ఉప్పు ఉఫ్ఫున ఆరోగ్యాన్ని ఊదేస్తుందట.
ఉప్పు చప్పున బీపీని తెచ్చేస్తుందట. ఇప్పుడు ఉప్పు గురించి ఉన్న ప్రచారాలివి.
మరి ఇందులో వాస్తవమెంత? అపోహ ఎంత? నిజంగానే ఉప్పు తెల్లటి విషమా?
ఉపయోగపడే విషయమేమీ ఉప్పులో లేదా? ఉప్పు ఇచ్చే ఆరోగ్యాలూ...
ఉప్పు తెచ్చే అనర్థాలను సాక్షాత్తూ ఆ ఉప్పే తన ఆత్మకథగా చెప్పుకుంటే ఏం చెబుతుంది?
తనపై ఉన్న అనేకానేక దురభిప్రాయాలను తొలగిస్తే ఎలా ఉంటుందన్న అంశమే ఈ ప్రత్యేక కథనం.
►రక్తనాళాల చివరన క్యాపిల్లరీస్ వెంట్రుకంత సన్నగా ఉంటాయి. దాంతో హైబీపీ వంటివి ఉన్నవారు ఉప్పు ఎక్కువగా వాడితే అధిక ఒత్తిడికి అవి చిట్లిపోవచ్చు.
►రక్తపోటు, గుండెజబ్బులు, డయాబెటిస్, కిడ్నీ సమస్యలు, కాళ్లవాపుల వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉప్పు చాలా తక్కువగా వాడాలి.
►డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సుల ప్రకారం ఒక వ్యక్తి ఒక రోజుకు గరిష్టంగా 4.2 గ్రాములకు మించనివ్వకుండా ఉప్పు తీసుకోవచ్చు.
మీరు పలికే తొలి తెలుగు పద్యానికి తొలి పదం నేనే. ‘ఉప్పుకప్పురంబు’తోనే కదా ఎవ్వరైనా తొలి పద్యం పలికేది. నేను మీ అందరి పౌరుషానికి ఒక చిహ్నం. అందుకే ఆత్మగౌరవంతో, పౌరుషంతో ఎవరైనా స్పందించకపోతే ‘ఏం ్ఞఉప్పూ కారం తినడం లేదా’ అంటారు. మరి అలాంటప్పుడు ఎందుకు నన్ను ఆడిపోసుకోవడం? మీ ఆహార పదార్థంలోని ‘ఉప్పూ కారం’ జంటలోనూ నేనే ముందు. తీపి మినహా ప్రతివంటలో భాగస్వామ్యం నాకే చెందు. నా ప్రాధాన్యం, నా ప్రాథమ్యం వదిలి ఇక నన్ను తినడం వల్ల మీకు వచ్చే ఆ ‘ఉప్పు ముప్పు’ గురించి చెప్పమంటారా? అమృతాన్నైనా అతిగా వాడితే అనర్థమే కదా. అందుకే ‘అతి సర్వత్ర వర్జయేత్’ అనే మాట పుట్టింది. అప్పుడు తప్పంతా నామీదే వేసేస్తే ఎలా?
మీ మెదడు సందేశాల వార్తాహారి నేనే...
మీలోని ప్రతి అవయవానికీ ఫలానా పని చేయమంటూ మెదడునుంచే ఆజ్ఞలూ, ఆదేశాలూ జారి అవుతుంటాయని తెలుసుకదా. వాటిని మోసుకుపోయే లవణాల్లో ప్రధానమైనదాన్ని నేనే. నాలోని సోడియమ్‌తో పాటు పొటాషియమ్, మెగ్నీషియమ్ వంటి ఇతర మిత్రులూ ఆ ఆదేశాలను మోసుకుపోయినా... అందులో ఎక్కువగా నేనే తీసుకెళ్తుంటా. నాలోని అయాన్ల సహాయంతోనే మన నాడీ వ్యవస్థలోని నరాల నుంచి వివిధ అవయవాలకు ఆ ఆదేశాలన్నీ అందుతుంటాయి. ఆ ఆదేశాలకు అనుగుణంగానే మన వివిధ అవయవాలన్నీ పనిచేస్తుంటాయి. అందుకే నరాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే నేను కావాల్సిందే. అందుకే మీ అవయవాలన్నీ సరిగా పనిచేసేంత పరిమిత మోతాదుల్లో నన్ను వాడుకోండి.
అర్ధరాత్రి అకస్మాత్తుగా మీకెప్పుడైనా పిక్క పట్టేసిందా?
