4 టేబుల్‌ స్పూన్లు; అల్లం తురుము – ఒక టీ స్పూను; కొత్తిమీర – పావు కప్పు; నిమ్మ రసం – ఒక టీ స్పూను; పంచదార – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నెయ్యి – తగినంత.

తయారీ:
►సగ్గుబియ్యాన్ని రెండు మూడు సార్లు నీళ్లలో శుభ్రంగా కడగాలి
►తగినన్ని నీళ్లు జత చేసి ఆరు గంటల సేపు నానబెట్టాలి
►నీటిని ఒంపేసి, తడి పోయేవరకు ఆరబెట్టాలి ∙బంగాళ దుంపలను ఉడికించి తొక్క వేరు చేసి, దుంపలను చేతితో మెత్తగా మెదపాలి
►ఒక పాత్రలో సగ్గు బియ్యం, మెదిపిన బంగాళ దుంప వేసి బాగా కలిపి, మిగిలిన పదార్థాలను (నెయ్యి తప్పించి) జత చేసి బాగా కలపాలి 
►స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక నెయ్యి వేయాలి
►చేతికి కొద్దిగా నూనె పూసుకుని, సగ్గు బియ్యం మిశ్రమాన్ని కొద్దిగా చేతిలోకి తీసుకుని, పల్చగా ఒత్తి, పెనం మీద వేసి రెండు వైపులా కాల్చాలి
►బంగారు రంగులోకి వచ్చి, బాగా కాలిన తరవాత ప్లేట్‌లోకి తీసుకోవాలి
►పెరుగు చట్నీ లేదా కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.

సాబుదానా కిచిడీ
కావలసినవి: సగ్గు బియ్యం – ఒక కప్పు; బంగాళ దుంపలు – 2; వేయించిన పల్లీలు – అర కప్పు; కరివేపాకు – రెండు రెమ్మలు; తరిగిన పచ్చి మిర్చి – ఒక టేబుల్‌ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; కొబ్బరి తురుము – పావు కప్పు; పంచదార – ఒక టీ స్పూను; నిమ్మరసం – ఒక టీ స్పూను; నెయ్యి – 3 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – తగినంత.

తయారీ:
►సగ్గుబియ్యాన్ని నీళ్లలో శుభ్రంగా కడగాలి
►తగినన్ని నీళ్లు జత చేసి సుమారు ఆరు గంటల పాటు నానబెట్టాలి
►నీరు తీసేసి సగ్గు బియ్యాన్ని పక్కన ఉంచాలి
►బంగాళ దుంపలను ఉడికించి, తొక్కి తీసి, చిన్న చిన్న ముక్కలుగా తరగాలి
►స్టౌ మీద బాణలిలో పల్లీలు వేయించి, చల్లారాక మిక్సీలో వేసి రవ్వలా పొడి చేయాలి
►పల్లీల పొడి, ఉప్పు, పంచదార జత చేయాలి
►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీలకర్ర వేసి వేయించాలి
►కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు వేసి వేయించాలి
►అల్లం తురుము వేసి మరోమారు వేయించాలి
►తరిగిన బంగాళ దుంప జత చేసి మరోమారు వేయించాక, సగ్గు బియ్యం మిశ్రమం జత చే సి కొద్దిసేపు ఉడికించి (ఎక్కువ ఉడికించకూడదు) దింపేయాలి
►నిమ్మ రసం, కొత్తిమీర తరుగు జత చేయాలి
►కిచిడీ అందించే ముందు కొద్దిగా కొత్తిమీర, నిమ్మ రసం, కొబ్బరి తురుములతో అలంకరించితే బాగుంటుంది
వేడివేడిగా అందించాలి.

సాబుదానా వడ
కావలసినవి:  సగ్గు బియ్యం – అర కప్పు; నీళ్లు – అర కప్పు కంటె కొద్దిగా ఎక్కువ; సన్నగా తరిగిన పచ్చి మిర్చి – రెండు; అల్లం తురుము – పావు టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; నిమ్మ రసం – ఒక టీ స్పూను; పంచదార పొడి – అర టీ స్పూను; వేయించిన పల్లీలు – 2 టేబుల్‌ స్పూన్లు (చిన్న చిన్న ముక్కలు చేయాలి); ఎండు కొబ్బరి తురుము – ఒక టేబుల్‌ స్పూను; రాజ్‌ గిర్‌ పిండి – 3 టేబుల్‌ స్పూన్లు (సూపర్‌ మార్కెట్‌లో దొరుకుతుంది); సైంధవ లవణం – చిటికెడు; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా.

తయారీ:
►సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడిగి అర కప్పు నీళ్లు జత చేసి ఒక రోజు రాత్రంతా నానబెట్టాలి
►మరుసటి రోజు ఉదయం నీటిని ఒంపేయాలి
►ఒక పాత్రలో సగ్గు బియ్యాన్ని వేసి చేతితో బాగా మెత్తగా అయ్యేలా మెదపాలి
►పల్లీ ముక్కలు, జీడి పప్పు ముక్కలు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, జీలకర్ర జత చేసి మెత్తగా అయ్యేలా కలపాలి
►కొబ్బరి తురుము జత చేసి మరోమారు కలపాలి
►రాజ్‌ గిర్‌ పిండి, కొద్దిగా నీళ్లు జత చేసి వడల పిండి మాదిరిగా కలపాలి
►అర టీ స్పూను పంచదార, ఉప్పు జత చేసి మరోమారు కలపాలి
►కొద్దికొద్దిగా పిండి తీసుకుని వడ మాదిరిగా చేతితో ఒత్తాలి
►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఒత్తి ఉంచుకున్న వడలను ఒక్కొక్కటిగా వేస్తూ, దోరగా వేయించి పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి
►చింత పండు పచ్చడి లేదా కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.

