
మా బుజ్జిగాడే నా సైన్యం!
మా దైవసమానుడి దైన్యం..
పొగడ్తలతో ముంచేసి అగడ్తల్లోకి దించేయడం ఈ పురుషపుంగవులు ఎప్పుడూ చేసే పనే. అవ్వాళ్ల ఒళ్లునొప్పులూ, జ్వరం అంటూ ఆఫీసుకు లీవు పెట్టారాయన. ‘‘నీలో లక్ష్మీకళ పూర్తిగా తాండవిస్తోందోయ్. అబ్బ... జ్వరం, ఒళ్లునొప్పులూ తెగ బాధిస్తున్నాయ్! నేను విష్ణుమూర్తిని కాకపోయినా.. లక్ష్మీదేవిలాంటి నీ భర్తనే కదా. కాబట్టి నొప్పులు తగ్గడానికి వైద్యంగా, కాసేపు కాళ్లు నొక్కవోయ్’’ అంటూ రిక్వెస్ట్ చేశారు.
బాధ పడే వ్యక్తికి అవసరమైన చికిత్సగా కాసేపు కాళ్లు పట్టాను. అంతే... ఆ సిచ్యువేషన్‌ను అడ్వాంటేజీగా తీసుకొని వెంటనే ఆయన ఓ సైడుకు తిరిగిపోతూ... ‘‘ఇప్పుడు అచ్చం నేను విష్ణుమూర్తిలా లేనూ’’ అంటూ ముసిముసిగా నవ్వుతూ మా బుజ్జిగాడితో, నాతో ఏకకాలంలో పరాచికాలు మొదలుపెట్టారు.
సెటైర్లు వేయడంలో ఇప్పుడిప్పుడే మా బుజ్జిగాడూ నాలా తయారవుతున్నాడు. ‘‘అవున్నాన్నా... అలంకార్ సెంటర్ దగ్గర పాములు ఆడించేవాడు ఉంటాడు చూశావా? వాణ్ణి రిక్వెస్ట్ చేసి కాసేపు నాగుపామును అద్దెకు తెచ్చి మీ హెడ్డు కవర్ అయ్యేలా సరిగ్గా మీ తల దగ్గర దాన్ని వదులుతా. దాంతో ప్రస్తుతం మీరు పోషిస్తున్న పాత్రకు నిండుదనం వస్తుంది’’ అన్నాడు. అంతే! ఆ మాటల్లోని మర్మం అర్థమై... ఒళ్లు నొప్పుల మాట మరచిపోయి సెలవు క్యాన్సిల్ చేసుకుని మరీ ఆఫీసుకు బయల్దేరారాయన.
మరోరోజు మసాలా వంకాయ ఫ్రై చాలా బాగా కుదిరింది. ముగ్గురం తినడానికి సరిపోయినంత వండినా... ఆరోజు ఆయన నాలుకకు అది బాగా రుచిగా అనిపించడంతో ముందువెనకా చూసుకోకుండా మొత్తం తినేశారు. అందుకు మాకేమీ బాధ లేదు గానీ... తను చేసిన పనిని కప్పిపుచ్చుకోడానికో, తన గిల్టీ ఫీలింగ్‌ను కవర్ చేసుకోడానికో మళ్లీ ఓ డైలాగ్ వదిలారాయన. ‘‘ఒరేయ్... మీ అమ్మ సాక్షాత్తూ పార్వతీ మాతరా. అంటే నాలో సగం అన్నమాట. కాబట్టి నేను తిన్నదాంట్లో సగం ఆటోమేటిగ్గా ఆమెకే అంకితమవుతుంది కదరా. అందుకే అమ్మకు కూర మిగల్లేదని బాధపడకు’’ అంటూ ఓదార్చబోయారు. ఆ మాటతో మళ్లీ మా బుజ్జిగాడికి ఒళ్లు మండిపోయింది.
‘‘అవున్నాన్నా. నేను చెప్పానుగా... అలంకార్ సెంటర్‌లో పాములాడించే వాడు ఉంటాడని. ఈసారి పామును తెచ్చి నీ తల దగ్గర కాకుండా, నీ మెడకు చుడదాం’’ అన్నాడు వాడు కసిగా. ‘‘చూశావోయ్... నీ పెంపకంలో వీడు పూర్తిగా అమ్మ కూచి అయిపోయాడు. ఎప్పుడూ నీ పార్టీనే. ఇవ్వాళ్ల అన్నీ నీ తరఫున మాట్లాడుతున్నాడని సంతోషపడుతున్నావేమో? ఇలాంటి వాళ్లే రేపు పెళ్లాల చేత మరపు మందు అడిగి మరీ పెట్టించుకుని, వాళ్ల భార్యలకు సపోర్టు చేస్తూ ఉంటారు. రేపు వాడి పెళ్లాం వచ్చాక వాడు ఆమెనే సమర్థిస్తుంటే అప్పుడు తెలుస్తుంది నీకు... ప్రస్తుతం నేను పడుతున్న బాధ’’ అన్నారు ఆయన ఉక్రోషంగా.
అప్పుడు అన్నాన్నేను ఒక మాట... ‘‘పోన్లెండి, ఇప్పుడు నేను అనుభవించే బాధలేవీ వాడి పెళ్లాం పడదన్నమాట. ఆ ఊహే నాకు ఆనందంగా ఉంది. అలా ప్రవర్తించే మన బుజ్జిగాడి మంచితనాన్ని పదికాలాల పాటు పదిలంగా కాపాడుకోవాలన్న తన స్వార్థంతోనైనా తను మన అబ్బాయిని బాగా చూసుకుంటుంది. ఈ ఆలోచనే నన్నెంతగానో సంతోషపెడుతోంది’’ అన్నాను. అంతే... ‘హు’ అంటూ తన అసహనాన్ని ప్రకటిస్తూ, పెండింగ్ వర్క్ అనే సాకుతో వెంటనే బయల్దేరారు మరోమారు ఆఫీసుకు!
- వై!