శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది కాబట్టి శ్రీరాముడిని పూజించిన తరువాత కొత్తకుండలో మిరియాలు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి పంచి పెడతారు. ఈ ప్రసాదాల వెనుక ఆయుర్వేదిక పరమార్థం కూడా ఉంది. భగవంతుడికి నివేదించే ప్రసాదాలు అన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని ప్రసాదిస్తూ, ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
అదే కాకుండా పానకం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది.అలాగే పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది, జీర్ణశక్తిని వృద్ధి పరుస్తుంది, దేహకాంతినిస్తుంది. పెసరపప్పునే వడపప్పు అంటారు ఇది మండుతున్న ఎండలలో ‘వడదెబ్బ’ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుంది. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది కాబట్టి, దీనిని తీసుకోవడం వల్ల బుద్ధి వికసిస్తుందని పండితుల మాట.
వడపప్పు తయారీ
కావలసినవి: పెసర పప్పు – ఒక కప్పు; కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు; క్యారట్ తురుము – ఒక టేబుల్ స్పూను; పచ్చి మిర్చి తరుగు – 2 టీ స్పూన్లు; నిమ్మరసం – 2 టీ స్పూన్లు; ఉప్పు – కొద్దిగా
తయారీ: ∙ముందుగా పెసరపప్పును సుమారు మూడు గంటల సేపు నానబెట్టి, నీళ్లు ఒంపేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ కొబ్బరి తురుము, కొత్తిమీర తరుగు, క్యారట్ తురుము, పచ్చి మిర్చి తరరగు, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలిపి, సుమారు అర గంట తరవాత తింటే రుచిగా ఉంటుంది.
పానకం తయారీ
కావలసినవి: నీళ్లు – 4 కప్పులు; బెల్లం పొడి – రెండు కప్పులు; ఏలకుల పొడి – టీ స్పూను; మిరాయల పొడి – రెండు టీ స్పూన్లు. తయారీ: ∙ముందుగా ఒక పెద్ద పాత్రలో నీళ్లు, బెల్లం పొడి వేసి బెల్లం కరిగేవరకు బాగా కలపాలి ∙ఏలకుల పొడి, మిరియాల పొడి జత చేసి మరోమారు కలపాలి ∙ గ్లాసులోకి తీసుకుని తాగాలి.
Comments
Please login to add a commentAdd a comment