మీరు హాయిగా ఆదమరచి నిద్రపోతుంటారు. కానీ మెదడు నుంచి ఆదేశాలను చేరవేసే నా పనిని నేను నిర్విరామంగా చేసుకుంటూ పోతుంటాను. అదెలా? ముందు చెప్పినట్టుగా నాలోని అయాన్ల ద్వారా. ఆ అయాన్లకు వాహకం నీళ్లు. ఏదైనా కారణంతో ఆ నీళ్లూ, ఈ నేనూ తగ్గామనుకోండి. అకస్మాత్తుగా పిక్క పట్టేస్తుంది. ఎంతో నొప్పితో మిమ్మల్ని నిద్రలేపేస్తుంది. ఆ బాధ చాలా సేపు కొనసాగుతుంది. మజిల్ క్రాంప్ అని పిలిచే ఈ నొప్పీ, బాధా కేవలం పిక్కకు మాత్రమే కాదు... ఒంట్లోని ఏ కండరానికైనా రావచ్చు. కారణం... నేను మజిల్ కంట్రాక్షన్ అనే ప్రక్రియ ద్వారా మీ కండరాల కదలికలకు నేను అవసరం. మీ కాళ్లూ చేతులు బాగా కదులుతున్నాయంటే అది నా వల్లే. అంతెందుకు మీరు క్రికెట్ ఆడారా? మీ ఒంట్లో నీళ్లు బాగా తగ్గినప్పుడు మీతో పాటు చాలా మంది క్రీడాకారులు క్రాంప్స్ కారణంగా ఆటలాడలేని పరిస్థితి వస్తుంది. అలా జరగగానే మీరు గ్రహించాల్సిందొకటే. మీ ఒంట్లో నీళ్లు... నేనూ... నా మిత్రులైన ఇతర లవణాలూ తగ్గాయని. డీహైడ్రేషన్ కారణంగా నీరూ, నేనూ, నా ప్రాణమిత్రుల్లాంటి లవణ మిత్రులు సరిగా అందకపోతే ఒక్కోసారి ప్రాణాలే పోవచ్చు.
నేను తగ్గితే ప్రాణాపాయం కూడా...
నేనూ, నా మిత్రులైన నీరూ లవణాలూ తగ్గి మీరు డీ–హైడ్రేషన్‌కు గురైనప్పుడు (మరీ ముఖ్యంగా వేసవిలో) నీళ్లలో చిటికెడు ఉప్పు, చారెడు పంచదార వేసి, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ తయారు చేసి, తక్షణ చికిత్సగా అందిస్తారు. ఇంకా చెప్పనా! నేను మీ ఒంట్లోని నీటి పాళ్లను నియంత్రిస్తుంటాను. అంతెందుకు... నన్నో శత్రువులా చూస్తూ నన్ను పట్టుబట్టి తగ్గించుకుంటే దాంతో నేనే గనకా మీలో ఉండాల్సిన
మోతాదులో లేకపోతే మీకు ‘హైపోనేట్రీమియా’ అనే మెడికల్ కండిషన్ రావచ్చు. అప్పుడు ఆసుపత్రిలో అందునా ఐసీయూలో చేర్చి మరీ నేను లోపించినందుకు మీకు చికిత్స అందించాల్సి రావచ్చు.
మరి నాతో అనర్థాలేమీ లేవా?
ఎందుకు లేవూ? ఉన్నాయి. కాకపోతే అవి నేరుగా నా వల్లనే కాదు. నేను మితిమీరడం వల్ల. అన్ని రక్తనాళాల చివరల్లో అత్యంత సన్నగా ఉండే నాళాలుంటాయి. అవి వెంట్రుక కంటే సన్నగా ఉంటాయి. అందుకే వాటిని తెలుగులో రక్త‘కేశ’నాళికలంటారు. ఇంగ్లిష్‌లో క్యాపిల్లరీస్ అంటారు. వెంట్రుకంత సన్నగా ఉండటం వల్ల వీటి గోడలు చాలా పలుచగా ఉంటాయి. దాంతో రక్తపు అధిక ఒత్తిడికి అవి చిట్లిపోవచ్చు. ఇలాంటి ప్రమాదం ప్రధానంగా కిడ్నీల విషయంలో ఎక్కువగా చూస్తుంటాం. అదే గుండె గోడల్లో జరిగితే వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు, మెదడుకు జరిగితే పక్షవాతం (స్ట్రోక్) వచ్చే అవకాశం ఉంది. అందుకే నా మోతాదును తగ్గించాలని డాక్టర్లు మొదలుకొని అందరూ సలహా ఇస్తుంటారు. అందుకే రక్తపోటు, డయాబెటిస్, గుండెజబ్బులు, పక్షవాతం వంటి సమస్యలు ఉన్నవారు నన్ను చాలా తక్కువగా తీసుకోవాలంటూ సలహా ఇస్తుంటారు.
