నేను నారీ శక్తి! | women empowerment:special chit chat winners | Sakshi
Sakshi News home page

నేను నారీ శక్తి!

Published Sat, Mar 10 2018 1:04 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

women empowerment:special chit chat winners - Sakshi

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం న్యూఢిల్లీలో ‘నారీశక్తి’ అవార్డు అందుకున్న ‘ఆలిండియా మిల్లెట్‌ సిస్టర్‌ నెట్‌వర్క్‌’ సభ్యులు సుమిత్ర, స్వరూప, చంద్రమ్మ.

‘పంచగవ్యం’. సంస్కృత పదం అని తెలియదు. పంచగవ్యం చేశారు, పంటలు పండించారు! రసాయన మందుల పేర్లు తెలియదు. చీడపీడలొస్తే బెల్లం నీళ్లు చల్లి పోగొట్టారు. చేలో ధాన్యం రాశి పోశారు. కాపలాగా పొలంలోనే పడుకున్నారు.

రైతంటే మగవాళ్లే కాదు. మహిళలు కూడా.  నేలను, ఒంట్లో శక్తిని నమ్ముకుంటే ఒకరికి చేయి చాచే పనే లేదంటున్నారు. వీళ్లు పుస్తకాలను చదవలేదు. నేలను చదివారు. గింజలను చదివారు. సిద్ధాంత పత్రాలకు కంటెంట్‌ ఇస్తున్నారు! జేబు నింపే పంటలు కాదు, కడుపు నింపే పంటలు కావాలంటున్నారు. వీళ్లు... ‘నారీశక్తి’ అవార్డును అందుకున్న రైతు మహిళలు.

చేసిన కష్టం ఊరికే పోతుందా?!
నాకప్పుడు ముప్పైఐదు ఏళ్లుంటయ్యేమో. భర్త పోయిండు. ఐదుగురు పిల్లలు. అత్తమామలు ముసలోళ్లు. కొడుకును పోగొట్టుకున్న దుఃఖాన్ని దిగమింగుకుని నాకు ధైర్యం చెప్పారు. ‘ఆడి పాలికొచ్చిన పొలం ఇది’ అంటూ ఒకటిన్నర ఎకరా ఇచ్చారు. ఆ పొలంతో ఏడాదంతా అన్ని కడుపులు ఎలా నిండాలె? నేలనే నమ్ముకున్న, నా ఒంట్లోని శక్తినే నమ్ముకున్న. పంటలు పెట్టిన. రోజంతా పొలంలో వంచిన నడుము ఎత్తకుండా పని చేసిన. జొన్నల రాశి కాడ కాపలా పండుకున్న. రాశికాడ కాపలా పడుకోవడం మగాళ్ల పని అనుకుంటే నేను మగాణ్ని ఎక్కడ తెచ్చేది. మూటలు మోసిన, గడ్డి మోపులు మోసిన... ఇది మొగోళ్ల పని అనుకున్ననా? ఇదీ అంతే. నాతోపాటు మరొకామె ఉండేది. ఆమెకీ మొగుడు లేడు. ఇద్దరం రాత్రిళ్లు పొలంలో ధాన్యం రాశులకు కాపలా కాశాం. చేసిన కష్టం ఊరికే పోతుందా! ఏడాదంతా తినడానికి పోగా మిగులు పంట చేతికొచ్చేది. ఏటా అర్ధ ఎకరా, ఒక ఎకరా కొంటూ వచ్చిన. ఇప్పుడు ఇరవై ఎకరాలకు ఆసామిని నేను. నేలను, శక్తిని నమ్మితే చేయి చాచి అడుక్కోవాల్సిన గతి పట్టదు, ఒకరికి కడుపు నిండా పెట్టే వాళ్లమవుతాం. 

