
వయసులో చిన్న... సామాజిక సేవలో మిన్న!
సాధారణంగా టీనేజర్లకు ఫ్రెండ్స్‌తో గడపడం, వీడియో గేమ్స్ ఆడుకోవడమే వినోదం...ఇంటర్నెట్ సర్ఫ్ చేయడం, సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్లలో ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేస్తూ గడిపేయడం సరదా... అలాంటి వినోదాలు, సరదాలకే ప్రాధాన్యం ఉండే టీనేజ్‌లో తన ప్రత్యేకమైన దృక్పథంతో గుర్తింపు తెచ్చుకొన్నాడు హర్మూర్ గిల్ (16). కెనడాలోని టొరంటోలో ఉండే ఈ ఎన్‌ఆర్‌ఐ కుర్రాడు ప్రపంచంలోనే ప్రముఖ సామాజిక సేవకుడిగా పేరు సంపాదించాడు. తన వయసుకు మించిన స్థాయిలో సామాజిక సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకొని ఔరా.. అనిపించుకొంటున్నాడు.
గిల్ అందంగా రాయగలడు, తన మాటతో భావాన్ని బలంగా చెప్పగలడు... దీంతో అనేక పత్రికల్లో ఇతడి రచనలు అచ్చు అవుతున్నాయి. అనేక మందికి స్ఫూర్తిని పంచుతున్నాయి.
హైస్కూల్‌లో చదువు పూర్తి చేసుకొన్న ప్రతి విద్యార్థీ కనీసం 40 గంటల పాటు సామాజిక సేవలో పాలుపంచుకొని ఉండాలనేది కెనడాలో ఉన్న నియమం. పాఠశాల సమయం అయిపోయాక విద్యార్థులు ఏదో విధమైన సేవాకార్యక్రమంలో పాల్గొనాలి. స్వచ్ఛంద సేవా సంస్థలతోనో, ప్రభుత్వ సేవా సంస్థలతోనో కలిసి పనిచేసిన అనుభవం సంపాదించి ఉండాలి. అక్కడ చాలా మంది విద్యార్థులు ఈ నియమం విషయంలో తెగ ఇబ్బందిపడుతూ ఉంటారు. ఏదో ‘మమ’ అనిపిస్తూ ఉంటారు. అయితే ఈ విషయంలో గిల్ మాత్రం చాలా ప్రత్యేకమైన విద్యార్థిగా నిలిచాడు.
ఇతడు 13 యేళ్ల వయసుకే దాదాపు వెయ్యిగంటల పాటు సోషల్‌వర్క్ పూర్తి చేశాడు! అనేక స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేశాడు. అనేక సామాజిక సమస్యలపై పోరాడాడు. లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించాడు. ఒకవైపు హైస్కూల్ చదువును పూర్తి చేస్తూ ఉత్తమ విద్యార్థిగా, మరోవైపు సోషల్‌వర్క్‌లో ఉత్తమ వలంటీర్‌గా గుర్తింపు తెచ్చుకొన్నాడు.
పసిప్రాయంలోనే మొదలు...
మూడవ ఏటే గిల్ దానధర్మాలు ప్రారంభించాడట. తల్లిదండ్రులు ఇతడి చేత చాక్లెట్‌లను అమ్మించి ఆ సొమ్మును చారిటీ కోసం వినియోగించారు. అలా గిల్ పసివాడిగా ఉన్నప్పుడే ప్రారంభమైన సేవా దృక్పథం అతడితో పాటు పెరిగి పెద్దది అయ్యింది. స్కూల్ నుంచి రాగానే వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల వారిని కలవడం, వారితో వివిధ అంశాల గురించి చర్చించి బాధ్యతల్లో పాలుపంచుకోవడం.. ఇదే అతడి దినచర్యగా మారింది.
ఏం చేస్తాడంటే...
పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడుతున్న, అనాథల, అభాగ్యుల సంక్షేమం కోసం పాటుపడుతున్న వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి గిల్ పనిచేస్తున్నాడు. అవసరమైతే శారీరకంగా కష్టించి పనిచేయడం, ప్రజల్లో వివిధ అంశాల గురించి అవగాహన నింపడానికి ప్రయత్నించడం, డొనేషన్ల కోసం నిర్వహించే కార్యక్రమాల్లో విదూషకుడిగా మారి వినోదాన్ని అందించడం - ఇలా తనకు చేతనైన స్థాయిలో ఏదో ఒక రూపంలో శ్రమను ధారపోస్తాడు గిల్.
అక్షరమే ఆయుధం
గిల్ అందంగా రాయగలడు, తన మాటతో భావాన్ని బలంగా చెప్పగలడు... దీంతో అనేక పత్రికల్లో ఇతడి రచనలు అచ్చు అవుతున్నాయి. అనేక మందికి స్ఫూర్తిని పంచుతున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియా ఎంపైర్ మ్యాగజైన్, ప్రవాసీ టుడే మ్యాగజైన్ తదిరత భారతీయ పత్రికలకు కూడా కాలమిస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు.
యువతకు ఆదర్శం
గిల్‌ను యువతకు ఆదర్శ ప్రాయుడిగా అభివర్ణిస్తున్నాయి అక్కడి స్వచ్ఛంద సంస్థలు. అనేక అవార్డులతో అతడిని సత్కరిస్తున్నాయి. వలంటీర్ రికగ్నైజేషన్ అవార్డు, యూత్ రికగ్నైజేషన్ అవార్డు, హల్టన్ ఎన్విరాన్‌మెంటల్ అవార్డు అందులో ప్రముఖమైనవి. కెనడియన్ జాతీయ పత్రిక ఒకటి ఎంపిక చేసిన ‘15 అండర్ 15’ జాబితాలో కూడా స్థానం సంపాదించాడు గిల్.