సీన్ మాది – టైటిల్ మీది
ఈతరం ప్రేమకథలను అందంగా తెరకెక్కించగలడన్న పేరున్న స్టార్ డైరెక్టర్ తీసిన సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. హీరో, హీరోయిన్లకు టాలీవుడ్‌లో హాట్ కపుల్ అన్న పేరుంది. ఈ సన్నివేశాలున్న
ఆ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం?
కార్తీక్ జెస్సీని చూడడం అదే మొదటిసారి. కార్తీక్ ఫ్యామిలీ జెస్సీ వాళ్ల ఇంట్లోకి అద్దెకు దిగిన రోజది. ఆమెను చూడడమే ఎవరో ‘స్టాప్’ అంటే ఆగిపోయినట్టు చూస్తూ ఉండిపోయాడు. బయటకెళ్లేప్పుడు, ఇంట్లోకి వచ్చేప్పుడు, వీధిలో నిలబడి, జెస్సీ ఆఫీసుకు వెళ్లే టైమ్‌లో రోడ్‌పై బండి మీద కూర్చొని.. ఎక్కడెక్కడ జెస్సీ కనబడే అవకాశం ఉందో అన్ని చోట్లా ఆమెను చూడడం కోసం తిరగడమే పనిగా పెట్టుకున్నాడు కార్తీక్. సడెన్‌గా ఒకరోజు. కార్తీక్ ఇంట్లో జెస్సీ. అతడి చెల్లెలు అనుతో మాట్లాడుతూ కనిపించింది. క్యాజువల్‌గా వెళ్లి వాళ్ల ముందు నిల్చున్నాడు. అను అతడ్ని జెస్సీకి పరిచయం చేసింది.
‘‘హేయ్! రా! దిస్ ఈజ్ జెస్సీ. జెస్సీ.. మా అన్నయ్య. మీరిద్దరూ ఇంతవరకు మీట్ అవ్వలేదు కదా!’’ జెస్సీకి కార్తీక్‌ను పరిచయం చేస్తూ అడిగింది అను. ‘‘హాయ్! కార్తీక్!’’ తనను తాను పరిచయం చేసుకున్నాడు కార్తీక్. జెస్సీని పలకరించిన ఆనందం అతడి కళ్లల్లో చూడొచ్చు. ‘‘తెలుసు! మీ ఇంట్లో అందరూ అన్నిటికీ పిలుస్తూనే ఉంటారు కదా రోజంతా.. కార్తీక్.. కార్తీక్.. కార్తీక్.. పైకి వినిపిస్తుంది.’’ నవ్వుతూ జెస్సీ.‘‘సో అంటే.. నేను ఇంట్లో పని పాట లేకుండా కూర్చున్నానని మీకూ తెలిసిపోయిందంటారా?!’’ అడిగాడు కార్తీక్. జెస్సీతో మాట్లాడుతున్న ఆనందం అతడిలో ఏమాత్రం తగ్గలేదు. ‘‘నేను అలా అన్లా!’’ సర్దిచెప్పుతూ జెస్సీ.
‘‘మీరు మలయాళి కదా! తెలుగు బాగానే మాట్లాడుతున్నారు?’’ కార్తీక్. ‘‘అవును. కానీ మలయాళం కన్నా తెలుగు బాగా వచ్చు నాకు’’‘‘అవునా! ఎప్పట్నుంచి ఉంటున్నారిక్కడ?’’‘‘పుట్టినప్పట్నుంచీ..’’వారి మాటలలా సాగిపోతూనే ఉన్నాయి. కార్తీక్ అడిగేవన్నీ జెస్సీ చెప్తూ పోతోంది. వీరిద్దరి మాటల మధ్య అను ఒక మూడో మనిషి మాత్రమే! ఆ మూడో మనిషి మాట కూడా కార్తీక్‌కు డిస్టర్బెన్స్‌గా కనిపిస్తోంది. అంతలా జెస్సీకి దగ్గరవ్వాలన్నంత కోరిక పుట్టింది అతడికి. వీరి మాటల మధ్యలో కల్పించుకొని కావాలనే, అను.. ‘‘కార్తీక్! ఇంక బయలుదేరతావా!’’ అని మెల్లిగానే అడిగింది.
