నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ సర్, నాకు రీసెంట్‌గా పెళ్లి అయ్యింది. ఇద్దరం బాగానే ఉంటాం. కానీ మా ఇద్దరి మధ్య జరిగే చిన్న చిన్న గొడవలను కూడా వాళ్ల ఫ్యామిలీ ముందు చెబుతుంటారీయన. నేను మూడ్ ఆఫ్‌లో ఉంటే ఫ్యామిలీ అందరి ముందు ‘తనకు ఏం చెప్పకండి, అసలే దానికి విసుగు’ అని అంటారు. అందరి ముందు నన్ను హేళనగా మాట్లాడం, నాపై జోక్స్ వేయడం నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. లైఫ్‌లో నాకు సపోర్ట్‌గా ఉంటారా? అనే భయం వేస్తుంది. ప్లీజ్ సార్ మంచి సలహా ఇవ్వండి. – స్వాతి
చూడు నీలాంబరి నువ్వు అంతే అంతమంది రీడర్స్ ముందు నన్ను ఎన్నేసి మాటలంటావు? మై హార్ట్ ఈజ్ వెరీ హర్టెడ్. ఈ క్వశ్ఛన్‌కి నువ్వే సమాధానం ఇవ్వు. తోటి అమ్మాయి బాధను, నా బాధను అర్థం చేసుకునే అవకాశం దొరికింది కమాన్ ఫైర్. ‘వద్దులే సార్ చాలా సున్నితమైన విషయం చెబితే హస్బెండ్ హర్ట్ అవుతాడు చెప్పకపోతే మీ చెల్లెలు హర్ట్ అవుతుంది... చాలా చిక్కు ప్రశ్న. మీరే సమాధానం ఇవ్వండి నేను అరటిపండు తెస్తాను.’
సరే నేనే చెబుతా. చాలా కష్టం బంగారు తల్లీ! మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. కానీ మొగుళ్లు అంతే! వాళ్లు అంతా సరదాగా అన్నాం అనుకుంటారు. కానీ, మనకు ఎంత బాధ కలుగుతుందో అర్థం చేసుకోరు. అది అహంకారం కాకపోవచ్చు తాను చిన్నప్పుడు చూసిన తాతయ్యో బాబాయో బావో వాళ్ల భార్యలను ట్రీట్ చేసిన తీరు అయ్యిండొచ్చు. ఆ రోజుల్లో భార్యలు బాధపడే వారు కానీ చెప్పుకునే వారు కాదు. తప్పనిసరి కాబట్టి ఆడవాళ్లు ఇన్సల్ట్ అయినా నవ్వేసేవారు. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటే కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది.
నాకు తెలిసి నీ భర్త ఇది శాడిజంతో చేస్తున్న పని కాదు. తెలియక చేస్తున్న పని. కొంత మందికి అలా ప్రేమ చూపించడం కూడా ఒక సరదా... బీ క్లియర్ విత్ హిం. చెప్పేసెయ్ నీకు చాలా బాధ కలుగుతుందని. జీవితాంతం ఈ హింస భరించలేనని. నిన్ను గౌరవించడం నీకు చాలా అవసరం అని. నీకు తనంటే ఎంత గౌరవమో చెప్పు. నిజానికి పెళ్లిలో ప్రేమకంటే గౌరవమే ముఖ్యమని చెప్పు. తాను ఆట పట్టిస్తున్నాడంటే నిన్ను తప్పకుండా గౌరవిస్తాడు. డోంట్ వర్రీ.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com