స్వతహాగానే నేను ఎక్కువగా ఉండే పదార్థాలివి...
నేనెక్కువైతే ప్రమాదమని తెలిసింది కదా. అందుకే నేను ఎక్కువగా ఉండే ఆహారాలేమిటో తెలుసుకొని వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. మామూలు వాళ్లతో పోలిస్తే రక్తపోటు, గుండెజబ్బులు, డయాబెటిస్, కిడ్నీ సమస్యలు, కాళ్లవాపులు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నేనెక్కవ పాళ్లలో ఉండే ఆహారాన్ని పరిహరించాల్సిందే. అవి... ∙అప్పడాలు, ∙పచ్చళ్లు, ∙బేకరీ ఐటమ్స్, ∙సాస్, ∙నిల్వ ఉంచే ఫ్రోజెన్ ఫుడ్స్, ఫాస్ట్‌ఫుడ్స్, ∙స్మోక్‌డ్ మాసాహారం, ∙చీజ్, ∙సలాడ్స్, ∙సాల్టెడ్ చిప్స్ వంటి నిల్వ ఉంచే చిరుతిండ్లు, ∙దీర్ఘకాలం నిల్వ ఉంచేందుకు వీలుగా (షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉండేలా) రూపొందించిన శ్నాక్స్. వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
నా నియంత్రణలో చాలా బాధ్యత కిడ్నీదే!
నా వల్ల కలిగే కీడెంతో, మేలెంతో తెలిసింది కదా. మోతాదుకు మించితేనే నా వల్ల ప్రమాదమని అర్థమైంది కదా. ఈ విషయం తెలియని వాళ్లు నన్ను తగ్గించేందకు చాలా పరిమితంగా నన్ను వాడుతుంటారు. దాంతో వాళ్ల ఒంట్లో నా పాళ్లు తగ్గాయనుకోండి. ఆ పరిస్థితిని గుర్తించి చక్కబెట్టే బాధ్యత మూత్రపిండాలది. శరీరంలో ఉప్పు తగ్గినట్లుగా కిడ్నీలకు ‘ఉప్పందుతుంది’. దాంతో అవి తమ బాధ్యతను మొదలుపెడతాయి. శరీరంలోంచి మూత్రం ద్వారా నేను అనగా ఉప్పు బయటికి పోయి ముప్పు రాకూడదంటూ అవి నన్ను అడ్డుకుంటాయి. తమ దగ్గర ఉండాల్సిన బ్యాలెన్స్ కంటే ఎక్కువగా ఉన్న ఉప్పును తమ వద్ద నిల్వ చేసి ఉంచి శరీరానికి అందిస్తుంటాయి. అదే శరీరంలో ఉప్పు పాళ్లు పెరగగానే మళ్లీ యథావిధిగా మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. అందుకే చాలా మంది ఇంట్లో తినే తిండిలో నా పాళ్లను తగ్గించినా అప్పుడప్పుడూ వాళ్లు బయటతినే పదార్థాల్లో లభ్యమైన నన్ను జాగ్రత్తగా పోగు చేసి శరీరానికి అందిస్తూ నా కొరత తీరుస్తాయి కిడ్నీలు. కొందరిలో ‘సోడియమ్ సెన్సిటివిటీ’ అనే గుణం ఉంటుంది. ఆ గుణం ఉన్నవారు నన్ను ఎంత పరిమితంగా తీసుకున్నా వారిలో రక్తపోటు పెరిగి ప్రమాదాలకు దారి తీయవచ్చు.
ఉప్పుసంహారం.. సారీ... ఉపసంహారం...
ఇదీ నా కథ. నేను అనగా ఉప్పు వల్ల ముప్పుతో పాటు నేను తగ్గితే ప్రమాదమూ ఉంది. ఉప్పుతో బీపీ పెరిగే మాటా నిజమే. అది గ్రహించే గాంధీగారు ఉప్పు సత్యాగ్రహం చేస్తే... బ్రిటిష్ వాళ్లకు బీపీ పెరిగి రాజకీయారోగ్యం క్షీణించి మనల్ని వదిలిపోయారు. దరిమిలా తేలేదేమిటంటే... నన్ను వాడుకోవాల్సిన రీతిలో వాడుకుంటే నేనెప్పుడూ ఉపయోగమే. నాతోనూ ఉంది కొంత మేలు. అది మీరు గ్రహిస్తే చాలు.