కార్తీక్‌కు అక్కణ్నుంచి వెళ్లిపోవాలన్న ఆలోచనే లేదు. కానీ తప్పదు. వెళ్లిపోయాడు. మధ్యలో జెస్సీ, అను మాట్లాడుకుంటున్నప్పుడల్లా రూమ్‌లోకి ఏదో పనున్నట్లు వస్తూ, జెస్సీని చూస్తూ పోతున్నాడు కార్తీక్. అప్పటికే జెస్సీకి కార్తీక్ పడిపోయాడు. కార్తీక్‌కు ఇప్పుడు కెరీర్ గోల్ ఎంత ముఖ్యమో, జెస్సీ కూడా అంతే! జెస్సీ ఎక్కడ పనిచేస్తుందో కనుక్కున్నాడు. ఆమెను చూడడం కోసం చుట్టుపక్కలే తిరుగుతున్నాడు. అలా తిరుగుతుండగానే ఒకసారి ఆమె ఆఫీస్‌కు పక్కన్నే ఉన్న ఫుడ్‌కోర్ట్‌లో కార్తీక్ కనిపించాడు. ‘ఇతనేంటి ఇక్కడ?’ అని చూస్తూ, అతడికి దగ్గరగా కదిలింది.
‘‘హాయ్!’’ అన్నాడు కార్తీక్. ‘‘హలో!’’ అంది జెస్సీ.ఫుడ్ ఆర్డర్ చేసేందుకు క్యూలో నిలబడింది జెస్సీ. ఆమెకు పక్కనే వెళ్లి నిల్చున్నాడు కార్తీక్.అతణ్ని కొద్దిసేపు అలాగే చూస్తూ.. ‘‘నువ్ నన్ను.. ఫాలో చేయట్లేదు కదా?’’ అడిగింది జెస్సీ. దానికి నవ్వుతూ.. ‘‘హూ.. మీరు నన్ను ఫాలో చేయట్లేదు కదా?’’ అన్నాడు కార్తీక్. ‘‘హ్మ్.. మా ఆఫీస్ ఇక్కడే ఉంది. ఐ వర్క్ హియర్!’’ ‘‘కబాబ్స్ కూడా ఇక్కడే ఉంటుంది. అందుకే వచ్చా. నాకు బాగా ఇష్టం.’’ కార్తీక్ నవ్వుతూ చెప్పాడు. ఇద్దరూ నవ్వుకున్నారు. నవ్వుతూనే ఇంకొన్ని మాటలు పంచుకున్నారు. ‘బై’ చెప్పి ఫ్రెండ్స్‌తో వెళ్లిపోయింది జెస్సీ.
కార్తీక్ జెస్సీకి పూర్తిగా పడిపోయాడు. మరో రోజు. జెస్సీ రెడీ అయి ఆఫీస్‌కు వెళుతోంది. ఆమె కోసమే కింద తనింట్లో ఎదురుచూస్తూ నిల్చున్న కార్తీక్ కూడా ఆమెను చూడ్డమే వెంట నడిచాడు.‘‘హాయ్! ఆఫీస్‌కా?’’ అడిగాడు.‘‘కాదు. క్రికెట్ ఆడటానికి! వస్తావా?’’ విసురుకుంటూ సమాధానమిచ్చింది జెస్సీ.కార్తీక్ ఏం మాట్లాడలేదు. జెస్సీ సమాధానం అలా ఉంది.ఏదో అనాలనుకుంటున్నాడు. అనలేకపోతున్నాడు. నడుస్తున్నాడు. జెస్సీని చూస్తున్నాడు. జెస్సీ మాత్రం తమను ఎవరన్నా చూస్తున్నారా అన్న భయంతో వెనక్కి తిరిగి తిరిగి చూస్తోంది.
అది గమనించిన కార్తీక్, అడిగేశాడు వెంటనే.. ‘‘ఏంటలా వెనక్కి తిరిగి చూస్తున్నారు?’’ అని.‘‘నీతో మాట్లాడడం మా నాన్న చూస్తే చంపేస్తారు.’’ జెస్సీ మాటలకు కార్తీక్ ఏం మాట్లాడలేదు. ‘‘నీ వయసెంత?’’ జెస్సీనే మళ్లీ.‘‘ట్వంటీ టూ..’’‘‘నాకు ట్వంటీ ఫోర్. పర్లేదు.. నాన్నడిగితే నాకు తమ్ముడి లాంటివాడివని చెప్పేస్తా!’’ అంది. కార్తీక్ కాసేపు అక్కడే నిలబడిపోయాడు. మళ్లీ తేరుకొని, ‘‘ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఇక నుంచి నాకు సిస్టర్సే! ఒక్క నువ్వు తప్ప’’ అన్నాడు. ‘‘ఎందుకలా?’’ అడిగింది.‘‘బికాజ్ ఆమ్ ఇన్ లవ్ విత్ యూ జెస్సీ.’
Comments
Please login to add a commentAdd a comment