
కాసేపటి తర్వాత ఇద్దరు మిత్రులూ మళ్లీ మౌనంగా నడక సాగించారు. దారిలో ఓ చోట ఓ నీటి గుంట కనిపించింది. ఇద్దరూ కలిసి ఆ నీటిగుంటలోని నీటిని తాగేందుకు గుంటలోకి దిగారు.
ఇద్దరు మిత్రులు ఒక ఎడారిలో నడుచుకుంటూ వెళుతున్నారు. ఉన్నట్టుండి వారి మధ్య ఓ విషయమై వాదన మొదలైంది. అది తారస్థాయికి చేరింది. కోపం తట్టుకోలేకపోయిన వ్యక్తి తటాలున తన మిత్రుడిపై చెయ్యి చేసుకున్నాడు. అయితే దెబ్బలు తిన్న వ్యక్తి ఏమాత్రం ఆవేశపడకుండా ఓ పక్కకు వెళ్లి దగ్గర్లోనే ఉన్న ఇసుక దిబ్బపై ప్రశాంతంగా కూర్చుని, అక్కడున్న ఓ పుల్లను తీసుకుని ఆ ఇసుకతిన్నెపై ఇలా రాశాడు. ‘‘ఈ రోజు నా ప్రాణస్నేహితుడు నన్ను బలంగా కొట్టాడు’’ అని! కొట్టిన మిత్రుడికి తన మిత్రుడి వైఖరి అర్థం కాలేదు. కాసేపటి తర్వాత ఇద్దరు మిత్రులూ మళ్లీ మౌనంగా నడక సాగించారు. దారిలో ఓ చోట ఓ నీటి గుంట కనిపించింది. అంతకు కొద్దిసేపటి క్రితం తమ ఇద్దరి మధ్య జరిగిన వివాదాన్ని వారు మరచిపోయారు. ఇద్దరూ కలిసి ఆ నీటిగుంటలోని నీటిని తాగేందుకు గుంటలోకి దిగారు. ఇంతలో మిత్రుడితో దెబ్బ తిన్న వ్యక్తికి తన కాలిని ఎవరో లాగుతున్నట్టు అనిపించింది. నిజానికి అది లాగడం కాదు, అతని కాలు బురదలో కూరుకుపోతోంది.
మిత్రుడి స్థితి గమనించిన రెండో వ్యక్తి అతనిని ఎలాగో కష్టపడి గుంటలోంచి పైకి చేర్చాడు. ప్రాణాలతో బయటపడ్డ ఆ మిత్రుడు అక్కడికి దగ్గర్లో ఉన్న ఓ రాతిమీద కూర్చొని, అక్కడే ఉన్న ఓ రాయి తీసుకుని దానితో తాను కూర్చున్న రాతిమీద ఓ పక్కగా ఇలా రాశాడు: ‘‘ఈరోజు నా మిత్రుడు నన్ను రక్షించాడు’’ అని.ఇది చూసిన మిత్రుడు ‘‘నేను నిన్ను కొట్టినప్పుడు ఇసుకలో రాశావు. ఇప్పుడేమో కాపాడితే రాతి మీద రాశావు! వీటి అర్థమేమిటీ’’ అని అడిగాడు. అప్పుడు ఆ మిత్రుడు ఇలా జవాబిచ్చాడు.‘‘ఎవరయినా మనల్ని గాయపరచినప్పుడు దానిని ఇసుకపై రాయాలి. అప్పుడు క్షమించడమనే గాలి దానిని చెరిపేస్తుంది. ఒకవేళ ఎవరైనా మంచో మేలో చేస్తే దానిని రాతి మీద రాయాలి. అది కాలాలను దాటి ఎప్పటికీ చెక్కుచెదరక ఉంటుంది’’ అని! జీవితంలో కూడా మరచిపోవలసిన బాధలను ఇసుక మీద రాసుకోవాలి. గుర్తుపెట్టుకోవలసిన సంతోషాలను రాతి మీద బలంగా రాసుకోవాలి. అప్పుడే జీవన మాధుర్యాన్ని అనుభవించగలం.
Comments
Please login to add a commentAdd a comment