అదే సాగో తెల్వదు!
అప్పట్లో.. అంటే ముప్పై ఏళ్ల కిందట మాకది సేంద్రియ సేద్యం అని తెలీదు. ఇప్పుడు టీవీల్లో అదే పనిగా  చెప్తున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివినోళ్లు కూడా ఉద్యోగాలొదిలి ఈ సేద్యం చేయడానికి వస్తున్నారంట. పెద్ద పెద్ద కంపెనీ వోళ్లు కూడా ఈ సేద్యం చేయడానికి వందల ఎకరాలు గుత్తకి కొంటున్నారట. అప్పట్నుంచి మేము చేస్తున్న పనికి ఇప్పుడు ‘నారీ శక్తి’ అని ఢిల్లీలో రాష్ట్రపతి అవార్డు ఇచ్చిన్రు. 
– మొలిగెరి చంద్రమ్మ, బిడకన్యె, సంగారెడ్డి జిల్లా  ‘నారీశక్తి’ అవార్డు గ్రహీత 

గింజల్ని వాళ్ల చేతుల్లో పెట్టొద్దు
మాలాగ సేద్యం చేయాలని దేశదేశాల్నించి వస్తున్నారంట. పెద్దోళ్లకు మేము చెప్పేదొక్కటే. తరతరాలుగా మన నేల ఆస్తులైన మన పంటలను, గింజలను వాళ్ల చేతిలో పెట్టొద్దు. మన కొర్రల్లాంటివే కినోవా అంట. అక్కడెక్కడో పండుతాయంట. వాటిని మన దగ్గర కిలో పద్నాలుగు వందలకు అమ్ముతారంట. కొర్రలు అరవై రూపాయలకొస్తాయి. కార్పొరేటోళ్లకు మన గింజలను ధారాదత్తం చేస్తే మన జొన్నలు, కొర్రలను కూడా కిలో వెయ్యి రూపాయలు పెట్టి వాళ్ల డబ్బాల్లో, ప్యాకెట్లలో కొనాల్సిందే. 

చదువుకునేటోళ్లు అడుగుతుంటరు
నాకు మెడలో పుస్తె కూడా లేకుండే. నా భర్త పటేల్‌ గడిలో పని చేసేటోడు. పిల్లలు గొర్రెలు కాసేటోళ్లు. నేను పని చేసుకుని నాలుగు గింజలు పండించుకోవడానికి చిన్న మడి ఉండేది. కూలికి పోతే రోజుకు ఐదు రూపాయలొచ్చేవి. చంద్రవ్వలాగ చానా మంది మందుల్లేని వ్యవసాయం చేసి దండిగ పండించేటోళ్లు. మాకు చేతనైన పని ఇదొక్కటే. దీన్లనే నేర్చుకోవాలె. దీన్లనే బతకాలె. అందుకే పని చేస్తూ నేర్చుకున్నా. ఇప్పుడు ముప్పై రకాలు పండిస్తున్నా. యాభై రకాల గింజలను తెలుసుకున్న. గింజను చూడగానే అదేం గింజో చెప్పేస్తాను. ఆ పంటకు ఎన్ని రోజులు పడుతుంది, ఏ కాలం నాటాలి.. అన్నీ చెప్పేస్తా. వ్యవసాయం చేయడంలో పెద్ద చదువులు చదివినోళ్లకు కూడా ఇన్ని గింజలు తెలియవు. ప్యాకెట్‌ మీద పేరు లేకపోతే అదేం గింజో చెప్పలేరు. యూనివర్శిటీల వాళ్లు మా పొలాలకొచ్చి నోట్స్‌ రాసుకుంటున్నారు.

ఆడబిడ్డకు కష్టం వస్తే మేముంటాం!
మహిళా రైతులు సంఘంగా మారి పనులు చేసుకోవడంతో ఒకరికొకరం అండ అవుతున్నాం. ఏ ఆడపిల్లనైనా కష్టపెడుతున్నారని తెలిస్తే మేమంతా వెళ్లి నిలబడతాం. ‘పెళ్లయిన నాలుగైదేళ్లకు ఈ భార్య నాకొద్ద’ని పుట్టింట్లో వదిలి పెట్టిన మొగుళ్లను పిలిచి మాట్లాడుతాం. దారికి రాకపోతే ఆ అమ్మాయి తరఫున మేమే పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టి దారికి తెస్తాం. జిల్లా ఎస్‌పి దగ్గరకు పోయి మాట్లాడినం కూడ.
భర్త చనిపోయిన అత్తమామలు పొలం ఇవ్వకుండా ‘ఆడే పోయాక ఇక నీతో మాకేం సంబంధం’ అని ఆడపిల్ల ఉసురుపోసుకునే వాళ్లుంటారు. ఆ ముసలోళ్ల దగ్గరకు మేమెళ్లి ‘ఆ బిడ్డ ఎలా బతకాలే’ అని నచ్చచెప్పి పొలం ఇప్పిస్తాం. వినకపోతే కేసు, కోర్టులకు వెళ్లడానికి కోడలికి మేము తోడుంటామని వాళ్లకి తెలుసు. అందుకే మా మాట వింటారు. ఇప్పుడు పటేళ్లు కూడా ఊర్లలో పంచాయితీ వస్తే మమ్మల్ని పిలిపిస్తున్నారు.
– దండు స్వరూప, ఎడాకుల పల్లి, సంగారెడ్డి జిల్లా, ‘నారీశక్తి’ అవార్డు గ్రహీత 

