ఈయన్ని చూడండి. ఎక్కడా చూసినట్లు అనిపించదు. పేరు వినండి. పాల్ గ్యాస్కోయినే. ఎక్కడా విన్నట్లూ అనిపించదు. మరి ఈయన సంగతి ఎందుకు? ఎందుకంటే మన దగ్గరా అప్పుడప్పుడు ఇలాంటి వాళ్లు కనిపిస్తుంటారు. ‘తాడి చెట్టు ఎందుకు ఎక్కావ్ అంటే.. దూడ గడ్డి కోసం’ అన్నట్లు.. ఏదో చెబుతుంటారు. ఈయనా అలాగే చెప్పాడు. ‘ఆమెను ముద్దెందుకు పెట్టుకున్నావ్’ అని కోర్టువారు అడిగితే.. ‘ఆమెలో కాన్ఫిడెన్స్ లెవల్స్ పెంచడానికి ’ అన్నాడు! పాల్ గ్యాస్కోయినే వయసు 52. ఒకప్పటి ఫుట్‌బాలర్. పేరున్నాయనే. గత ఏడాది ఆగస్టులో రద్దీగా ఉన్న రైలు బోగీలో ప్రయాణిస్తూ చప్పున ఒక యువతికి ముద్దే పెట్టేశాడు. పెట్టింది అక్కడా ఇక్కడా కాదు. పెదవుల మీద! ఛీ కొట్టేసి, రైలు దిగి వెళ్లిపోయాక ఆమె ఆయనపై కేసు పెట్టింది.
ఆ కేసు నడుస్తూ, నడుస్తూ ఇన్నాళ్లకు పాల్‌కు తన వాదనను వినిపించుకునే అవకాశం వచ్చింది.‘‘ఆ టైమ్‌లో నేను తాగి ఉన్న మాట వాస్తవమే కానీ, తాగి ఉన్న కారణంగా నేను ఆమెను ముద్దుపెట్టుకోలేదు. అక్కడ ఉన్న వాళ్లలో కొందరు ఆమె వైపు చూస్తూ.. ఆమె లావుగా ఉందనీ, అసహ్యంగా ఉందనీ కామెంట్ చేస్తున్నారు. ఆ కామెంట్స్‌కి ఆమె నొచ్చుకోవడం, మనసు కష్టపెట్టుకోవడం నేను కళ్లారా చూశాను. వెంటనే ఆమె దగ్గరకి వెళ్లి.. ‘‘విను. నువ్వు లావుగా లేవు. అంతేకాదు, నువ్వు చాలా అందంగా ఉన్నావు’’ అని.. ఆమెను నమ్మించడం కోసం ఆమె పెదవులపై ముద్దు పెట్టుకున్నాను. ఆమెలో కాన్ఫిడెన్స్ పెంచడానికే నేను ఆమెను కిస్ చేశాను తప్ప నాలో ఏ చెడు ఆలోచనా లేదు మిలార్డ్..’’ అని చెప్పాడు పాల్. అందుకు కోర్టువారేం తీర్పు చెప్పారో గురువారం కానీ తెలీదు.
Comments
Please login to add a commentAdd a comment