ఆలయంలోకి అడుగుపెట్టగానే ముందుగా దర్శనమిచ్చేది ధ్వజస్తంభం. ఆలయంలో నెలకొని ఉన్న స్వామివారి కీర్తి పతాకను రెపరెపలాడిస్తూ, చిరుగంటల సవ్వడితో, తల ఎత్తి చూసేంత ఎత్తులో కనిపిస్తుంది ధ్వజస్తంభం. ధ్వజం అంటే పతాకం (జెండా). ధ్వజాన్ని కట్టి ఎగురవేసే స్తంభం కనుక దీనికి ఆ పేరు వచ్చింది. ఆలయపురుషునిలో ఉన్న షట్చక్రాలలో మొదటిదైన మూలాధారచక్రంపై ఇది ప్రతిష్ఠించబడుతుంది కనుకనే ఇది ఆలయానికి మూలస్తంభంగా పేర్కొనబడుతోంది. ప్రాచీన యాగశాలలే కాలాంతరంలో ఆలయాలుగా రూపాంతరం చెందిన నేపథ్యంలో యూపస్తంభం ధ్వజస్తంభంగా రూపుదిద్దుకుంది. ఒక్కసారి ధ్వజస్తంభం ఆకారాన్ని జాగ్రత్తగా గమనిస్తే మనకు త్రిమూర్తుల (ఆత్మ, విద్యా, శివ తత్త్వాల)సమిష్టితత్త్వం దర్శనమిస్తుంది. అలాగే ధ్వజస్తంభం పై భాగాన మూడు పలకలు, మూడు శిఖరాలు ఉంటాయి.
మూడు పలకలను పట్టి ఉంచే నిలువు కొయ్యలు 3 ఉంటాయి. ఇలా ఈ స్తంభ నిర్మాణమంతా మూడుతో ముడిపడి ఉంది. దక్షిణ భారతమంతటా గోపురం దాటి లోపలికి రాగానే కనిపించే ధ్వజస్తంభం ఉత్తరాదిన మాత్రం ఆలయ విమానంపైనే స్థాపించబడుతుంది. ధ్వజస్తంభంపై అడుగడుగునా పట్టికలు(పర్వాలు) కనబడతాయి. అవేంటంటే పూర్వం తాత్కాలికంగా వెదురు కర్రతోనే ధ్వజస్తంభం నిలబెట్టి ధ్వజారోహణ చేసేవారు. రానురానూ స్థిరంగా ప్రతిష్ఠిస్తున్నందువలన అదే ఆకారంలో వెదురు కొయ్యకు గణుపులున్నట్లు పట్టీలను పెట్టడం జరుగుతోంది. ఈ గణుపులు బేసిసంఖ్యలో ఉంటాయి. ఈ ధ్వజస్తంభం ఎత్తు ఎంత ఉండాలనేది నాలుగు రకాలుగా చెప్పబడింది. గోపురమంత ఎత్తు, ఆలయవిమానమంత ఎత్తు, శిఖరమంత ఎత్తు, ఆలయ పైకప్పు సమానంగా ధ్వజస్తంభం ఎత్తు ఉండవచ్చు.
సాధారణంగా ఈ ధ్వజస్తంభాన్ని చందనం, దేవదారు, ఎర్రచందనం, టేకు కొయ్యతో నిర్మిస్తారు. శివాలయాలలో బలిపీఠం తర్వాత, విష్ణ్వాలయాలలో బలిపీఠానికి ముందు ధ్వజస్తంభం ఉంటుంది. శ్రీశైల మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామి ఆలయానికి ముందు భాగంలో, వెనుకవైపు రెండు ధ్వజస్తంభాలున్నాయి. పూర్వం నాలుగుదిక్కులా నాలుగు ధ్వజస్తంభాలుండేవని శాసనాలు చెబుతున్నాయి. అమరావతి అమరేశ్వర స్వామి ఆలయంలో నలుదిక్కులా ధ్వజస్తంభాలు కనిపిస్తాయి. శ్రీరంగానికి దగ్గరలోని జంబుకేశ్వరంలో ఎనిమిది ధ్వజస్తంభాలు ఉన్నాయి. వీటిని దిక్ ధ్వజస్తంభాలంటారు. ధ్వజస్తంభ దర్శనం వలన ధర్మకార్యాచరణపై మనసు లగ్నమవుతుంది. కీర్తి, యశస్సు కలుగుతాయి.
కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య,
ఆగమ, శిల్పశాస్త్ర పండితులు
Comments
Please login to add a commentAdd a comment