సంప్రదాయానికి పట్టుగొమ్మ
ఓనమ్ స్పెషల్
ప్రకృతి అంతా ఒక చోటే కొలువుదీరిందా అని ఆశ్చర్యపోయేటంత అందం కేరళ సొంతం. ప్రాకృతిక పరంగానే కాకుండా సంప్రదాయానికీ ఈ నేల పెట్టింది పేరు. ‘ఏ దేశమేగినా, ఎందుకాలిడినా’ తమ సంస్కృతినీ సంప్రదాయాన్నీ కాపాడుకోవడం మలయాళీల ప్రత్యేకత. తెలుగురాష్ట్రాలలో మలయాళీలూ సందడి చేస్తున్నారు. వారి పండగలలో ప్రధానమైన ఓనమ్, వారి ఆహార్యమూ తెలుగువారినీ ఆకట్టుకుంటుంది. ఓనమ్ సందర్భంగా మలయాళీల కట్టూబొట్టు గురించి...
పాల మీగడను పోలి ఉండే పంచెకు బంగారపు జరీ అంచు, అదే పోలికతో ఉండే ఉత్తరీయం మలయాళీల సంప్రదాయ వస్త్రధారణలో ప్రధానమైనవి. చెడు ఆలోచనలను, చెడు భావనలను తొలగించి హృదయాన్ని నూతనంగా చేయటమే ఈ వస్త్రాలు ధరించడంగా కేరళవాసులు భావిస్తారు.
ప్రాచీనం.. ముండు..
కసవు అంటే బంగారు అంచు. ముండు అంటే పంచె, నెరయాతుమ్ అంటే ఉత్తరీయం. కసవు చీరలు, పంచెలు, ఉత్తరీయం.. తేలికగా ఉండటమే కాదు, జరీ అంచులు మెరుస్తూ ఉంటాయి. ఇవి పూర్తిగా పర్యావరణ అనుకూల కాటన్ వస్త్రాలు. వీటిని సంప్రదాయ చీరలుగా, డ్రెస్‌లుగా ఉపయోగిస్తారు. ముండు, నెరయాతుమ్ ధరించి నూనె పెట్టి విడిచిన పొడవాటి కురులలో మల్లెపూలను ధరించిన మలయాళీ మహిళ అందానికి ప్రతిరూపంగా నిలుస్తుంది. నుదుటిపై చిన్న బొట్టు, కళ్లకు కాటుక, బంగారు ఆభరణాలు ప్రత్యేకతను చాటుతుంటాయి. ఈ కాంబినేషన్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. మగవారు ముండును లుంగీగాను, నెరయాతుమ్‌ను భుజాల చుట్టూ ధరిస్తారు. ఈ వస్త్రాలు ఒక్క ఓనమ్ పండగకే కాదు, వారంలో రెండు సార్లు ధరించాలి అనే నియమం కూడా కేరళలో అనుసరిస్తున్నారు. ప్రతి వేడుకలోనూ ‘కసవు’ చీరలకు ప్రథమ స్థానం ఇవ్వడం వీరి ప్రత్యేకత. కేరళ చేనేత వస్త్రాలకు ఓ ప్రత్యేకత ఉందని, శిశువు గర్భస్థ దశలో ఉండగా స్త్రీ ఈ వస్త్రాలను ధరిస్తే పుట్టబోయే బిడ్డకు కామెర్లు రావని చెబుతారు. అంటే ఈ వస్త్రం ఆరోగ్య ప్రదాయిని అన్నమాట.
ఆధునిక పద్ధతుల్లో ముండు వస్త్రాన్ని నడుముకు చుట్టుకొని, నెరియాతు ఎడమ భుజం మీదుగా పమిటలా వేసుకుంటున్నారు. ఇది తెలుగింటి లంగా ఓణీని తలపిస్తుంది.
చేనేత చీరలకు కేరళ పెట్టింది పేరు. ఇక్కడ బలరాం పురం, కన్నూర్, కూతంపల్లి, చెన్నమంగళం, కాసర్ గోడ్ వస్త్రాలకు అక్కడి రాష్ట్రంలోనే గాక విదేశాలలో కూడా మంచి పేరుంది. కేరళ సంస్కృతికి అద్దం పట్టేవిధంగా ఈ చీరల నేత ఉంటుంది. బలంపురంలో వెదురుతో సూపర్ ఫైన్ కాటన్‌ను తయారుచేస్తారు. ఈ ప్రాంతం చీరలకు, ఇతర నూలు వస్త్రాలకు ప్రసిద్ధి. పర్యావరణానికి అనుకూలంగా వస్త్రాల నేత ఉంటుంది. కన్నూర్ ప్రాంతం నుంచి జపాన్, హాంగ్‌కాంగ్, యూరప్, మధ్య ఆసియా దేశాలకు వస్త్రాలను ఎగుమతి చేస్తారు. త్రిసూర్ జిల్లాలోని కూతంపల్లి ‘కసవు’ చేనేతకు ప్రసిద్ధి. డబుల్ ధోతి, సెట్ ముండు, వేస్టీ, సెట్ శారీ, లుంగీ, చుడీదార్ వస్త్రాలను తయారుచేస్తారు. ఓనమ్, విషు, క్రిస్ట్‌మస్ పండుగల సమయాల్లో కూతంపల్లి వస్త్రాలకు ప్రజలు మొగ్గుచూపుతారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల వారు ‘కసవు’ చీరల వైపు ఆసక్తిచూపుతారు. వీటి ధరలు ఒక్కొక్కటి రూ.300/- నుంచి లభిస్తాయి.
మహాబలి కేరళ రాజ్యానికి రాజు. ఇతని పరిపాలన కేరళలో స్వర్ణయుగంగా భావిస్తారు. బలి ఆగమనాన్ని పురస్కరించుకొని కేరళవాసులు సంబరం జరుపుకునే పండగే ఓనమ్. కేరళ ఘనమైన సంస్కృతీ వారసత్వంగా ఈ పండగ విశిష్టతను పొందింది. మలయాళీల ప్రాచీన వస్త్ర వైభవంగా ముండు, నెరియాతుమ్ పద్ధతులను విశేషంగా చెప్పుకుంటారు. జరీ అంచు గల ‘కసవు’ చీరలను అతివలు వేడుకలలో తప్పనిసరిగా ధరిస్తారు.
స్త్రీలు, పురుషులు ముండు పంచెలను ధరిస్తారు. స్త్రీలు సంప్రదాయ పద్ధతిలో ముండు (పంచె)ను ధరించి, ఉత్తరీయం (నెరియాత్తు) కుచ్చిళ్లుగా మలచి, జాకెట్టులోకి ముడుస్తారు. ఈ పద్ధతి బౌద్ధ, జైన విధానాలను అనుసరించి వచ్చినట్టుగా తెలుస్తోంది.
ఆభరణాల ప్రత్యేకత
కేరళ ఆభరణాలలో పెద్ద పెద్ద హారాలు ప్రత్యేకమైనవి. వీటిలో ముఖ్యమైనవి- కసు మాల(కాసులపేరు), పలాక్కమాల, నాగపడగ తాళి, కరిమని మాల, ముళ్లమొట్టు మాల, చేరుతళి, అడ్డియాల్, కశలి, పూతలి, జుంకీలు.. మొదలైనవి. కేరళ స్త్రీ వద్ద వీటిలో కనీసం ఒక్కటైన తప్పనిసరిగా ఉంటుంది. కేరళ కుటుంబాలు ఇప్పటికీ సంప్రదాయ ఆభరణాలనే ఇష్టపడుతున్నాయి. దాదాపు అన్ని రకాల ఆభరణాలలోనూ దేవాలయ శిల్ప కళ కనబడుతుంది. టెంపుల్ జువెల్రీలో విళక్కు మాల, ఎరుక్కుంపుమాల, సరపోలి మాల, వివదల మాల, మణి మాల.. ముఖ్యమైనవి. దాదాపు అన్ని ప్రసిద్ధ దేవాలయాలలోనూ తిరువాభరణం ధరించిన దేవతా మూర్తులు కనిపిస్తారు.
మన సంప్రదాయ వైభవాన్ని కళ్లకు కట్టే ఓనమ్ లాంటి వేడుకలకు వన్నెతెచ్చేవి సంప్రదాయ వస్త్రాలే. అలాంటి వస్త్రకళను వేనోళ్ల పొగడటమే కాదు, వేనవేలఏళ్లు ఆ కళను కాపాడుకుందాం అనే మలయాళీల మాట ఆచరణలో చూపాల్సిందే!
- నిర్మలారెడ్డి
తెలుపు, బంగారు వర్ణంలో ఉండే కేరళ చీరలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. చీరగానే కాకుండా వీటిని అనార్కలీ డ్రెస్, లంగా ఓణీలుగానూ తీర్చిదిద్దుకోవచ్చు. జరీ అంచుపైన జర్దోసి, మిర్రర్ వర్క్.. చేయవచ్చు. నీలం, ఎరుపు, ఆకుపచ్చ, నలుపు.. ఇలా ముదురు రంగు కాంబినేషన్స్ ఎంచుకొని కేరళ చీరలు, డ్రెస్‌ల మీద ధరించవచ్చు.
- అర్చితా నారాయణమ్, ఫ్యాషన్ డిజైనర్
ముండు అంటే పంచె. నెరియాతుమ్ అంటే పై వస్త్రధారణ. ఈ రెండు వస్త్రాలను ఉపయోగించి చేసే కట్టును ‘ముండు నెరియాతుమ్’ అంటారు. కేరళవాసుల సంప్రదాయ వస్త్రమైన ముండు దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీన సాంప్రదాయికతకు మిగిలిన ఆనవాలు.