‘‘నాన్నా! నీకు కొడుకుల్లేరని దిగులు వద్దు. నేనే కొడుకుని’’ ఈ డైలాగ్ సినిమాల్లో చూస్తుంటాం. కేరళలోని శ్రీదేవి ‘‘నాన్నా! నీకు కొడుకుని నేనే’’ అని అనట్లేదు. కానీ ‘‘నాన్నా! నేనున్నాను’’ అని తండ్రికి భరోసా ఇచ్చింది. లాక్‌డౌన్‌లో ఇంటికి ఆసరా అయింది. శ్రీదేవి గోపాలన్‌కి పాతికేళ్లు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, బీఈడీ ఫైనల్ ఇయర్‌లో ఉంది. ఈ వేసవి గడిస్తే టీచర్‌గా ఉద్యోగం సంపాదించుకోవచ్చు... అనుకుంది. కరోనా లాక్‌డౌన్ కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆమె తండ్రి గోపాలన్ కొబ్బరి చెట్ల నుంచి కాయలు దింపుతాడు. ‘‘ఆ సంపాదనతో ముగ్గురి కూతుళ్లను పెంచి పెద్ద చేయడం, కాలేజీ చదువులు చదివించడం చిన్న విషయం కాదు. అయినా సరే... మా నాన్న ఏనాడూ తనకు పుట్టింది కూతుళ్లు మాత్రమే.
కొడుకులు లేరు... అని బెంగ పడలేదు. ముగ్గురినీ చదివిస్తున్నాడు. అలాంటిది ఈ లాక్‌డౌన్ కాలం ఆయనను మానసికంగా కుంగదీసింది. వయసు పెరగడం, లాక్‌డౌన్ మొదటినెలల్లో ఎవరూ పనికి పిలవలేదు. చేతిలో పని లేకపోవడం, ఇంటి ఖర్చులేవీ తప్పక పోవడంతో బాగా ఆందోళనకు గురయ్యారు. అమ్మతో ‘కొడుకు ఉండి ఉంటే... చేదోడుగా ఉండేవాడు’ అన్నాడు. ఆ మాటతో నా మనసు కదిలిపోయింది. ‘‘కొబ్బరి కాయలు దించడానికి నేను కూడా వస్తాను నాన్నా’’ అంటే ఒప్పుకోరని తెలుసు. అందుకే అమ్మానాన్నలకు చెప్పకుండా యూ ట్యూబ్‌లో కొబ్బరి చెట్టు ఎక్కడం, కాయలు దింపడం చూశాను. కొబ్బరి చెట్లు ఎక్కడానికి ఉపయోగించే సాధనాలను మా చెల్లెళ్లు ఆన్‌లైన్‌లో బుక్ చేశారు.
ఆ సాధనంతో నేను స్వయంగా కొబ్బరి చెట్లు ఎక్కడం నేర్చుకున్నాను. పని కూడా వెతుక్కున్నాను. ఒక చెట్టు నుంచి కాయలు దింపితే నలభై రూపాయలు వస్తాయి. రోజుకు ఇరవై చెట్ల పని ఉంటుంది. నేను పనికి వెళ్లడం చూసి నాన్న తాను కూడా నాతో వస్తానన్నారు. చెట్టు మీద ఎక్కువ సేపు స్థిరంగా ఉండడం, కోత దశకు వచ్చిన కాయలను గుర్తించడం నేర్పించారు నాన్న. ఈ పనితో మా ఆర్థిక ఇబ్బందులు తీరిపోయాయి. కానీ అమ్మ మాత్రం చాలా బాధ పడుతోంది. ‘ఇంత చదివించింది చెట్లెక్కి కొబ్బరి కాయలు కోయడానికా’ అని ఒకరు, ‘నువ్వు కన్నది కూతుర్ని... ఆడపిల్ల చేసే పనులేనా ఇవి’ అని మరొకరు బంధువులు, ఇరుగుపొరుగు వాళ్లు రకరకాలుగా దెప్పుతున్నారని కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు నాన్న ‘‘నా కూతుర్ని చూస్తే గర్వంగా ఉంది. నా కూతురి చేతికింద పని చేస్తున్నందుకు సంతోషంగా కూడా ఉంద’’న్నారు.
కోవిడ్ చాలా నేర్పిస్తోంది
కోవిడ్ మనలో దాగి ఉన్న చాలా నైపుణ్యాలను వెలికి తీస్తోంది. మనల్ని మనం పోషించుకోవడానికి మన ఎదురుగా ఉన్న మార్గాలన్నింటినీ అన్వేషిస్తాం. కొబ్బరి కాయలు కోయడంతో వచ్చిన డబ్బు ఇంటి ఖర్చులు పోను మిగిలిన డబ్బుతో సెకండ్ హ్యాండ్ ఆటో కొన్నాం. కాయల రవాణా కూడా చేస్తున్నాం. నాన్నకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. నేను నాన్న దగ్గర డ్రైవింగ్ నేర్చుకున్నాను. కోవిడ్ మహమ్మారి ఇంతలా జీవితాల మీద దాడి చేయకపోయి ఉంటే... బీఈడీ తర్వాత టీచర్ ఉద్యోగం కోసం మాత్రమే ప్రయత్నించేదాన్ని. నేను ఇన్ని పనులు చేయగలుగుతాననే విషయం ఎప్పటికీ తెలిసేది కాదు కదా’’ అని నవ్వుతోంది శ్రీదేవి. ప్రతికూల పరిస్థితుల్లో సానుకూలంగా స్పందించడం అంటే ఇదే. ‘పాజిటివ్’ అనే పదమే భయపెడుతున్న పరిస్థితిని ఎదుర్కోవడానికి పాజిటివ్ దృక్పథం అవసరం. అనారోగ్యాన్ని ఎదుర్కోవడానికైనా, జీవికను గాడిలో పెట్టుకోవడానికైనా.
అమ్మానాన్న, చెల్లెళ్లతో శ్రీదేవి
Comments
Please login to add a commentAdd a comment