ఆదాయం
పంచ సూత్రాలు
భవిష్యత్‌లో అత్యవసర పరిస్థితుల కోసం ఎంతో కొంత పొదుపు చేయాలన్నది నిర్వివాదాంశం. కానీ అన్నింటి రేట్లు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో.. ఎంత ఆదాయం వచ్చినా ఏ మూలకూ సరిపోని పరిస్థితి. ఇలాంటప్పుడు పొదుపు అనేది అనుకోవడానికి మాత్రమే పరిమితమై.. ఆచరణలో పెట్టాలంటే అసాధ్యంగా ఉంటుంది. అయితే, ఇందుకోసం మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. ట్రై చేసి చూడండి..
మ్యాజిక్ వర్డ్ పెట్టుకోండి ..
భవిష్యత్‌లో తలెత్తే ఏదో ఒక అవసరం కోసమని సర్ది చెప్పుకుంటూ పొదుపు విషయాన్ని ఒకోసారి అలక్ష్యం చేయొచ్చు. ఈ కాస్తే కదా అని దుబారాలు చేసే అవకాశమూ ఉంది. అలా కాకుండా ఎందుకోసం పొదుపు చేస్తున్నామన్నది నిరంతరం గుర్తుండేలా ఏదో ఒక మ్యాజిక్ పదం పెట్టుకోండి. ఉదాహరణకు వాహనం కోసం పొదుపు చేస్తున్నారనుకుందాం. అలాంటప్పుడు ఆన్‌లైన్ షాపింగ్‌పై అనవసర ఖర్చులు చేయకుండా పాస్‌వర్డ్ కింద సేవింగ్4కార్ అనో మరో లక్ష్యం అయితే దానికి తగ్గట్లుగా మరొకటో పాస్‌వర్డ్ పెట్టుకోవచ్చు. సదరు పాస్‌వర్డ్‌ను టైప్ చేసిన ప్రతిసారీ లక్ష్యం గుర్తుకొచ్చి.. అనవసర ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు.
అలాగే.. షాపింగ్‌కి వెళ్లినప్పుడు గాజులో, ఇయర్ రింగ్సో మరొకటో మురిపిస్తుంటాయి. అవి మనకు నప్పవని తెలిసినప్పటికీ, అనవసరం అనిపించినప్పటికీ .. అప్పటికప్పుడు మాత్రం కొనేయాలనిపించి తెచ్చేస్తుంటాం. ఈసారి అలాంటివి కొనాలనిపించినప్పుడు.. ఆయా ఉత్పత్తుల రేటు చూసి.. అంత మొత్తాన్ని మీ అకౌంటులో నుంచి పొదుపు ఖాతాలోకి మళ్లించండి. నెల చివర్లో జమయిన దాన్ని బట్టి చూస్తే.. ఎంత వధా ఖర్చును నియంత్రించుకోగలిగారో తెలుస్తుంది.
నంబర్ గేమ్ ..
ఒకటి.. రెండు.. మూడు .. ఇలా ఏదో ఒక నంబరు ఎంచుకోండి. ప్రతి రోజూ రాత్రి మీ పర్సులో ఆ నంబరుతో ముగిసే కరెన్సీ నోటు ఏదైనా ఉందేమో చూసి.. దాన్ని తీసి పక్కన పెట్టండి. వారం రోజులు తిరిగేసరికి మీరు రెగ్యులర్‌గా చేసే పొదుపు మొత్తానికి ఇది అదనంగా తోడవుతుంది.
సెట్ చేయండి.. వదిలేయండి..
శాలరీ అకౌంటులో జీతం పడగానే కొంత మొత్తం పొదుపు ఖాతాలోకి మళ్లే విధంగా ఆటోమేటిక్‌గా సెట్ చేసి ఉంచండి. దీంతో పొదుపు కోసం కేటాయించిన దానికి పోగా మిగిలినదే సరిపెట్టుకోవడం అలవాటవుతుంది. ముందుగా.. ఒక్క రోజు శాలరీలాగా చిన్న మొత్తంతో మొదలుపెట్టండి. క్రమక్రమంగా వెసులుబాటును బట్టి పెంచుకుంటూ పోవచ్చు.
డీల్స్‌ను ఉపయోగించుకోండి..
పండుగలప్పుడు, ఇతరత్రా ప్రత్యేక సందర్భాల్లోనూ రిటైలర్లు డిస్కౌంట్లు ఇస్తుంటారు. దీన్ని కూడా పొదుపు కోసం ఉపయోగించుకోవచ్చు. ఆఫర్లలో ఏదైనా కొన్నప్పుడు .. అసలు ధర, డిస్కౌంటు ధరకు మధ్య వ్యత్యాసాన్ని పొదుపు ఖాతాలోకి జమచేసి చూడండి.
ఫైన్ వేసుకోండి..
ఎంత కాదనుకున్నా ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక్కటైనా బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. ఊసుపోక యూట్యూబ్ వీడియోల్లో మునిగిపోవడమో.. అయిన దానికి కాని దానికి అందరి మీదా అరిచేయడమో ఇలా ఏదో ఒకటి ఉండొచ్చు. ఇలా చేసిన ప్రతిసారీ మీకు మీరు ఫైన్ విధించుకుని కొంత మొత్తాన్ని డిబ్బీలో వేయండి. క్రమక్రమంగా అందులో డబ్బూ పోగవుతుంది.. ఫైన్ సంగతి గుర్తొచ్చి మెల్లమెల్లగా అలవాటునూ తగ్గించుకునే అవకాశమూ ఉంటుంది. కేవలం చెడు హ్యాబిట్సే కాకుండా మంచి అలవాట్లకు కూడా దీని వర్తింప చేసుకోవచ్చు.