ఉప్పు విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
హైబీపీ, డయాబెటిస్, గుండెజబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్, కాళ్లవాపులు (అనసార్కా/ఎడిమా) ఉన్నవారికి మాత్రమే ఉప్పు చాలా పరిమితంగా తగ్గించాలి. ఒకవేళ ఏదైనా కుటుంబంలో హైబీపీ, డయాబెటిస్, గుండెజబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్, కాళ్లవాపులు ఉన్నవారు ఉన్న కుటుంబంలో ప్రత్యేకంగా ఆ జబ్బుతో బాధపడేవారు (అంటే మెడికల్ రీజన్‌తో మాత్రమే ఉప్పు తగ్గించాలి తప్ప... ఇంట్లోని పిల్లలకూ కాదు. పిల్లలు మామూలుగానే ఉప్పు వాడేలా చూడాలి. పెద్ద వయసు వారిలో ఏ ఆరోగ్య సమస్యా లేనప్పుడు ఉప్పు పరిమితంగానే వాడాలి తప్ప అస్సలు మానేయకూడదు. అలా వాళ్లలో సోడియమ్ తగ్గడం వల్ల ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు.
గర్భిణులూ జాగ్రత్త...
కొందరు ఉప్పు తగ్గించి తినాలనే వారు చాలా పరిమితంగా ఉప్పు వాడుతుంటారు. అలాంటి కుటుంబంలో ఉండే గర్భవతులు ఒకింత జాగ్రత్తగా ఉండాలి. మిగతావారి విషయం ఎలా ఉన్నా గర్భవతులు రోజుకు 2 నుంచి 6 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. అంతకు మించి తీసుకోవడం కూడా ప్రమాదమే అని గుర్తుంచుకోవాలి. గర్భవతుల్లో ఉప్పు పాళ్లు బాగా తగ్గితే కడుపులోని బిడ్డ బరువు బాగా తగ్గి అండర్‌వెయిట్ బేబీగా పుట్టవచ్చు. లో బర్త్ వెయిట్ పిల్లల్లో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. పైగా గర్భిణులు 2 గ్రా. నుంచి 6 గ్రా. ఉప్పు కూడా తీసుకోకపోతే బిడ్డలో మానసిక వికాసం కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
ఉప్పును ఎంత మోతాదులో వాడాలి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫార్సు ప్రకారం : డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సుల ప్రకారం ఒక వ్యక్తి ఒక రోజుకు గరిష్టంగా 4.2 గ్రాములకు మించనివ్వకుండా ఉప్పు తీసుకోవచ్చు. (ఒక టీ స్పూన్‌లో 5 గ్రాముల పరిమాణం పడుతుంది). ∙అలాగే ఒక వ్యక్తి ఒక రోజుకు కనీసం 1.5 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. అంతకంటే తగ్గడం వల్ల అతడికి అవసరమైన సోడియమ్ పరిమాణానికి, జీవక్రియలకు విఘాతం కలగవచ్చు. ∙ఇక చిన్నపిల్లల విషయానికి వస్తే వారి వయసును బట్టి వాళ్లకు అవసరమైన ఉప్పు వివరాలివి... ∙1 నుంచి 3 ఏళ్ల పిల్లల్లో ... రోజుకు 2 గ్రాముల ఉప్పు ∙ 4 నుంచి 6 ఏళ్ల పిల్లల్లో ... రోజుకు 3 గ్రాముల ఉప్పు ∙7 నుంచి 10 ఏళ్ల పిల్లల్లో ... రోజుకు 5 గ్రాముల ఉప్పు ∙11 ఏళ్లు మించిన పిల్లలకు రోజుకు 6 గ్రాముల ఉప్పు... కావాలి.
ఒంట్లో ఉప్పు బాగా తగ్గితే
కనిపించే లక్షణాలు : శరీరంలో ఉప్పు పాళ్లు బాగా తగ్గితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో సోడియమ్ పాళ్లు తగ్గడం వల్ల ఆ లక్షణాలు కనిపిస్తాయి. అవి... తీవ్రమైన అలసట (ఫెటీగ్) ∙తలనొప్పి (హెడ్‌ఏక్) ∙కండరాలు బిగుసుకుపోవడం (మజిల్ క్రాంప్స్) ఒంట్లో ఉప్పు పాళ్లు బాగా పెరిగితే కనిపించే లక్షణాలు: ∙విపరీతమైన దాహం ∙కింది నుంచి గాలి అపానవాయువు రూపంలో పోవడం.
Comments
Please login to add a commentAdd a comment