టార్జాన్
1985లో రిలీజైన ‘టార్జాన్’ ఫ్లాపా యావరేజా హిట్టా సూపర్‌హిట్టా ఎవ్వరూ చెప్పలేరు. కాని చాలామంది ఈ సినిమాను రకరకాల కారణాల వల్ల చూశారు. టార్జాన్ కథ అప్పటికే బాలసాహిత్యం ద్వారా పాప్యులర్ కావడం ఒక కారణమైతే నేషనల్ జియోగ్రఫిక్ వంటి చానెల్స్ అందుబాటులో లేని రోజుల్లో అడవులు చూపించే ఏ సినిమా అయినా చూడాలనే కుతూహలం ప్రేక్షకులకు ఉండేది. దానికి తోడు దర్శకుడు బి.సుభాష్ తెలివిగా కిమి కాట్కర్ అందాలను ఆరబోయడంతో ఈ సినిమా మాస్ ప్రేక్షకులందరినీ ఊపేసింది. ఆ రోజులో అలా తెర మీద ఒక హీరోయిన్‌ని దాదాపు నగ్నంగా చూపడం పెద్ద విశేషం.
టార్జాన్‌గా నటించిన హేమంత్ బిర్జే కన్నడిగుడు. ఎత్తుగా కండలతో ఉండటం తప్ప యాక్టింగ్‌లో పస లేకపోవడం వల్ల రాణించలేదు. కిమి మాత్రం మరికాస్త ముందుకెళ్లి అమితాబ్‌తో ‘హమ్’ వంటి సినిమాల వరకూ నటించింది. ప్రస్తుతం ఆమె ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ శంతనును పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియాలో లేదంటే పుణె శివార్లలో ఇండస్ట్రీకి దూరంగా జీవిస్తోంది. టార్జాన్‌కు బప్పి లాహిరి చేసిన పాటలు పెద్ద హిట్. జిలేలే జిలేలా ఆయొ ఆయొ జిలేలా..... మేరే సాత్ గావోనా జూబీ జుబి జుబి జూబీ... టార్జాన్ మై టార్జాన్... ఆ రోజుల్లో మోగిపోయాయి. ఆ సినిమా వచ్చాకే చిరంజీవి ‘అడవి దొంగ’ రావడం యాదృచ్చికం కాదు.