సాబుదానా చివ్‌డా
కావలసినవి: సగ్గు బియ్యం – అర కప్పు; పల్లీలు – పావు కప్పు; కిస్‌మిస్‌ – పావు కప్పు; జీడి పప్పులు – పావు కప్పు; మిరప కారం – పావు టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 1; పంచదార పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – తగినంత.

తయారీ:
►స్టౌ మీద బాణలిలో నూనె పోసి బాగా కాగాక, కొద్దికొద్దిగా (అన్నీ ఒకేసారి వేయకూడదు) సగ్గు బియ్యం వేసి డీప్‌ ఫ్రై చేసి, బాగా పొంగిన తరవాత కిచెన్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి 
►పల్లీలు, కిస్‌మిస్, జీడి పప్పులను కూడా ఇదే విధంగా వేయించి పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి
►వేయించిన పదార్థాలను ఒక పాత్రలోకి తీసుకుని, ఉప్పు, పంచదార పొడి, మిరప కారం, పచ్చి మిర్చి తరుగు జత చేసి స్పూను సహాయంతో బాగా కలపాలి
►కొద్దిగా చల్లారాక సర్వ్‌ చేయాలి.

సాబుదానా భేల్‌
కావలసినవి: సగ్గుబియ్యం – అర కప్పు; బంగాళ దుంప – 1; మిరప కారం – చిటికెడు; వేయించిన పల్లీలు – ఒక టేబుల్‌ స్పూను; వేయించిన జీడి పప్పులు – ఒక టేబుల్‌ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్‌ స్పూను; చాట్‌ మసాలా – అర టీ స్పూను; నెయ్యి – 2 టీ స్పూన్లు; నిమ్మ రసం – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత.

తయారీ:
►సగ్గు బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ’ తగినన్ని నీళ్లు జత చేసి ఒక రాత్రంతా నానబెట్టాలి
►బంగాళ దుంప తొక్క తీసి, పెద్ద పెద్ద ముక్కలుగా చేయాలి
►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, బంగాళ దుంప ముక్కలు వేసి, దోరగా వేయించి తీసేయాలి
►ముక్కలు చల్లారాక సన్నగా తురమాలి
►స్టౌ మీద బాణలిలో రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి కాగాక సగ్గు బియ్యం వేసి బాగా వేయించాలి
►సగ్గు బియ్యం బాగా ఉడికి, మెత్తబడ్డాక, బంగాళ దుంప తురుము, వేయించిన పల్లీలు, వేయించిన జీడి పప్పులు, కొత్తిమీర తరుగు, నిమ్మరసం, ఉప్పు, మిరప కారం, చాట్‌ మసాలా వేసి బాగా కలిపి దింపేయాలి
►కొద్దిగా కొత్తిమీరతో అలంకరించి అందించాలి.

సగ్గు బియ్యంతో ఆరోగ్యం
►సగ్గు బియ్యాన్ని కర్ర పెండలం నుంచి తీసిన పొడితో తయారుచేస్తారు
►సగ్గు బియ్యంతో రకరకాల వంటకాలు తయారుచేస్తారు
►కొన్ని ప్రాంతాలలో ఉపవాసం ఉన్న సమయంలో సగ్గుబియ్యం వంటకాలను మాత్రమే స్వీకరిస్తారు
►పేరులో బియ్యం అని ఉన్నప్పటికీ, ఇది బియ్యం జాతికి సంబంధించినది కాదు
►పాయసం, ఉప్మా, వడియాలు, వడలు, ఇడ్లీలు... ఇలా ఎన్నో రకాల వంటకాలు సగ్గు బియ్యం వల్ల రుచిగా ఉంటాయి
►ఇందులో కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగాను, ఫ్యాట్‌ తక్కువగా ఉంటాయి
►బరువు తగ్గాలనుకునేవారికి సగ్గు బియ్యం మంచి ఔషధం
►ఇందులో గంజి ఎక్కువగా ఉంటుంది
►జ్వరం, వాంతులు, అజీర్తి సమస్యలతో బాధపడేవారికి తక్షణ శక్తి కోసం సగ్గుజావను ఇస్తారు
►సగ్గుబియ్యం తినడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
►సగ్గు బియ్యంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి
►కండరాల పటుత్వానికి సగ్గుబియ్యం ఎంతగానో ఉపయోగపడతాయి
►ఇందులో క్యాల్షియం శాతం ఎక్కువే
►రక్తప్రసరణ సాఫీగా సాగేందుకు సగ్గు బియ్యం మంచి ఉపయోగకారి    కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఇందులో ఉంది
►గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది
►ప్రతిరోజూ సగ్గు బియ్యాన్ని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల రోజంతా శక్తిగా ఉండొచ్చు
►అజీర్ణ వ్యాధుల బారి నుంచి రక్షిస్తుంది
►వీటిలో ఫోలిక్‌ యాసిడ్, విటమిన్‌ బి పుష్కలంగా ఉంటాయి కాబట్టి, గర్భిణీలు నిత్యం సగ్గు బియ్యం తీసుకోవచ్చు
►ఇందులో ఉండే విటమిన్‌ కె కారణంగా మెదడు చురుకు అవుతుంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement