విశ్వంలో భూములు ఎన్ని? | how many lands are thre in universe | Sakshi
Sakshi News home page

విశ్వంలో భూములు ఎన్ని?

Published Tue, Nov 11 2014 10:36 PM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM

విశ్వంలో భూములు ఎన్ని?

విశ్వంలో భూములు ఎన్ని?

పున్నమి వెన్నెల్లో, ఆరుబయట నింగికేసి చూస్తే... మిణుకు మిణుకుమంటూ కోటానుకోట్ల నక్షత్రాలు! ఓహ్... ఎంత అందమైన దృశ్యమది! మరి... ఆ నక్షత్రాలన్నింటి చుట్టూ మన సూర్యుడికి మల్లే గ్రహాలున్నాయా? ఒకవేళ ఉంటే.. వాటిల్లో మన భూమిని పోలినవి ఎన్ని? చిక్కు ప్రశ్నలేగానీ... శాస్త్రవేత్తలు ఇప్పుడిప్పుడే వీటికి సమాధానాలు తెలుసుకుంటున్నారు.
 
ఈ విశాల విశ్వంలో మనిషి, భూమి ఒంటరేనా? అన్న ప్రశ్న, సందేహం ఈనాటివి కాదు. యుగాలుగా అటు తత్వవేత్తలను, ఇటీవలి కాలంలో శాస్త్రవేత్తలను ఆలోచనల్లోకి పడేసినవే. కాకపోతే సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ అపోహలు తొలగిపోతున్నాయి. కొత్తకొత్త విషయాలు తెలుస్తున్నాయి. నిన్నమొన్నటివరకూ సౌరకుటుంబానికి ఆవల అసలు గ్రహాలే లేవన్న భావన నుంచి సుదూర ప్రాంతాల్లో, ఖగోళపు అంచుల్లోనూ గ్రహ వ్యవస్థలు ఉన్నట్లు రూఢి అవుతున్న కాలమిది.

ఈ నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ ఎక్సోప్లానెట్ల (సౌరకుటుంబానికి ఆవల ఉన్న గ్రహాలు) అన్వేషణే ప్రథమ లక్ష్యంగా కెప్లర్ పేరుతో ఓ అంతరిక్ష వేధశాల (అబ్జర్వేటరీ)ను ప్రయోగించింది. ఆకాశంలోని అతిచిన్న ప్రాంతంపై కన్నేసిన ఈ దుర్భిణి ఆశ్చర్యకరమైన ఫలితాలు అందించింది..

ఇంతకూ గ్రహాన్నెలా గుర్తిస్తారు?
గ్రహాల్లో అత్యధికం ప్రకాశవంతమైన నక్షత్రాల చుట్టూ తిరుగుతూంటాయని మనకు తెలుసు. ఈ క్రమంలో గ్రహం నక్షత్ర కాంతిని కొంతమేరకు అడ్డుకంటుంది. కాంతిలో వచ్చే ఈ అతిచిన్న మార్పును లెక్కించడం ద్వారా ఆయా నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాల సైజు, ఆకారం వంటివాటిని తెలుసుకోవచ్చు.
 
కెప్లెర్ చూసిందెంత?
2009 మార్చి ఏడవ తేదీని ప్రయోగించిన కెప్లెర్ వేధశాల సిగ్నస్ నక్షత్ర మండలం సమీపంలోని చిన్న ప్రాంతంపై తన దష్టిని కేంద్రీకరించింది. నాలుగేళ్ల సమయంలో దాదాపు 1,50,000 నక్షత్రాలు, వాటి పరిసరాలను పరిశీలించడం ద్వారా కెప్లెర్ కొన్ని వేల గ్రహాలను గుర్తించింది. భారీ సైజున్న గ్రహాల్లో జీవం ఉండే అవకాశం లేదు. కాబట్టి గురు, శని గ్రహాల సైజులో అంటే...  భూమి కంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ రెట్లు సైజున్న గ్రహాలను తొలగిస్తే మిగిలినవి...3558

అనువైన ప్రాంతంలో ఉన్నవెన్ని?
భూమి సైజులో ఉన్న గ్రహాలన్నింటిలో జీవం ఉంటుందా? ఊహూ అవకాశం లేదు. జీవం ఏర్పడేందుకు, వద్ధి చెందేందుకు అనుకూలమైన పరిస్థితులు కూడా ఉండాలి. మాత నక్షత్రానికి దగ్గరగా ఉంటే వేడి వాతావరణం ఎక్కువగా ఉంటుంది. మరీ దూరంగా ఉంటే గడ్డకట్టుకుపోయే చలీ ఉండవచ్చు. కాబట్టి నక్షత్రం నుంచి ‘తగినంత’ దూరంలో ఉన్న గ్రహాల్లోనే జీవం ఏర్పడేందుకు అవకాశాలుంటాయి. కెప్లెర్ గుర్తించిన గ్రహాల్లో ఈ అనుకూల ప్రాంతంలో ఉన్న వాటి సంఖ్య....
1696

