తెల్లదనమా? వద్దనే వద్దు!
బ్యూటిప్స్
నలభై ఏళ్లు దాటిన తర్వాత జుట్టు తెల్లబడడం సహజంగా వచ్చే మార్పే కాని, ఈ జనరేషన్‌లో పదేళ్లకే తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయి. సమస్య స్పష్టంగా అద్దంలో కనిపించిన తర్వాత ట్రీట్‌మెంట్ తీసుకోవడం కంటే ముందుగా జాగ్రత్తపడితే మంచిది కదా! రెండు వందల మిల్లీలీటర్ల కొబ్బరి నూనెలో ఒక టీ స్పూను కర్పూరం పొడిని కలిపి ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు తలకు పట్టించి ఐదు నిమిషాల సేపు మసాజ్ చేసుకోవాలి.తలస్నానానికి కుంకుడుకాయ, శీకాయవంటి సహజమైన షాంపూలనే వాడాలి. తలస్నానానికి ముందు పది నిమిషాల సేపు తలకు వేడినీటిలో ముంచిన టవల్‌ను చుడితే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
తలస్నానం పూర్తయిన తరువాత మెల్లిగా చేతివేళ్ల కొసలతో తలని మసాజ్ చేయడం వల్ల సెబాసియస్ గ్రంథులు ఉత్తేజితం కావడంతోపాటు బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. రోజూ నూనె పెట్టడం సాధ్యం కానప్పుడు వారానికి కనీసం రెండుసార్లయినా ఆముదం లేదా కొబ్బరి నూనెను గోరువెచ్చగా చేసి తలకు పట్టించి మసాజ్ చేయాలి. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల కలిగే మేలు శరీరానికి మాత్రమే కాదు కేశాలకు కూడ. వ్యాయామం మనసుకు ప్రశాంతత నిస్తు్తంది. కొబ్బరినూనెలో నిమ్మరసం కలుపుకొని ప్రతి రోజూ తలకు పట్టిస్తుంటే చుండ్రు సమస్య తగ్గడంతోపాటు కేశాలు నల్లబడతాయి. వీటితోపాటుగా చిన్న వయసులో జుట్టు తెల్లబడడాన్ని నివారించాలంటే కాఫీ, టీ, మసాలాలు తగ్గించాలి వీలయితే పూర్తిగా మానేయాలి.