
రక్తహీనతను తగ్గించే ఖర్జూరాలు
గుడ్‌ఫుడ్
ఖర్జూరాల్లో అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలోని స్వాభావికమైన చక్కెరలైన గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌లకు తక్షణం శక్తిని అందజేసే గుణం ఉంది. ఖర్జూరాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని... ఖర్జూరాలు కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గిస్తాయి. అందువల్ల గుండెకు మేలు చేస్తాయి, స్థూలకాయాన్ని నివారిస్తాయి. పొటాషియమ్ పుష్కలంగా ఉన్నందున పక్షవాతం వంటి జబ్బులను నివారిస్తాయి.
వీటిల్లో విటమిన్ బి1, బి2, బి3, బి5, విటమిన్– ఏ, విటమిన్–సి పుష్కలంగా లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తింటే విటమిన్ సప్లిమెంట్స్ అవసరం రాదనడం అతిశయోక్తి కాదు. సెలేనియమ్, మ్యాంగనీస్, కాపర్, మెగ్నీషియమ్ పుష్కలంగా ఉన్నందున ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. దంతాలను సంరక్షిస్తాయి. ఖర్జూరాల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత తగ్గుతుంది. ఇవి జీర్ణశక్తితో పాటు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. అంతే కాదు... మలబద్దకాన్ని కూడా నివారిస్తాయి.