
క్రాష్ కాదు... మెమరీ లేదు!
ఎంతో కష్టపడి కంప్యూటర్‌పై దాచుకున్న వీడియోలు, ఫొటోలు, సమాచారం ఉన్నట్టుండి పోతే ఎలా ఉంటుంది? మహా ఇబ్బంది పడిపోతాం.
15 ఏళ్ల కుర్రాడి ఆవిష్కరణ
ఎంతో కష్టపడి కంప్యూటర్‌పై దాచుకున్న వీడియోలు, ఫొటోలు, సమాచారం ఉన్నట్టుండి పోతే ఎలా ఉంటుంది? మహా ఇబ్బంది పడిపోతాం. బాధపడతాం కూడా. కారణమేదైనా పీసీ తరచూ క్రాష్ అవుతున్నా మనది ఇదే పరిస్థితి. ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా పోతే భలే ఉంటుంది కదూ..! అచ్చంగా ఇదే ఆలోచన చేశాడు అసోంలోని హాథీగావ్‌కు చెందిన 15 ఏళ్ల అఫ్రీద్ ఇస్లాం అంతేకాదు... ఈ చిక్కుముడులన్నింటినీ తొలగించే సరికొత్త పీసీ ‘రెవోబుక్’ను తయారు చేసి చూపించాడు కూడా.
కంప్యూటర్ క్రాష్ అయ్యేందుకు లేదా సమాచారం నష్టపోయేందుకు అనేక కారణాలు ఉంటాయి. కదిలే భాగాలున్న హార్డ్‌డిస్క్ కూడా ఈ కారణాల్లో ఒకటి. ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమాచారాన్ని స్టోర్ చేసుకునే ఎస్‌డీ కార్డులతోనూ ఈ సమస్య ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించిన ఇస్లాం హార్డ్‌డిస్క్ అన్నదే లేకుండా సరికొత్త కంప్యూటర్ వ్యవస్థను తయారు చేశాడు.
కంప్యూటర్‌ను నడిపించేందుకు అవసరమైన మైక్రోప్రాసెసర్‌లోనే ఆపరేటింగ్ సిస్టమ్‌తోపాటు మెమరీకి కూడా ఏర్పాట్లు చేయడం ద్వారా ఇది సాధ్యమైంది. సంప్రదాయ మెమరీ పరికరాలు షాక్‌కు, అయస్కాంత క్షేత్ర ప్రభావానికి లోనైనా అందులోని సమాచారం ఎగిరి పోయే అవకాశముంటుందని, మైక్రోచిప్‌లో కదిలే భాగాలేవీ లేకపోవడం, అయస్కాంత క్షేత్ర ప్రభావానికి అందకపోవడం వల్ల తన కొత్త పీసీ వ్యవస్థలో సమాచార నష్టమన్నది దాదాపుగా ఉండదని అఫ్రీద్ అంటున్నాడు.
హైబ్రిడ్ ఆపరేటింగ్ సిస్టమ్..
మనం సాధారణంగా విండోస్, మ్యాకింతోష్, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఉపయోగిస్తూంటాం. వేటికవి ప్రత్యేకం. అఫ్రీద్ మాత్రం ఈ మూడు ఆపరేటింగ్ సిస్టమ్స్‌లోని మంచి లక్షణాలను ఒకచోటకు చేర్చి ‘రి వో 9’ పేరుతో సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశాడు. మిగిలిన వాటితో పోలిస్తే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ వేగం చాలా ఎక్కువగా ఉంటుందని, ఫైర్‌వాల్ కూడా ఇందులోనే ఉండటం వల్ల మరింత సమర్థంగా పనిచేస్తుందని తెలుస్తోంది. మూడేళ్ల క్రితమే తాను ఈ కొత్త కంప్యూటర్ వ్యవస్థ రూపకల్పనకు ప్రయత్నాలు మొదలుపెట్టానని అఫ్రీద్ తెలిపారు. పేటెంట్ కోసం దాఖలు చేసిన సమాచారాన్ని చూసిన ఓ జర్మన్ కంపెనీ తన పద్ధతులతో కంప్యూటర్ తయారీకి ముందుకొచ్చిందని తెలిపారు. తగిన ఆర్థిక వనరులు సమకూరిస్తే రివోబుక్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తానన్నాడు.