నాకు తెలియాలి | How a poor SC woman used the RTI Act to get justice | Sakshi
Sakshi News home page

నాకు తెలియాలి

Published Wed, Oct 3 2018 1:22 AM | Last Updated on Wed, Oct 3 2018 1:22 AM

How a poor SC woman used the RTI Act to get justice - Sakshi

సిటీ కార్పోరేషన్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్, షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ అన్నిటికీ సరోజమ్‌ దరఖాస్తు పెట్టింది.. ‘‘నా దుకాణం  కూలగొట్టమని ఎవరు ఆర్డర్‌ ఇచ్చారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను’’ అని.

‘‘నేను ఇచ్చిన కంప్లయింట్‌ స్టేటస్‌ ఏంటి? దర్యాప్తు చేయడానికి పురమాయించారా? ఒకవేళ ఆర్డర్‌ ఇస్తే ఆ ఆర్డర్‌ కాపీ చూపించండి. దర్యాప్తు కోసం నియమించిన ఆఫీసర్‌ ఎవరు? దర్యాప్తు జరిగి ఉంటే దానికి సంబంధించిన రిపోర్ట్‌ కాపీని సంబంధిత అధికారికి అందచేశారా?..ఈ ప్రశ్నలతో దరఖాస్తు అందగానే ఆగమేఘాల మీద కదిలారు పోలీసులు ఆ కేస్‌ ఇన్వెస్టిగేషన్‌కు.ఈ ప్రశ్నలు సంధించిన వ్యక్తి పేరు సరోజమ్‌. ఓ సగటు మహిళ. షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌కు చెందిన వ్యక్తి. ఏ విషయం పట్ల ఆ ఆగ్రహం? మామూలు ఆగ్రహం కాదు ధర్మాగ్రహం! 

మొదట పట్టించుకోలేదు
సరోజమ్‌.. తిరువనంతపురం నివాసి. 20 ఏళ్లుగా అక్కడే ఎమ్‌ఎస్‌కె నగర్‌లో అట్టుకల్‌ దేవీ గుడి దగ్గర పాత ఇనుప సామాన్ల దుకాణం నడిపిస్తూ ఉంది. 2014 అక్టోబర్‌ 11న సిటీ కార్పొరేషన్‌కు చెందిన కొంతమంది మనుషులు వచ్చి ఆమె దుకాణాన్ని కూలగొట్టారు. అందులో ఉన్న వస్తువులన్నిటినీ ఊడ్చుకెళ్లారు. ఎందుకలా చేస్తున్నారు అని ఆ సరోజమ్‌ అడిగితే.. ఆ దుకాణం పక్కనే ఉన్న చెరువును శుభ్రం చేయమని ఆర్డర్స్‌ వచ్చాయని.. చెరువు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ క్లీన్‌ చేయమన్నారని.. పైగా ఆమె దుకాణం పోరంబోకు భూమిలో ఉంది కాబట్టి దాన్నీ తీసేశామని చెప్పారనీ  అన్నారు. వెంటనే ఆమె భర్త నాగరాజన్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి, వాళ్లపై కంప్లయింట్‌ ఇచ్చాడు. ఎప్పటిలాగే పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఓ నెల అయినా వ్యవహారం అంగుళం ముందుకు సాగలేదు. ఈసారి సరోజమ్‌ వెళ్లి ఇంకోసారి కంప్లయింట్‌ ఇచ్చింది. రిసీట్‌ ఇవ్వమనీ డిమాండ్‌ చేసింది. అయినా పోలీసులు స్పందించలేదు. తరచుగా పోలీస్‌ స్టేషన్‌ వెళ్తూనే ఉంది. దాదాపు పదినెలలు గడిచాయి. బతుకు దెరువు పోయింది. చేతిలో ఇంకో పనిలేదు. పోలీసుల తీరులో మార్పులేదు. 

తర్వాత పరుగులు తీశారు
సరోజమ్‌ వాళ్లుండే ప్రాంతంలో ‘ది సేవా’ (సెల్ఫ్‌ ఎంప్లాయ్డ్‌ విమెన్స్‌ అసోసియేషన్‌) ఆర్‌టీఐ (రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌) మీద అవగాహనా తరగతులను నిర్వహించింది. దానికి సరోజమ్‌ కూడా వెళ్లింది. అంతా విని తన సమస్య గురించి తను ఇచ్చిన పోలీస్‌ కంప్లయింట్‌ కథాకమామీషు కూడా ఈ ఆర్‌టీఐ ద్వారా తెలుసుకోవచ్చా? అని నిర్వాహకులను అడిగింది. తెలుసుకోవచ్చని చెప్పారు. ఎలాగో కూడా వివరించారు. అలా వాళ్ల సలహా ప్రకారం తను ఇచ్చిన కంప్లయింట్‌కు సంబంధించి పైన ప్రశ్నలతో పోలీస్‌స్టేషన్‌లో ఆర్‌టీఐ దరఖాస్తును ఫైల్‌ చేసింది.

మీడియా వాళ్లొచ్చారు
ఆ రోజు వరకు ఎప్పుడు సరోజమ్‌ వెళ్లినా.. అసలు ఎమ్‌ఎస్‌కె నగర్‌లో.. అట్టుకల్‌ దేవీ గుడి దగ్గరున్న చెరువు ఒడ్డున పాత ఇనుప సామాన్ల షాపే లేదని.. అదంతా పోరంబోకు ల్యాండ్‌ అని సరోజమ్‌ను బెదిరించి పంపిన పోలీసులు ఆమె ఆర్‌టీఐ దరఖాస్తు చూసి అంతకుమించిన బెదురుతో హుటాహుటిన కదిలారు.. కేస్‌ సాల్వ్‌ చేయడానికి! దాంతో అప్పటిదాకా నిద్రాణంగా ఉన్న ఆ కేస్‌ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. నిరుపేదల, షెడ్యూల్డ్‌ కులాల ప్రజల అజ్ఞానాన్ని ప్రభుత్వోద్యోగులు ఎలా ఆసరాగా మలచుకుంటున్నారో సరోజమ్‌ కేసుతో ప్రజలకు చూపించింది స్థానిక మీడియా. పదినెలలుగా సరోజమ్‌ కుటుంబం పడ్డ అవస్థ వార్తగా వైరల్‌ అయింది. వార్తా చానెళ్లు కెమెరా, మైక్‌లతో ఆమె ముందు ప్రత్యక్షమయ్యారు.

కూల్చినవాళ్లే కట్టించారు
సిటీ కార్పొరేషన్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్, షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ అన్నిటికీ సరోజమ్‌ దరఖాస్తు పెట్టింది.. ‘‘నా దుకాణం కూలగొట్టమని ఎవరు ఆర్డర్‌ ఇచ్చారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను’’ అని. ‘‘సరోజమ్‌ దుకాణం కూల్చివేతతో మాకు ఎలాంటి సంబంధం లేదని, మేమెలాంటి ఆర్డర్స్‌నూ పాస్‌ చేయలేదు’’ అని కార్పొరేషన్, జిల్లా రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ స్పష్టం చేసింది. మరెవరు ఆదేశాలు ఇచ్చారో తెలపమని సంబంధిత ప్రభుత్వ శాఖలకు నోటీసివ్వమని చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌కు మరో దరఖాస్తు పెట్టుకుంది సరోజమ్‌. చెరువును శుభ్రం చేయమనే ఉత్తర్వు షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ డెవలప్‌మెంట్‌ శాఖ నుంచి వచ్చినట్టు తేలింది. ‘‘స్వయం పర్యాప్త గ్రామం’ (సెల్ప్‌ సఫీషియెంట్‌ విలేజ్‌) ప్రాజెక్ట్‌ కింద చెరువును శుభ్రం చేసే పనిని చేపట్టాం తప్ప, ఒడ్డున ఉన్న షాప్‌ను కూల్చమనే ఉత్తర్వులు అయితే ఇవ్వలేదు’’ అని వివరణ ఇచ్చాడు ఎస్‌సీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌. ఇక్కడి నుంచి కథ ఇంకా చకచకా కదలడం మొదలైంది. ఎవరు కూల్చమన్నారు? ఎందుకు కూల్చారు నుంచి అసలు ఎమ్‌ఎస్‌కె నగర్‌ స్వరూప స్వభావాల మీద అధ్యయనం దాకా వెళ్లింది వ్యవహారం. చివరికి ఈ ఏడాది ముప్పయ్‌ అంటే ముప్పయ్‌ రోజుల్లో.. సరోజమ్‌ ఆర్‌టీఐ దరఖాస్తుతో ఆమె దుకాణాన్ని ఎక్కడైతే కూల్చారో.. అక్కడే కొత్త దుకాణాన్ని కట్టి ఇచ్చారు. ఎమ్‌ఎస్‌కె నగర్‌ను కూడా అత్యవసర సదుపాయాలతో కొత్తగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఆ కాలనీ వాసులంతా సరోజమ్‌ను విజేతగా.. నేతగా అభిమానిస్తున్నారు. 
– శరాది 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement