
పొగ మానండి... ప్రయోజనాలు పొందండి
యాంటీ టుబాకో డే స్పెషల్
పొగతాగే అలవాటు మానేసిన కొద్ది గంటల నుంచే దాని వల్ల కలిగే ప్రయోజనాలు ప్రారంభమవుతాయి. అవి ఇంచుమించుగా ఇలా...
⇒వారంలో... వాసనలు తెలియడం, నాలుకకు రుచులు తెలియడం మరింత పెరుగుతుంది.
⇒మూడు నెలల్లో ... ఊపిరితిత్తుల సామర్థ్యం 30 శాతం పెరుగుతుంది.
⇒ ఎనిమిది గంటల్లోనే... పొగతాగడం వదిలేసిన ఎనిమిది గంటల్లోనే వారి శరీరంలోని కార్బన్ మోనాక్సైడ్ పాళ్లు గణనీయంగా తగ్గిపోతాయి.
⇒ఏడాదిలో... జేబుకు కత్తెర పడటం ఆగుతుంది. సంవత్సర కాలంలోనే అతడికి దాదాపు రూ. 50,000 వరకు ఆదా అవుతుంది.
⇒ ఐదు రోజుల్లో... ఒంటిలోని నికోటిన్ తగ్గి శరీరం పరిశుభ్రం అవుతుంది.
⇒పన్నెండు నెలల్లో... గుండె జబ్బులు వచ్చే ముప్పు చాలావరకు తగ్గిపోతుంది.
⇒పన్నెండు వారాల్లో ... ఊపిరితిత్తులు తమను తమంతట తామే పరిశుభ్రం చేసుకుంటాయి.
⇒ఐదేళ్లలో... స్ట్రోక్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి.
డాక్టర్ ఎస్.ఏ. రఫీ
కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
సిగరెట్‌లో ఎన్నెన్ని విషాలో...!
⇒బ్యాటరీలో ఉండే క్యాడ్మియం అనే హానికర పదార్ధం
⇒కొవ్వొత్తిలోని వ్యాక్స్
⇒పారిశ్రామిక వ్యర్థాల్లోని టాల్విన్ అనే విషపదార్థం
⇒క్రిమిసంహారక మందుల్లో ఉండే విషం
⇒టాయిలెట్ క్లీనర్స్‌లో ఉండే రసాయనాలు
⇒వంటగ్యాస్ లేదా లైటర్స్‌లో ఉండే మండే పదార్ధమైన బ్యూటేన్
⇒కుళ్లే పదార్ధాలలాంటి దుర్వాసననే వెలువరించే మిథేన్ వాయువు
⇒ఆర్సినిక్ విషం
⇒కార్బన్ మోనాక్సైడ్
⇒ఇంధనాల్లో ఉండే వ్యర్థాలు
ఆల్కహాల్ అలవాటు, ఆత్మహత్యలు, ఎయిడ్స్, నిషేధిత మాదకద్రవ్యాలు (డ్రగ్స్) వల్ల సంభవించే మరణాలకంటే పొగతాగే అలవాటు వల్ల కలిగే మరణాలు చాలా ఎక్కువ. పొగ తాగడం వల్ల గుండె, ఊపిరితిత్తులపై దుష్ర్పభావం పడుతుంది. ఈ దురలవాటు వల్ల ఊపిరితిత్తులకు సీఓపీడీ (క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్), లంగ్ క్యాన్సర్ వంటి వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ లాంటి క్యాన్సర్లు వస్తే... ఒక వ్యక్తి జీవితాంతం సంపాదించే సంపాదన కంటే జబ్బుకు గురైతే తన వ్యాధులను నయం చేసుకునేందుకు అతడు చేయాల్సిన ఖర్చు అనేక రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే పొగతాగే అలవాటును తక్షణం మానేయడం మేలు.