భూమి లాంటివి ఉన్నాయా?
జీవం ఉండేందుకు అవకాశమున్న 1696 గ్రహాలను కెప్లెర్ గుర్తించింది కానీ... ఇది కూడా పూర్తిస్థాయి అంచనా కాదు. ఎందుకంటే కెప్లెర్‌కూ కొన్ని పరిమితులున్నాయి. టెలిస్కోపు చూడగలిగే ప్రాంతంలో నక్షత్రం ముందు నుంచి ప్రయాణించే గ్రహాలను మాత్రమే ఇది చూడగలదు. గ్రహాల కక్ష్యామార్గంలో చిన్నపాటి తేడా ఉన్నా టెలిస్కోపు కంటికి అవి అందకపోవచ్చు. నక్షత్రం దూరం పెరిగే కొద్దీ ఇలాంటి గ్రహాలు ఉండే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇలా సంకేతాలు అందని గ్రహాలనూ పరిగణలోకి తీసుకుంటే కెప్లెర్ దష్టిపెట్టిన ప్రాంతంలో మాత్రమే ఉండే భూమిలాంటి గ్రహాల సంఖ్య...22,500
 
పాలపుంత మొత్తాన్ని చూస్తే...
కెప్లెర్ ఆకాశంలో కేవలం 0.28 శాతం ప్రాంతాన్ని మాత్రమే పరిశీలించింది. దాదాపు మూడువేల కాంతి సంవత్సరాల దూరం వరకూ తొంగిచూసి అందించిన సమాచారాన్ని మిగిలిన ఆకాశానికి కూడా వర్తింపజేస్తే... లెక్కకు మించిన నక్షత్రాల చుట్టూ కోటానుకోట్ల భూమిలాంటి గ్రహాలు కోటానుకోట్లు ఉంటాయి. ఒక అంచనా ప్రకారం ఈ సంఖ్య...1500 - 3000 కోట్లు!
 
ఇష్టమైందే చూడండి...!
ఫేస్‌బుక్ ఓపెన్ చేయగానే వచ్చే న్యూస్‌ఫీడ్‌ను మీరెప్పుడైనా గమనించారా? ఏళ్ల క్రితం నాటి పోస్టింగ్స్ కూడా పేజీపైభాగంలో కనిపిస్తూంటాయి. తాజా పోస్ట్‌లనుకుని వాటికి మనం లైకులు కొట్టడం.. మనల్ని చూసి ఇంకొందరు అదేదారి పట్టడం తరచూ జరిగే విషయమే. అంతేకాకుండా మీ ప్రమేయం లేకుండానే కొన్నిసార్లు కొన్ని పేజీలు ప్రత్యక్షమవుతూ చికాకు పెడుతూంటాయి కూడా. ఇలాంటి చిక్కుల్లేకుండా మీకు ఇష్టమైన మిత్రుల పోస్ట్‌లు మాత్రమే చూడాలనుకుంటున్నారా? ఎప్పుడో మీరు అన్‌ఫాలో చేసిన మిత్రులతో మళ్లీ సంబంధాలు నెరపాలని అనుకుంటున్నారా? అయితే ఫేస్‌బుక్ మరోసారి ఈ అవకాశమిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం... వెంటనే ఎలా, ఏమిటి? అన్నది చూసేయండి మరి.

చాలా సింపుల్. ఫేస్‌బుక్ హోంపేజీలో ఎడమవైపున ఉన్న మెనూలో ఆప్స్ ఆప్షన్‌ను డబుల్ క్లిక్ చేయండి. న్యూస్‌ఫీడ్, ఈవెంట్స్ వంటి ఫీచర్ల తాలూకూ సెట్టింగ్స్‌తో కూడిన విండో ప్రత్యక్షమవుతుంది. దీంట్లో న్యూస్‌ఫీడ్ సెట్టింగ్స్‌ను క్లిక్ చేస్తే మీకు అప్పటివరకూ కనిపించే మిత్రుల జాబితా, ఫాలో అవుతున్న పేజీల వివరాలన్నీ కనిపిస్తాయి. మీకు నచ్చిన దాన్ని ఉంచుకోండి. మిగిలిన వాటిని తొలగించుకోండి. ఫేస్‌బుక్ ఫ్రెష్‌గా మారిపోతుంది.
 
ఫేస్‌బుక్‌లో ఏరోజైనా ఒక్కో వ్యక్తి న్యూస్‌ఫీడ్‌లో దాదాపు 1500 పోస్టులు ప్రత్యక్షమవుతూంటాయని అంచనా. అయితే వీటిల్లో చాలామంది 150 పోస్టులకు మించి చూడరు. మీ బ్రౌజింగ్ తీరుతెన్నులను పరిగణనలోకి తీసుకుని ఫేస్‌బుక్ అల్గారిథమ్స్ మీకు ఏ రకమైన పోస్ట్‌లు పోస్ట్ చేయాలో నిర్ణయిస్తూంటుంది. అయితే మన మూడ్ ఎప్పుడూ ఒకేలా ఉంటుందా? అస్సలు ఉండదు. అందుకే అప్పుడప్పుడైనా ఈ న్యూస్‌ఫీడ్ సెట్టింగ్స్‌ను వాడుకుని మీ ఫ్రెండ్స్, లైక్స్ పేజీల లిస్ట్‌ను రిఫ్రెష్ చేసుకోవడం మేలు. ఇంకో విషయం... న్యూస్‌ఫీడ్‌ను మరింత సౌకర్యవంతంగా మార్చుకునేందుకు ఇలాంటి మరిన్ని ఫీచర్లను ప్రవేశపెడతామని ఫేస్‌బుక్ చెబుతోంది. చూస్తూనే ఉండండి మరి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement