నిర్లక్ష్య ఫలితం ఇది!
కనువిప్పు
‘‘మీ పెద్ద అబ్బాయి ఏం చదువుతున్నాడు?’’ అని ఎవరైనా అడిగితే మా నాన్న ముఖంలో కనిపించే విషాదాన్ని మరవ లేకుండా ఉన్నాను.
పెద్దల మాట చద్ది మూట అంటారు. నేను మాత్రం పెద్దలు ఏదైనా చెప్పబోతే ‘చెప్పింది చాలు. సుత్తి ఆపు’ అన్నట్లుగా చూసేవాడిని. నీతులు చెప్పబోతే నిప్పులు మింగినట్లు ఇబ్బందిగా ముఖం పెట్టేవాడిని.
‘‘ఎప్పుడు చూసినా బజార్లో కనిపిస్తావు. బుద్ధిగా చదువుకోవచ్చు కదా’’ అని ఒకసారి మా పెద నాన్న అంటే-
‘‘నా విషయం మీకు అనవసరం. ఈ నీతులేవో మీ అబ్బాయికి చెప్పుకోండి’’ అన్నాను కోపంగా. ఇక అప్పటి నుంచి పెదనాన్న నన్ను చూస్తేనే ఒకలా ముఖం పెట్టేవారు.
‘‘గొడవల్లో తలదూరుస్తున్నావట. చదువుకోవాలని లేదా?’’ అని మా బావ ఒకసారి అక్షింతలు వేయబోతే- ‘‘నాకు చెప్పేంత సీన్ నీకు లేదు. నీ పనేదో నువ్వు చూసుకో’’ అని దురుసుగా సమాధానం ఇచ్చే సరికి ఆయన తీవ్రంగా హర్ట్ అయ్యారు.
‘‘నువ్వు పరాయి వాడివైతే నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు వినాల్సిన అవసరం లేదు. నువ్వు దగ్గరి బంధువు కదా అని నీ మంచికే చెప్పాను. ఇక ముందు నేను నీతో మాట్లాడను. దయచేసి నువ్వు కూడా నాతో ఎప్పుడూ మాట్లాడవద్దు’’ అన్నాడు బావ బాధగా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొడవలు. దగ్గరి వాళ్లు ఎందరో దూరం అయ్యారు. అయినా సరే నాలో పశ్చాత్తాపం లేదు. మార్పు లేదు.
అందరూ అనుకున్నట్లుగానే ఇంటర్‌మీడియెట్ తప్పాను. ఎన్నిసార్లు సప్లిమెంటరీ పరీక్షలు రాసినా పాస్ కాలేక పోయాను. ఖాళీగా ఉంటే మరింత చెడిపోతాడనే కారణంతో నాన్న నాతో చిన్న కిరాణా కొట్టు ఒకటి పెట్టించాడు. ఈ కొట్టు వల్ల లాభాలు రావు. నష్టాలు రావు. ఏదో నడవాలి కాబట్టి నడుస్తుంది.
‘‘మీ పెద్ద అబ్బాయి ఏం చదువుతున్నాడు?’’ అని ఎవరైనా అడిగితే మా నాన్న ముఖంలో కనిపించే విషాదాన్ని మరవ లేకుండా ఉన్నాను. అందుకే గట్టిగా నిర్ణయించుకున్నాను. అది వ్యాపారం కావచ్చు, చదువు కావచ్చు. నాన్న నా గురించి గర్వంగా చెప్పుకునేలా చేయాలనుకున్నాను. ఇప్పుడు నా కళ్లు పూర్తిగా తెరుచుకున్నాయి.
-టియస్, రాజమండ్రి