ప్రతీకాత్మక చిత్రం
రిలేషన్‌షిప్‌లో అన్నీ అనుకున్నట్టే జరగవు. పరిస్థితులు సరిగా లేనవుడు సంయమనం కోల్పోవడం వల్ల రిలేషన్‌షిప్ కొన్ని సార్లు బ్రేకప్ అవుతుంది. అతడు/ఆమె మీకు సరైన జోడీనే అయినప్పటికీ చిన్న కారణాలకే మీరు బ్రేకప్ అయి ఉంటే కింది విషయాలు మీరు లోతుగా ఆలోచించుకొని బంధాన్ని తిరిగి నిర్మించుకోవడానికి ఉపయోగపడతాయి.
మీ సమస్యకు పరిష్కారం లేదా ?
మీరు విడిపోవడానికి అసలు బలమైన కారణం ఉందా? లేక భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేక జరిగిన గొడవ వల్ల విడిపోయారా? రిలేషన్‌షిప్‌లోని ప్రతీ సమస్యను ఏదో ఒక విధంగా పరిష్కరించవచ్చు. విడిపోవడం వల్ల మాత్రమే సమస్య పరిష్కారమవుతుందా అనే ప్రశ్నను వేసుకొని లోతుగా పరిశీలించుకోవాలి. సెన్సిటివ్ విషయాలను సరిగా డీల్ చేయడం నేర్చుకుంటే చాలా వరకు రిలేషన్‌షిప్‌ను కాపాడుకోవచ్చు.
నిజంగా అతడు/ఆమె మీద కోపమేనా?
కొన్నిసార్లు ఎవరి మీదనో ఉన్న కోపాన్ని మీ పార్టనర్ మీద చూపించి ఉంటారు. ఉదాహరణకు ఆఫీస్‌లో బాస్ మిమ్మల్ని తిడితే, మీరు అతన్ని ఏమీ అనలేక ఇంటికెళ్లాక మీ పార్టనర్ మీద చూపించి ఉండవచ్చు. లోతుగా పరిశీలించుకుంటే తప్ప ఆ విషయం మీకు తెలియకపోవచ్చు.
అతడు/ఆమె మీకు కరెక్టేనా ?
కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వల్ల ఇద్దరి మధ్య సరైన కమ్యూనికేషన్ లేనపుడు ఇద్దరిలో ఎవరో ఒకరికి తమను పట్టించుకోవడం లేదనిపించడం సహజం. అలాంటి సమయంలో ఒకటికి రెండు సార్లు పరిస్థితిని క్షుణ్ణంగా వివరించడం ఉత్తమం. మీ పార్ట్‌నర్‌ను అడగకుండా మీకై మీరే ఓ అభిప్రాయానికి రావడం సరైనది కాదు. ఇద్దరూ ఒకరికి ఒకరు నమ్మకంగా ఉన్నంత కాలం విడిపోవడమనేది సరైన నిర్ణయం అనిపించుకోదు.
ఇంకా ప్రేమిస్తున్నారేమో..!
ఏదైనా కారణం వల్ల మీరు విడిపోయినప్పటికీ మీ పార్ట్‌నర్ మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తూ ఉండొచ్చు. గతంలో మీరు మెలిగిన తీరును బట్టి మీరు చేసిన తప్పును మన్నించి రెండో అవకాశం ఇవ్వడానికి ఎదురుచూస్తూ ఉండవచ్చు. గొడవ జరిగి విడిపోయినప్పటికీ కొంత కాలానికి తిరిగి మిమ్మల్ని కోరుకుంటూ ఉండవచ్చు. కాబట్టి ఒకసారి మీ పార్ట్‌నర్‌తో మాట్లాడటానికి ప్రయత్నించండి.
గతం గుర్తొస్తుందా..?
మీరు గతంలో సంతోషంగా గడిపిన క్షణాలు మీకు చాలా సార్లు గుర్తొస్తూ ఉండవచ్చు. మీరు విడిపోయిన క్షణం చాలా బలహీనమైనదని, ఆ నిర్ణయం తీసుకున్నందుకు మీరు బాధపడుతున్నట్లయితే మీరు ఇంకా మీ పార్టనర్ పట్ల ప్రేమను కలిగివున్నారనే అర్థం.
మరిక ఆలస్యం దేనికి.. వెంటనే మీ పార్టనర్‌కి కాల్ చేసేయండి. కాల్ చేసే ధైర్యం లేకపోతే మెసెజ్ చేయండి. ఫేస్‌బుక్, వాట్సాప్ లాంటివి ఇందుకే ఉన్నాయి మరి...
Comments
Please login to add a commentAdd a comment