మమ్మల్ని చూసి తిండిపంటలేస్తున్నరు
రైతు అంటే మగవాళ్లనే చూపిస్తారు. టీవీలు,పేపర్లు కూడా అంతే. ఓసారి మా పొలాల్లోకొచ్చి చూస్తే తెలుస్తుంది రైతులంటే మగాళ్లు మాత్రమే కాదని. మగాళ్లు పైసల పంటలేస్తుంటే మేము తిండి పంటలేస్తున్నం. ఆడోళ్లమంతా గింజధాన్యాల పంటలు పెట్టాం, పక్కన మగాళ్లు పత్తి పంట పెట్టారు. మా పంట గింజపట్టి కంకులు చేతినిండుగా వచ్చాయి. అంతలో ఎక్కడి నుంచి వచ్చాయో పిట్టలు. కంకికి నాలుగు చొప్పున వాలి తింటుంటే మనసు ఉసూరుమన్నది. రాత్రిళ్లు నిద్ర పట్టేది కాదు. ఆ చిన్న ప్రాణులకు కడుపు నింపుకోవడానికి దేవుడు మా పొలాలని చూపించాడు. మా కడుపులు నిండే దారి కూడా ఆ దేవుడే చూపిస్తాడని మిన్నకున్నం. పంట సగమే చేతికొచ్చింది.  ‘మీ పంటలు కడుపు నింపడం లేదు, అందుకే పక్షులు మా పొలాలకే వస్తున్నాయి, మీరూ కడుపు నింపే పంటలేయచ్చు కదా’ అని ఓ సారి మాట వరసకన్నాం. వచ్చే ఏడాది తాము కూడా చిరుధాన్యాలే వేస్తామంటున్నారు.

తెలుగుళ్లకు బెల్లం నీళ్లు చల్లుతం
మేము రైతులం మాత్రమే కాదు. ఊరికి ఊతమిచ్చే శక్తిగా మారాం. మా చంద్రవ్వ తరంలో ఆడపిల్లలకు ఐదేళ్లకే పెళ్లి చేసేవారు. ఇప్పుడు ఆడపిల్లలను, మగపిల్లలను చదివిస్తున్నాం. పద్దెనిమిది నిండాకే పెళ్లి చేస్తున్నాం. మైనర్‌ బాలికకు పెళ్లి చేయడం నేరమని చెప్తున్నం. మా ఇళ్లలో పిల్లలందరూ చదువుకుంటున్నరు. పొలం పని చేస్తున్నరు. పెద్ద ఉద్యోగాలకంటే ఎక్కువ రాబడి చిట్టి గింజల మీద వస్తుంటే సేద్యం ఎందుకు చేయరు? పెద్ద పంటలేసి విదేశాల సంస్థల గింజలు కొని, పంటల చీడపీడలకు మందులు చల్లి ఆ ఖర్చులు తిరిగి రాక రైతులు చచ్చిపోతున్నారు. మేము తెగుళ్లకు బెల్లం నీళ్లు చల్లుతాం. బెల్లం నీటికి చీమలు వస్తాయి, చీడ పురుగును కూడా తినేస్తాయి. మనసు పెట్టి చేస్తే మట్టిలో బంగారం పుడుతుంది. ఆ సంగతి నిరూపించాం. 
– తలారి సుమిత్ర, ఎడాకుల పల్లి, సంగారెడ్డి జిల్లా, ‘నారీశక్తి’ అవార్డు గ్రహీత  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement