విదేశీ వస్తువులే కాదు..రానురాను వ్యాయామ పద్ధతులు కూడా నగరానికి దిగుమతి అవుతున్నాయి. మారుతున్న జీవన శైలిని ఆసరాగా చేసుకుని ఫిట్‌నెస్ సెంటర్లు ఎప్పటికప్పుడు సరికొత్త వర్కవుట్స్‌ను పరిచయం చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడున్న వ్యాయామాలకు భిన్నంగా మరో సరికొత్త వ్యాయామం నగరంలోకి ప్రవేశించింది. అదే పిలాటీస్. శరీరంలో ఎక్కడో లోతుగా ఉండే కోర్ కండరాలను సైతం పటిష్టపరిచి నవ యవ్వనశక్తిని పునరుత్పత్తి చేసే మహత్తు పిలాటీస్‌కు ఉందని నగరానికి చెందిన ఫిట్‌నెస్ ట్రైనర్ జైనెబ్ అలీ చెబుతున్నారు. సింగపూర్‌లో పిలాటీస్‌పై ప్రత్యేకంగా కోర్సు పూర్తిచేసిన ఆమెసర్టిఫికెట్‌ను పొందారు. ప్రస్తుతం తిరుమలగిరిలోని స్వర్గం ఆర్కేడ్‌లోని తన స్టూడియోలో శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి పిలాటీస్ గురించి వివరించారు.
సనత్‌నగర్ :పిలాటీస్ అనేది మెదడు, శరీర వ్యాయామ ప్రక్రియ. దీనిని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పురుషుల కోసం జోసఫ్ పిలాటీ అనే వ్యక్తి ప్రారంభించారు. కాలక్రమంలో దీనిని మహి ళలు కూడా చేయడం మొదలుపెట్టారు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న వ్యాయామ రూపా ల్లో పిలాటీస్ ఒకటి. కండరాల కదలికల్లో ఖచ్చితత్వం. నియంత్రణ, కండరాల బలోపేతం చేయడానికి పిలాటీస్ రూపొందించారు. ప్రధానం గా అభివృద్ధి చెందిన దేశాలు యూఎస్, ఆస్ట్రేలి యా, యూరప్, సింగపూర్‌లలో ఎక్కువగా పిలాటీస్ వ్యాయామ పద్ధతులను అనుసరిస్తారు. అత్యంత సురక్షితమైన వ్యాయామ రూపాల్లో ఒకటిగా పిలాటీస్‌ను జనరల్‌ప్రాక్టీషనర్స్, ఫిజియోథెరపిస్ట్, ఆస్టియోపథ్స్ సైతం ఆమోదించారు. ఇప్పుడిప్పుడే ఇది హైదరాబాద్‌లోకి ప్రవేశించింది.
ఐదు సూత్రాల వ్యాయామం.
ప్రధానంగా పిలాటీస్‌కు ఐదు సూత్రాలను అనుసరిస్తారు. బ్రీథింగ్, పెల్విక్ ప్లేస్‌మెంట్, రిబ్ కేజ్ ప్లేస్‌మెంట్, స్కపులర్ మూవ్‌మెంట్, స్టెబిలైజేషన్ హెడ్ అండ్ సెర్వికల్ ప్లేస్‌మెంట్ సూత్రాల ఆధారంగా పిలాటీస్ చేయిస్తారు. ఈ ఐదు సూత్రాల ఆధారంగా రూపొందించబడ్డ దాదాపు 500 రకాల వ్యాయామ పద్ధతుల ద్వారా ఎలాంటి మందులతో పనిలేకుండా శరీరంలోని లోపాలను సరిజేయవచ్చు.
పలు ఉపకరణాలు ఉపయోగించి...
మ్యాట్‌పై కసరత్తు చేయడంతో పాటు రీఫామర్, స్టెబిలిటీ చైర్, కాడిలాక్, నిచ్చెన బ్యారెల్ వంటి ఉపకరణాలను ఉపయోగించి పిలాటీస్ వ్యాయామ ప్రక్రియను చేయవచ్చు. అయితే ఉపకరణాలపై కంటే ఎక్కువ శాతం వ్యక్తిగత వ్యాయామ పద్ధతులనే పిలాటీస్‌లో పాటిస్తారు.
పిలాటీస్ ఉపయోగాలేమిటంటే..
పార్శ్వగూని ఉన్నవారిని ఆ సమస్య నుంచి బయటపడేయవచ్చు. బోలు ఎముకల వ్యాధి, అర్ధరైటిస్, కీపిసిస్, లోర్డోసిస్, మెడ సమస్యలు, షోల్టర్ సమస్యలు, బ్యాక్ పెయిన్, కీళ్ల నొప్పులు, శ్వాస సమస్యలు వంటి రుగ్మతల నుంచి పిలాటీస్ ఉపశమనం కలిగిస్తుంది. అలాగే వెయిట్ లాస్, కండరాల టోనింగ్, పోస్టర్ కరెక్షన్ (భౌతికంగా కనిపించే లోపాలను సరిజేయడం), శరీర దృఢత్వం, కోర్ కండరాల పటిష్టత, మెదడు, దేహ కండరాలు శక్తిని పునరుత్పాదించడం, శారీరికంగా, మానసికంగా ఉత్తేజపరచడంలో పిలాటీస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఒత్తిడిని జయించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఏకాగ్రతను పెంపొందింపజేస్తోంది.
క్రీడకు తగ్గట్టుగా అవయవాలు బలోపేతం
క్రీడాకారులకు ముఖ్యంగా కండరాలపై ప్రభావం పడుతుంది. ఒక్కో క్రీడాకారుడు ఒక్కోచోట కండరాలను ఉపయోగించాల్సిన పరిస్థితి ఉం టుంది. ఈత కొట్టేవారు షోల్టర్స్ వద్ద, రన్నింగ్ చేసే వారు మోకాళ్లు, పాదాల వద్ద, ఫుట్‌బాల్ క్రీడాకారులకు పాదాలు, షూటర్స్‌కు షోల్టర్స్, మోచేతులు...ఇలా రకరకాల భాగాల వద్ద కండరాలను ఆ క్రీడకు తగ్గట్టుగా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పిలాటీస్‌తో ఆయా క్రీడాకారుల శరీరంలో లోతుగా ఉన్న కోర్ కండరాలను సైతం పటిష్టం చేసి మెరుగైన ఆటకు దోహదం చేయవచ్చు.
అన్ని వయసుల వారికీ..
అన్ని వయస్కుల వారు ఎలాంటి సంకోచం లేకుండా పిలాటీస్ వ్యాయామ విధానాలను అనుసరించవచ్చు. పిలాటీస్ వ్యాయామం చేసేవారిలో కేవలం 10 సెషన్స్‌లోనే శరీర మార్పును గమనిం చవచ్చు. 30 సెషన్స్‌లో కొత్త దేహాన్ని చూడవచ్చని జైనెబ్ అలీ చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యా యామాలు చేయాలంటే సర్టిఫైడ్ పొందిన నిపుణుల పర్యవేక్షణలోనే చేయాల్సి ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment