సంస్కారం లేని చదువు వ్యర్థం!
ఆత్మీయం
కొందరికి తాము ఎంతో చదువుకున్నామని, అవతలి వారు ఏమీ చదువుకోలేదనీ, వారికి ఏమీ తెలియదనే భావన అణువణువునా ఉంటుంది. అయితే ఏవో కొన్ని పుస్తకాలు చదువుకున్నంతమాత్రాన విర్రవీగితే అంతకన్నా అహంకారం మరొకటి ఉండదు. ఉదాహరణకు ఒక గ్రంథాలయంలోకి మనం సమకూర్చుకున్న జ్ఞానం ఏపాటిదో అర్థమౌతుంది. నాకు అన్నీ వచ్చు అనుకున్నవాడు గొప్పవాడు కాదు. రానివెన్నో అనుకోవడమే గొప్ప. పర్వతాల గురించి అంతా చదువుకున్నవాడు, భూగోళ శాస్త్రమంతా చదివినవాడు ఆఖరున ఏమంటాడంటే... ‘‘నేను పర్వతాల గురించి చదివాను.
ఇన్నిరకాల నేలల గురించి చదివాను. ఎన్నోరకాల మైదానాలు, పీఠభూములను గురించి చదివాను. అసలు ఇన్ని పర్వతాలు, ఇన్ని మైదానాలు, ఇన్ని పీఠభూములు, ఇన్ని నదులు సృష్టించిన ఆ పరమాత్ముడు ఎంత గొప్పవాడో’’ అంటాడు. అది సంస్కారం. ఎందుకంటే, చదువు సంస్కారంతో కలసి ఉంటుంది. ఆ సంస్కారం లేకుండా, ఆ వినమ్రత లేకుండా ఊరికినే చదువుకోగానే సరిపోదు. అవతలివారి మనస్సు నొప్పించకుండా మాట్లాడటం తెలియాలి. మనం ఏమి చేస్తే ఎదుటివాళ్లు బాధపడతారో తెలుసుకుని ఉండాలి. అలా తెలియకపోతే ఆ చదువు ఎందుకూ పనికి రాదు.